షర్మిల వెనక సూత్రధారులెవరు? పాత్రధారులెవరు?

షర్మిల వెనక సూత్రధారులెవరు? పాత్రధారులెవరు?
x

షర్మిల వెనక సూత్రధారులెవరు? పాత్రధారులెవరు?

Highlights

తెలంగాణ రాజకీయాల్లోకి ఓ బాణం దూసుకొస్తోంది. తెలంగాణే తన పుట్టిల్లు, మెట్టినిల్లు అంటున్న ఆ బాణం, రాజన్న రాజ్యం తెస్తానంటోంది. ఆ బాణం వదిలింది...

తెలంగాణ రాజకీయాల్లోకి ఓ బాణం దూసుకొస్తోంది. తెలంగాణే తన పుట్టిల్లు, మెట్టినిల్లు అంటున్న ఆ బాణం, రాజన్న రాజ్యం తెస్తానంటోంది. ఆ బాణం వదిలింది బీజేపీనంటూ టీఆర్ఎస్, కాంగ్రెస్ ఆరోపిస్తుంటే, కాదుకాదు కేసీఆరే జగన్‌తో కలిసి సంధించారంటూ కమలదళం, ఖద్దరు గణం రివర్స్ కౌంటర్ వేస్తున్నాయి. తాను ఎవరో వదిలిన బాణాన్ని కాదంటూ ఆమె కూడా అంతే ఘాటుగా ఆన్సరిస్తున్నారు. ఇంతకీ ఎవరి బాణం...ఎవరిపై బాణం?

ఎవరూ ఊహించలేదు. ఎవరూ భావించలేదు. అంతా పుకార్లు, కట్టుకథలంటూ కొట్టివేశారు. కానీ అదే నిజమైంది. ఏపీలో అన్నను అధికారంలోకి తెచ్చేందుకు ఊరురా తిరిగిన ఆ చెల్లెమ్మ, ఒక్కసారిగా ఏపీ నుంచి తెలంగాణపైకి తన చూపు మళ్లించారు. ఇంతకీ షర్మిల బాణం లక్ష్యమేంటి...ధైర్యమేంటి? వ్యూహమేంటి...ఎత్తుగడలేంటి?

వైఎస్ షర్మిల. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారాల కూతురు. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి చెల్లెలు. ఇవాంజిలిస్ట్ బ్రదర్ అనిల్ కుమార్ సతీమణి. జగన్ ఇబ్బందుల్లో వున్న టైంలో పాదయాత్ర చేశారు. జగనన్న వదిలిన బాణాన్నంటూ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేసి, వైసీపీ అధికారంలోకి రావడానికి తనవంతు పాత్ర పోషించారు. ఆ తర్వాత ఎందుకనో సైలెంటయ్యారు. లోక్‌సభకు పోటీ చేస్తారని ఒకసారి ప్రచారం, కాదు రాజ్యసభకు పంపుతారంటూ మరోసారి, వైసీపీకి వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తారని, ఇలా ఎన్నో ప్రచారాలు జరిగాయి. అన్నపై చెల్లి అలిగారని కూడా ప్రచారం జరిగింది. ఏపీలో అన్నను ఎదురించడం ఎందుకనుకున్నారో ఏమోకానీ, నిశ్శబ్దాన్ని బద్దలు చేస్తూ, ఎవరూ ఊహించని సంచలనానికి తెర తీశారు వైఎస్ షర్మిల. తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ, రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్టు ప్రకటించారు. తెలంగాణలోనే పుట్టాను, తెలంగాణ కోడలినన్న షర్మిల, కేసీఆర్, విజయశాంతి ఎక్కడివారు, జయలలిత ఎక్కడ పుట్టారు, ఎక్కడ సీఎం అయ్యారంటూ దీటుగానే విమర్శలకు బదులిచ్చారు. ఇంతకీ వైఎస్ కూతురిలో తెలంగాణ పట్ల ఇంత తెగింపు ఏంటి? ఆమె పార్టీ బతికి బట్టకట్టకలుగుతుందా? మరో కొత్త పార్టీకి చాన్సివ్వడానికి తెలంగాణలో రాజకీయ శూన్యత వుందా? షర్మిల వ్యూహమేంటి? ఎత్తుగడలేంటి?

తెలంగాణలో నిన్న మొన్నటి వరకు పుట్టుకొచ్చిన రాజకీయ పార్టీలే స్థిరపడడానికి అనేక అవస్థలు పడుతున్నాయి. తెలంగాణ ఏర్పాటులో కీలంగా వ్యవహరించి అన్ని పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చిన తెలంగాణ జేఏసి చైర్మెన్ కోదండరాం, తెలంగాణ జనసమితి స్థాపించినా ఎలాంటి ప్రభావం చూపలేకపోతున్నారు. గతంలో దేవేందర్ గౌడ్ సైతం పార్టీ పెట్టి మూసేశారు. విజయశాంతి కూడా అంతే. ఆంధ్ర పార్టీగా ముద్రపడిన టీడీపీ దాదాపు కనుమరుగు. ఇంకా అనేకమంది ప్రముఖ ఉద్యమకారులు సైతం పార్టీలు పెట్టారని కానీ, జనంలోకి తీసుకెళ్లలేకపోయారు. తెలంగాణ పార్టీలే తెలంగాణలో మనుగడ సాగించలేక చతికిలబడిన పరిస్ధితుల్లో, ఆంధ్రా నేపథ్యమున్న, సమైక్యాంధ్రకే జైకొట్టిన పార్టీకి ప్రచారం చేసిన షర్మిలకు, తెలంగాణలో స్థానముంటుందా అంటూ అప్పుడే చర్చ కూడా మొదలైంది. అయితే, తెలంగాణ కాంగ్రెస్‌ దీనావస్థలో వుండటం, బీజేపీ దాని స్థానాన్ని ఆక్రమిస్తున్న తరుణంలో తనకూ అవకాశం వుంటుందన్న ఆలోచనతోనే షర్మిల, కొత్త పార్టీతో అద్రు‌ష్టం పరీక్షించుకుంటున్నారని రాజకీయ పండితుల విశ్లేషణ.

తెలంగాణలో ఇప్పటికీ సెంటిమెంట్ బలంగా వుంది. కేసీఆర్ అమ్ములపొదిలో అది ఎప్పటికైనా బ్రహ్మాస్త్రమే. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రా నాయకుడు చంద్రబాబుకు తెలంగాణలో పనేంటి, మళ్లీ కుట్రలు చెయ్యడానికి వస్తున్నారంటూ కేసీఆర్ విసిరిన భావోద్వేగాస్త్రాలు, గులాబీకి విజయాన్ని అందించాయి. ఇలా ఆంధ్రా పార్టీలపై తెలంగాణలో అంత సానుకూల పరిస్తితులు లేని తరుణంలో, షర్మిల కొత్త పార్టీ మనుగడపై రకరకాల చర్చ జరుగుతోంది. అయితే, షర్మిల లెక్కలు షర్మిలకున్నాయనే వారూ వున్నారు. ఇంతకీ షర్మిల ధైర్యమేంటి? ఆమె వ్యూహమేంటి? నిజంగా షర్మిల పార్టీ వెనక సూత్రధారులు వేరే వున్నారా?

వైఎస్ఆర్ చరిష్మా. అదే తనకు బూస్టింగ్ అనుకుంటున్నారా షర్మిల? నిజంగా వైఎస్‌‌ను అభిమానించేవారంతా షర్మిలకు జైకొడతారా? ప్రాంతాలకు అతీతంగా వీర తిలకం దిద్దుతారా? గత అనుభవాలు ఏం చెబుతున్నాయి?

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చరిష్మానే నమ్ముకుని, తెలంగాణలో రాజకీయ ఆరంగేట్రానికి వ్యూహాలు రచిస్తున్నారు షర్మిల. ఆరోగ్యశ్రీ, ఫీజు రీఎంబర్స్‌మెంట్ పథకాలు, కుయ్‌కుమ్ మంటూ వచ్చే 108 వా‍హనాలంటే ఇఫ్పటికీ తెలంగాణలో వైఎస్‌ఆర్ గుర్తుకు వస్తారని, సీఎం కేసీఆర్‌తో పాటు అనేకమంది చాలాసార్లు అన్నారు. గతంలో ఆయనతో దాదాపు పదేళ్లు పనిచేసిన ప్రముఖ నేతలంతా వైఎస్ అంటే ఎనలేని విధేయత ఉన్నవాళ్లే. ఆయన మరణం తరువాత చాలామంది తెలంగాణ నేతలు, ఆయన కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెంట వెళ్లకుండా, కాంగ్రెస్ అధిష్టానం వైపు మొగ్గుచూపారు. మాజీ మంత్రికొండా సురేఖ దంపతులు, బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వాళ్లు, పుత్తా ప్రతాప్ రెడ్డి, శివకుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు కొందరు ఖమ్మం జిల్లా నేతలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీతో కలిసి నడిచారు. జిట్టా బాలకృష్టారెడ్డి, రాణిరుద్రమ, మహేందర్ రెడ్డిలాంటి వాళ్లు జగన్ తో సాగారు. 2014లో కొన్ని సీట్లను గెలుచుకుంది వైసీపీ.

కానీ అప్పటికి ఇప్పటికి పూర్తిగా పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. తెలంగాణ ఏర్పాటు తరువాత ఇక్కడ ఆంద్రపార్టీలు మనుగడ సాగించడం కష్టం అనే భావనతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పూర్తిగా పార్టీని ఆంధ్రప్రదేశ్ కే పరిమితం చేశారు. టీడీపీ కూడా దాదాపు కనుమరుగయ్యే పరిస్థితి. ఇప్పుడు మళ్లీ వైఎస్ షర్మిల కొత్త పార్టీ నినాదం ఎత్తుకున్న నేపథ్యంలో, ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుందో రాదో అనే అనుమానాలు కూడా ఉన్నాయి. నాడు వైఎస్ వెంట, తర్వాత జగన్ వెంట నడిచిన తెలంగాణ నేతలు ఇప్పుడు షర్మిల వెంట నడుస్తారా అన్నది కూడా మరో ప్రశ్న. అయితే నాయకులు ఎవరొచ్చినా, రాకున్నా కేవలం వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి చరిష్మా, జనంలో ఆయనకున్న బలమే తనను నడిపిస్తాయని షర్మిల అంటున్నారు. వైఎస్ చరిష్మానే కాదు, సామాజిక సమీకరణలు కూడా షర్మిల కాన్ఫిడెన్స్‌కు కారణమన్న విశ్లేషణలు సాగుతున్నాయి.

సామాజిక సమీకరణలు ఏ పార్టీకైనా కీలకమైన అస్త్రాలు, బలాలు. ఇప్పుడు వైఎస్ షర్మిల కూడా, అవే సోషల్ ఈక్వేషన్స్‌నే నమ్ముకున్నారని అర్థమవుతోంది. పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్‌, సోషల్ ఇంజినీరింగ్‌‌ స్కెచ్‌లో నిమగ్నమయ్యారట. ఇంతకీ షర్మిల నమ్ముకున్న ఆ సామాజిక వర్గాలేంటి? తెలంగాణలో ఈ లెక్కలు షర్మిలకు కలిసొస్తాయన్న వాదనలో బలముందా? లేదంటే అతిశయమేనా? షర్మిల పార్టీతో ఎవరికి లాభం ఎవరికి నష‌్టం?

షర్మిల డిసైడయ్యారు తెలంగాణలో పార్టీ పెట్టేయ్యాలని. పాదయాత్రతో తెలంగాణ మొత్తం తన తండ్రిలా చుట్టేయ్యాలని ఫిక్సయ్యారు. వైఎస్ పథకాలు, సామాజిక సమీకరణలు, రాజకీయ శూన్యత తనను ప్రబలమైన శక్తిగా మార్చి, సంకీర్ణంలో కింగ్ మేకర్‌ను చేస్తాయని ఆమె నమ్ముతున్నారు. ఎవరి కాన్ఫిడెన్స్ వారిదే. ఎవరి లెక్కలు వారివే. అంతిమంగా డిసైడ్ చెయ్యాల్సిందే జనమే.

ఉమ్మడి రాష్ట్రంలో కొన్ని వర్గాలు వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డికి కంచుకోటలు. క్రిస్టియన్లు, ముస్లింలు వైఎస్‌కు వీరతిలకం దిద్దారు. ఇక రెడ్డి సామాజికవర్గం వైఎస్‌కు పెట్టని కోట. వైఎస్ మరణం, తెలంగాణ ఏర్పాటు తర్వాత సమీకరణలు మారాయి. కాంగ్రెస్‌కు కీలక మద్దతుదారులైన క్రిస్టియన్లు, ముస్లింలు టీఆర్ఎస్‌, ఎంఐఎంకు స్లోగా షిప్ట్‌ అవుతున్నారు. కాంగ్రెస్‌కు సపోర్ట్‌గా వుండే రెడ్డి వర్గంలో కీలక నేతలంతా, ఇప్పటికీ గాంధీభవన్‌నే అట్టిపెట్టుకున్నా, అటు బీజేపీ వైపు కూడా చూస్తున్నారు. చెల్లాచెదురైన ఈ వర్గాలు తిరిగి తనవైపు చూస్తారని భావిస్తున్నారట షర్మిల.

షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ ఇవాంజిలిస్ట్. దీంతో దళితులు, క్రిస్టియన్లు తనవైపే వస్తారని షర్మిల లెక్క. ఇక ముస్లింలనూ తన వైపు తిప్పుకోవడానికి మోటివేటర్ బ్రదర్ షఫీని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. క్రిస్టియన్లు, ముస్లిం మైనార్టీలు, రెడ్డి వర్గం ఓటు బ్యాంకుతో ప్రబలమైన శక్తిగా అవతరించవచ్చని, సోషల్ ఇంజినీరింగ్‌ను నమ్ముకున్నారట షర్మిల. అయితే, ఆంధ్రా నుంచి వచ్చిన షర్మిల వైపు తెలంగాణ రెడ్డి వర్గం ఎందుకు మొగ్గుచూపుతుందని, కొందరు నేతలంటున్నారు.

సామాజిక సమీకరణల లెక్కలు ఎలా వున్నా, షర్మిల పార్టీతో ఎవరికి లాభం ఎవరికి నష్టం అన్న చర్చ కూడా జోరందుకుంది. కాంగ్రెస్‌ ఓటు బ్యాంకును కొల్లగొట్టి తనకు మేలు చేసేందుకే, బీజేపీ, షర్మిలతో గేమ్ ఆడిస్తోందని టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. బీజేపీ-జగన్‌లు వదిలిన బాణం షర్మిల అంటున్నారు. అయితే, షర్మిల పార్టీ వెనక సూత్రధారి కేసీఆర్ అంటూ బీజేపీ, కాంగ్రెస్ నేతలు సైతం ఆరోపిస్తున్నారు. ఎదగుతున్న బీజేపీకి అడ్డుకట్ట వేసేందుకే జగన్‌తో కలిసి కేసీఆర్ గేమ్ మొదలుపెట్టారని మాట్లాడుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చి, అంతిమంగా తనకు లబ్ది కోసమే గులాబీ బాస్ షర్మిల స్కెచ్ వేశారని వ్యాఖ్యానిస్తున్నారు ప్రతిపక్ష నేతలు. నాడు చంద్రబాబు బూచిని చూపి గెలిచిన కేసీఆర్, ఆంధ్రా షర్మిల గో బ్యాక్ అంటూ మళ్లీ సెంటిమెంట్ రాజేస్తారని అంచనా వేస్తున్నారు కొందరు అపోజిషన్ లీడర్లు. మొత్తానికి ఎవరి లెక్కలు వారివే. ఎవరి ధీమా వారిదే. మరి రాజన్న రాజ్యం తెస్తానంటున్న షర్మిలను తెలంగాణ జనం ఆదరిస్తారా? నో చెబుతారా? వెయిట్ అండ్ సీ.

Show Full Article
Print Article
Next Story
More Stories