హుజూరాబాద్ టీఆర్‌ఎస్‌లో వర్గ పోరు.. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి వర్సెస్ గెల్లు శ్రీనివాస్...

Huzurabad TRS leaders Kaushik Reddy vs Gellu Srinivas | TRS Latest News
x

హుజూరాబాద్ టీఆర్‌ఎస్‌లో వర్గ పోరు.. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి వర్సెస్ గెల్లు శ్రీనివాస్...

Highlights

Huzurabad: కొత్తవారికి ప్రాధాన్యత కల్పించడంపై నేతల్లో నైరాశ్యం...

Huzurabad: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం గులాబీ పార్టీ లో విబేధాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి , పార్టీ ఇంచార్జి గెల్లు శ్రీనివాస్ మధ్య కోల్డ్ వార్ కాస్త రహస్య సమావేశాల దాక వెళ్లింది. అసలు హుజురాబాద్ లో టీఆరెస్ లో ఏం జరుగుతోంది. హుజురాబాద్ అధికార పార్టీలో వర్గపోరు రచ్చకెక్కిందా.. ఇద్దరు నాయకుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడిందా.. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారా...అంటే అవుననే అంటున్నారు క్యాడర్ .... నిన్న మొన్నటి వరకు రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారిన ఈ నియోజకవర్గంలో ఇప్పుడు టీఆరెఎస్ అధిష్టానానికి సరికొత్త తలనొప్పి ప్రారంభం అయినట్టుగా ఉంది.

ఇప్పటి వరకు చాపకింద నీరులా ఉన్న హుజురాబాద్ వర్గపోరు ఒక్కసారిగా రచ్చకెక్కింది. నియోజకవర్గంలోని హుజురాబాద్, జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక, కమలాపూర్ మండలాల్లోని సెకండ్ క్యాడర్ అసమ్మతి గళం వినిపించడం ఆరంభించింది. మండలాల వారీగా ద్వితీయ శ్రేణి నాయకులంతా సమావేశాలు ఏర్పాటు చేసుకుని పార్టీలో గుర్తింపు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో మొదటి నుండి ఉన్న తమను కాదని ఉప ఎన్నికలు, ఆ తరువాత గులాబీ కండువా కప్పుకున్న వారికి ప్రాధాన్యత కల్పించడంపై వీరు తమ నైరాశ్యాన్ని వెల్లగక్కుతున్నారు.

కొంతమంది నాయకులు గెల్లు కి మద్దతుగా నిలబడగా ..మరికొందరు పాడి వైపున్నారు. ఇద్దరిని తీరుని వ్యతిరేకిస్తున్నారు ఇక మరికొందరు. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి తీరును తప్పుబడుతున్నారు మరికొందరు ...ఆయన వెంట వచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నాడని, మిగతా వారిని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీణవంక మండలంలో జరిగిన సమావేశంలో ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. మంత్రులు కూడా కౌశిక్ రెడ్డి నిర్ణయాలనే అమలు చేస్తున్నారని, తమ అభిప్రాయాలను పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్య మంత్రి కేసీఆర్ జోక్యం చేసుకోవాలని కోరుతోంది హుజురాబాద్ క్యాడర్.

మరో వైపు కౌశిక్ రెడ్డి హైదరాబాద్ కేంద్రంగా మంత్రాంగం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. నియోజవకర్గంలో తనపై వ్యతిరేకంగా సమావేశాలు ఏర్పాటు చేశారన్న సమాచారం అందుకున్న కౌశిక్ రెడ్డి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తోంది. నియోజకవర్గంలోని స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను హైదరాబాద్ కు పిలిపించుకుని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ తో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ది పనుల గురించి ప్రజా ప్రతినిధులు చర్చించారు. తనకు వ్యతిరేకంగా జట్టు కట్టారని తెలుసుకున్న కౌశిక్ రెడ్డి తనకు అనుకూలంగా నియోజకవర్గంలో క్యాడర్ ఉందని చెప్పకనే చెప్పేందుకే ప్రజా ప్రతినిధులను హైదరాబాద్ కు రప్పించుకుని బోయినపల్లి వినోద్ కుమార్ తో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయించారని అంటున్నారు హుజురాబాద్ నాయకులు.

కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ అయిన తరువాత వేసిన రెండు కమిటీలతోనే వ్యతిరేకత బట్టబయలైంది. సమ్మక్క సారలక్క జాతర సందర్భంగా వీణవంక మండలం కేంద్రానికి చెందిన కమిటీని వేయించారు. ఇది వివాదాస్పదం అయ్యింది. అలాగే తాజాగా ఇల్లందకుంట రామాలయ కమిటీని వేసినట్టు ప్రచారం జరిగింది. కమిటీ ఛైర్మన్ తో పాలకవర్గ సభ్యుల గురించి వెలుగులోకి రావడంతో కౌశిక్ రెడ్డి వ్యవహరశైలిని తప్పు పడుతూ హుజురాబాద్ నియోజకవర్గ నాయకులు ముఖ్యనాయకులకు సమాచారం చేరవేశారు. పార్టీలో సీనియర్లను కాదని ఇటీవల చేరిన వారికి ఎలా నామినేటెడ్ పోస్టులు ఇస్తారని అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఇలాగే వదిలేస్తే పరిస్థితి తమ చేయి దాటిపోయే ప్రమాదం ఉందని భావించిన హుజురాబాద్ నాయకులు ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసి తమ ఆవేదనను వెల్లగక్కడం ఆరంభించారు. ఇందులో కౌశిక్ రెడ్డి సొంతమండలం వీణవంకకు చెందిన టీఆరెఎస్ నాయకులు అసమ్మతి గళాన్ని వినిపించారు. మరో వైపు గెల్లు శ్రీనివాస్ పాడి కౌశిక్ రెడ్డి దూకుడు ఆపలేకపోతున్నారని ...ఆయన నియోజకవర్గంలో ఉన్న సీనియర్ లని పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి...ఈ ఇద్దరు మారకపోతే ఉగాది తరువాత మరింతగా నిరసన తెలుపుతామంటోంది క్యాడర్ .. ఇప్పుడు లీడర్ల కి వ్యతిరేకంగా క్యాడర్ పోరాటం ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి .

Show Full Article
Print Article
Next Story
More Stories