Top
logo

హైదరాబాద్‌‌ అతలాకుతలం.. చెరువులను తలపిస్తున్న కాలనీలు

హైదరాబాద్‌‌ అతలాకుతలం.. చెరువులను తలపిస్తున్న కాలనీలు
Highlights

-భాగ్యనగరంలో ఎటు చూసిన జల దిగ్బంధం - చెరువులను తలపిస్తోన్న కాలనీలు - కాలువలుగా మారిన రహదారులు - ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి -ఇళ్లల్లోకి వరద నీరు వచ్చేసిన దుస్థితి -మరో రెండు రోజుల వర్ష సూచన నేపథ్యంలో ఆందోళన -మల్కాజ్‌గిరిలో పడవలపై వెళ్లి పాలప్యాకెట్ల పంపిణీ -బేగంపేటలో నీట మునిగిన దేవనర్ అంధుల పాఠశాల - రాజేంద్రనగర్‌లో కాలువలా మారిన ప్రధాన రహదారి

ఎల్బీ నగర్ నుంచి బీహెచ్‌ఈఎల్ వరకు అటు రాజేంద్ర నగర్‌ నుంచి మల్కాజ్‌గిరి వరకు హైదరాబాద్‌‌లో ఎటు చూసినా భారీ వర్షాలకు కాలనీలు జలమయం అయ్యాయి. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డ్రెయినేజీలు పొంగి కాలనీలు చెరువులుగా కాలువలుగా మారాయి. భాగ్యనగరం జలనగరంగా మారిందా అనిపిస్తోంది. ప్రజలు పడుతున్న ఇబ్బందులను హెచ్‌ఎంటీవీ అందించే ప్రయత్నం చేస్తోంది. ఏ ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉందో చూపిస్తోంది.

గురువారం అర్ధరాత్రి హైదరాబాద్‌ నగరాన్ని కుంభవృష్టి అతలాకుతలం చేసింది. వారం రోజుల నుంచి సాయంత్రం అయ్యేసరికి మొదలయ్యే వాన నిన్న పగలంతా కురవకపోవడంతో నగర ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే రాత్రి 11 గంటల తర్వాత మళ్లీ జడివాన మొదలైంది.

దాదాపు వంద బస్తీలు ముంపులో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. మంగళవారం, బుధవారం కురిసిన భారీ వర్షాలకు నీట మునిగిన కాలనీల ప్రజలు మళ్లీ వరద ఎక్కడ ముంచెత్తుతుందో అని ఆందోళనకు గురయ్యారు. పంజాగుట్ట ప్రాంతంలో వరద నీరు రహదారులను ముంచెత్తడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాజ్‌భవన్‌ రహదారి పూర్తిగా నీట మునిగింది.

బేగంపేటలో దేవనర్ అంధుల పాఠశాల రాత్రి వర్షానికి నీట మునిగింది. నీరు ఎటుపోయే మార్గం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్కూల్ చుట్టుముట్టి అక్రమ నిర్మాణాల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని అంటున్నారు.

బేగంపేట్ ప్రకాష్ నగర్‌లో ఇళ్లల్లోకి వరద నీరు చేసింది. డ్రెయినేజీలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లు కాలువలుగా మారాయి. మొండా మర్కెట్ నుంచి బోయిగూడా వెళ్లే రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద వరద నీరు చేరింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

రాత్రి కురిసిన వర్షానికి హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే అండర్ పాస్ వద్ద భారీగా నీరు నిలిచిపోయింది. దీంతో ఆఫీసులకు వెళ్లే సాఫ్ట్ వేర్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలు వెళ్లడానికి అవకాశం లేక ట్రాఫిక్ జమైంది. సాధారణ రోజుల్లోనే ట్రాఫిక్ ఉండే ఈ ప్రాంతంలో వర్షం నీరు నిలిచిపోవడంతో మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

హైదరాబాద్ నగరంలో పడవలపై ప్రయాణించాల్సిన పరిస్థితి వచ్చేసింది. మల్కాజ్‌గిరి ఈస్ట్ ఆనంద్ బాగ్‌లో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి ఈ ప్రాంతం మొత్తం చెరువులా మారింది. కనీసం ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. దీంతో జీహెచ్ఎంసీ సహాయక సిబ్బంది పడవల ద్వారా వెళ్లి పాల ప్యాకెట్లు, ఆహార పదార్థాలు అందించారు.

రాత్రి వర్షానికి నాచారంలో పటేల్ కుంట చెరువు పొంగుతోంది. దీంతో ఆ ప్రాంతంలో రోడ్లు కాలువలను తలపిస్తున్నాయి. నాలాలు పొంగితుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎర్రకుంట వాసులకు రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి.

రాత్రి కురిసిన వర్షానికి గుడి మల్కాపూర్ శారదా నగర్‌ వద్ద పాత ప్రహారీ గోడ కూలిపోయింది. దీంతో ఒక కారు ధ్వంసమైంది. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

గత రెండు రోజుల నుండి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భాగ్యనగరం అతలాకుతలం అవుతోంది. ఎక్కడ చూసినా వాన నీటితో ఇబ్బందులు నగర వాసులు పడుతున్నారు. గుడ్డి మల్కాపూర్ మార్కెట్లో కూరగాయలు అమ్ముకోడానికి వచ్చిన రైతులు తాము తెచ్చిన కూరగాయలు వర్షానికి పాడవుతున్నాయని వాపోతున్నారు.

మెహిదీపట్నం రాజేంద్రనగర్‌ మార్గంలో కూడా నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆరాంఘర్‌ చౌరస్తా నుంచి విమానాశ్రయం వరకూ వంతెన నిర్మాణ పనులు జరుగుతుండడంతో ఆ మార్గంలో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

ఎల్‌బీనగర్‌ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన వరదతో బైరామల్‌గూడ, చింతలకుంట చెక్‌పోస్టు నీట మునిగాయి. కర్మన్‌ఘాట్‌, సాగర్‌ రింగు రోడ్డు పరిసర కాలనీల ప్రజలు వరద ముప్పు ఉంటుందని ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్ కూకట్ పల్లి ప్రాంతంలో పలు కాలనీలు జలమయం అయ్యాయి. ఇళ్ల నుంచి రాలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లల్లోకి చేరుకునన నీటిని మోటార్లతో తోడుతున్నారు.


లైవ్ టీవి


Share it
Top