Hyderabad: డేంజర్ జోన్‌లోకి హైదరాబాద్‌

‌Hyderabad in Danger Zone With the High Pollution
x

అధిక వాయు కాలుష్యంతో డేంజర్ జోన్లో హైదరాబాద్ సిటీ (ఫోటో ది హన్స్ ఇండియా)

Highlights

Hyderabad: భాగ్యనగరాన్ని కమ్మేస్తున్న వాయు కాలుష్యం

Hyderabad: హైదరాబాద్ మహానగరంపై వాయు కాలుష్య మహమ్మారి మళ్లీ ప్రతాపం చూపుతోంది. కరోనా వల్ల విధించాల్సి వచ్చిన లాక్‌డౌన్‌ కారణంగా భారీగా తగ్గిన కాలుష్యం ఇప్పుడు విపరీతంగా పెరుగుతోంది. నగరంలో కాలుష్యం ఇప్పుడు ఢిల్లీతో పోటీ పడుతోందని సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ తాజా అధ్యయనంలో వెల్లడించింది. నగరంలో మోటారు వాహనాల ద్వారానే వాయు కాలుష్యం పెరిగిపోతున్నట్లు గుర్తించారు. వాటి నుంచి వెలువడే నైట్రోజన్‌ డయాక్సైడ్‌ పెద్ద మొత్తంలో వెలువడుతున్నట్లు నిపుణులు వెల్లడించారు.

హైదరాబాద్‌‌తో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో గాలి నాణ్యత క్షిణిస్తుంది. కొద్ది రోజులుగా వాయు కాలుష్యం స్థాయి పెరుగుతూ వస్తుంది. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్న కొద్దీ వాయు కాలుష్య ప్రభావం పెరుగుతూ వస్తోంది. నవంబర్ నుండి జనవరి మధ్య కాలంలో ఉష్ణోగ్రతలు పడిపోతాయి. ఇలాంటి పరిస్థితుల్లో గాలి నాణ్యత మరింత క్షిణిస్తుంది. ఈ ప్రభావం పిల్లలు, వృద్ధులు, ఆస్తమా, గుండె జబ్బులు ఉన్నవారిపై ఎక్కవగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నగరవాసులను ఇప్పడు ఈ భయం వెంటాడుతోంది.

నగరంలోని వాహనాల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. వాహనాల నుండి వెలువడే నైట్రోజన్ డయాక్సిడ్‌తో వాయుకాలుష్యం తీవ్రరూపం దాలుస్తుంది. అటు హైదరాబాద్‌, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో అతిసూక్ష్మ ధూళికణాలు పరిమితికి మించి నమోదవుతున్నాయి. ఈ నెలలో ఇప్పటివరకు CPCB గణాంకాల ప్రకారం.. సనత్‌నగర్‌లో పీఎం 2.5 స్థాయి 52.32 మైక్రో గ్రాములుగా, ఐడీఏ బొల్లారంలో 48.85, జూపార్క్‌లో 58, ఇక్రిశాట్‌ 41.71, సెంట్రల్‌ యూనివర్సిటీ 37.48, ఐడీఏ పాశమైలారం వద్ద 42.8 మైక్రో గ్రాములుగా నమోదయ్యాయి. CPCB ప్రమాణాల ప్రకారం పీఎం 2.5 గరిష్ఠ పరిమితి ఘనపు మీటరు గాలిలో 40 మైక్రో గ్రాములు మించకూడదు. కానీ పరిస్థితులు అందుకు బిన్నంగా ఉన్నాయి.

రవాణా శాఖ, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏలు ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపర్చడంపై దృష్టిసారించడం లేదని నగరవాసులు అంటున్నారు. వాయు కాలుష్యం మానవాళి మనుగడకు తీవ్ర ప్రమాదమని తెలిసినా దాని నియంత్రణ చర్యలు నామమాత్రంగానే ఉన్నాయని ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories