విక్రమ్‌ వెల్‌కమ్ పార్టీలో రాజాసింగ్ జాడ ఏది.. రాజాసింగ్ పొలిటికల్ కెరీర్ ఎలా టర్న్ తిరగబోతోంది?

విక్రమ్‌ వెల్‌కమ్ పార్టీలో రాజాసింగ్ జాడ ఏది.. రాజాసింగ్ పొలిటికల్ కెరీర్ ఎలా టర్న్ తిరగబోతోంది?
x
Highlights

గోషామహల్‌ కాంగ్రెస్ యంగ్ లీడర్‌ విక్రమ్‌ గౌడ్‌ కాషాయతీర్థం పుచ్చుకున్నారు. డీకే అరుణ దగ్గరుండి కమలం కండువా వేయించారు. మరి గోషామహల్‌ ఎమ్మెల్యే...

గోషామహల్‌ కాంగ్రెస్ యంగ్ లీడర్‌ విక్రమ్‌ గౌడ్‌ కాషాయతీర్థం పుచ్చుకున్నారు. డీకే అరుణ దగ్గరుండి కమలం కండువా వేయించారు. మరి గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌, విక్రమ్‌ వెల్‌కమ్‌ పార్టీలో ఎందుకు లేడు? విక్రమ్‌ గౌడ్ బీజేపీలోకి రావడం, రాజాసింగ్‌కు అసలు ఇష్టమే లేదా? విక్రమ్‌ వస్తే, రాజాసింగ్‌కు కష్టమేనా? అన్నీ తెలిసే బీజేపీ పెద్దలు వలసకు రెడ్‌ కార్పెట్ వేశారా? రాజాసింగ్‌కు చెక్‌ పెట్టేందుకే, విక్రమ్‌ను తీసుకొస్తున్నారన్న వాదనలో నిజమెంత? రానున్న రోజుల్లో గోషామహల్‌ రాజకీయం ఎలా వుండబోతోంది? రాజాసింగ్ పొలిటికల్ కెరీర్ ఎలా టర్న్ తిరగబోతోంది?

గోషామహల్. హైదరాబాద్‌లో ఒకప్పుడు కాంగ్రెస్‌ అడ్డా. కాంగ్రెస్ దివంగత నేత ముఖేష్‌ గౌడ్‌కు పెట్టని కోట. రాష్ట్ర విభజన తర్వాత, అక్కడ రాజకీయం మారిపోయింది. బీజేపీ కాంట్రావర్సియల్ లీడర్ రాజాసింగ్‌ అక్కడ జెండా పాతేశారు. వరుసగా గెలుస్తూ, గోషామహల్‌ను కంచుకోటగా మలచుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఓడిపోయినా, గోషామహల్‌ నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగరేశారు రాజాసింగ్. గోషామహల్‌లో తనకు తిరుగులేదని నిరూపించారు. ఇప్పుడా కోటను బద్దలు చేసేందుకే అన్నట్టుగా, సొంత పార్టీ నేతలే వ్యూహాలు రచిస్తున్నారట.

విక్రమ్‌ గౌడ్. ముఖేష్ గౌడ్ కుమారుడు. గ్రేటర్‌ కాంగ్రెస్‌లో యంగ్‌ లీడర్. గోషామహల్‌లో తిరుగులేని నేతగా చక్రంతిప్పిన ముఖేష్ వారసుడు. ఇప్పుడు విక్రమ్‌ గౌడ్, కాషాయ గూటికి. కాంగ్రెస్ మాజీ నేత, ప్రస్తుతం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్వయంగా ఆయన దగ్గరకెళ్లి, పార్టీలోకి ఆహ్వానించారు. బల్దియా ఎన్నికల్లో బీజేపీకి బూస్టింగ్‌ ఇచ్చేందుకే, విక్రమ్‌‌ను పార్టీలోకి తీసుకుంటున్నామని కాషాయ నేతలు చెబుతున్నా, ఇన్‌డైరెక్టుగా రాజాసింగ్‌కు చెక్ పెట్టేందుకేనన్న చర్చా జరుగుతోంది.

గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు, ప్రస్తుత రాష్ట్ర బీజేపీ కీలక నేతల్లో ఎవరితోనూ సత్సంబంధాల్లేవు. అందరితోనూ గొడవలే. కిషన్‌ రెడ్డి, లక్ష్మణ్‌లే కాదు, కొత్తగా అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న బండి సంజయ్‌తోనూ రాజాసింగ్‌కు రగడే. తన నియోజకవర్గంలో కార్పొరేటర్ టికెట్లను, తనతో సంప్రదించకుండానే, తాను వద్దంటున్నవారికే కట్టబెట్టారని మొన్న రగిలిపోయారు రాజాసింగ్. బండి సంజయ్ తనను మోసం చేశారని ఆరోపించారు. రాష్ట్ర పార్టీలో ఏం జరుగుతుందో, త్వరలోనే పార్టీ అధినాయకత్వానికి లేఖ రాస్తానని కూడా చెప్పారాయన. కొంతమందికి టికెట్లు ఇవ్వొద్దు అని రాజాసింగ్ చెప్పడం వెనక చాలా స్టోరీలున్నాయట. ఎవరైనా బలమైన నేతలు కార్పొరేటర్‌గా గెలిస్తే, ఎమ్మెల్యే అభ్యర్థిత్వం కోసం పోటీ పడతారని, తనకు ఎసరు పెడతారన్నది రాజాసింగ్‌ ఇన్‌సెక్యూర్‌ ఫీలింగ్‌ అట. అందుకే గెలిచేవారికి ఎవరికీ ఇవ్వొద్దని పట్టుబట్టారట. ఆ కారణంతోనే చివరి వరకు గోషామహల్‌లో అభ్యర్థులను ప్రకటించలేకపోయింది రాష్ట్ర బీజేపీ. ఇలాగైతే పార్టీకే నష్టమని భావిస్తున్న కమలం నేతలు, రాజాసింగ్‌కు చెక్‌ పెట్టాలని డిసైడయ్యారట. ఆ క్రమంలోనే గోషామహల్‌లో హవా నడిపించగల, విక్రమ్‌ గౌడ్‌ను పార్టీలోకి ఆహ్వానించారట.

మరి విక్రమ్‌ గౌడ్‌ రాకతో, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఎవరికిస్తారన్నది ఇప్పుడు ప్రశ్న. విక్రమ్‌కు మరో సెగ్మెంట్‌ అప్పగిస్తారా లేదంటే రాజాసింగ్‌ను మరో చోటికి వెళ్లమంటారా అన్న అంశాలపై ఎవరికివారే తమకు తోచినరీతిలో మాట్లాడుకుంటున్నారు. రాజాసింగ్‌ను ఎంపీగా నిలబెడతారన్న ప్రచారమూ జరుగుతోంది. గత ఎన్నికల్లోనే హైదరాబాద్‌ నుంచి పోటీ చెయ్యమంటే తాను చెయ్యనన్న రాజా, సికింద్రాబాద్‌ అయితే ఓకే అన్నారట. కానీ కిషన్‌ రెడ్డి వుండటంతో ఆ ఎంపీ సీటివ్వలేదు అధిష్టానం. వచ్చే ఎన్నికల్లో రాజాసింగ్‌ను జహీరాబాద్‌ ఎంపీ స్థానానికి పోటీకి పంపవచ్చన్నది వినిపిస్తున్న మరో చర్చ. జహీరాబాద్ మహారాష్ట్ర బోర్డర్ కావడం, అక్కడ లంబాడాలు, శివసేన ప్రాబల్యం వుండటంతో, రాజాసింగ్‌కు కలిసొస్తుందని కూడా ఆలోచిస్తున్నారట కమలం పెద్దలు. మొత్తానికి ఇప్పటికే అనేక గొడవలతో రగిలిపోతూ, కుమిలిపోతున్న రాజాసింగ్‌కు, రానున్న కాలం మరింత టఫ్ టైమే. స్థాన చలనం తప్పకపోవచ్చంటున్నారు. విక్రమ్‌ గౌడ్‌ బీజేపీలోకి రావడమే అందుకు సంకేతమంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories