తెలంగాణ రాజకీయాలు ఊహించని మలుపులు

తెలంగాణ రాజకీయాలు ఊహించని మలుపులు
x
Highlights

తెలంగాణ రాజకీయాలు చిత్ర విచిత్ర మలుపులు తిరుగుతున్నాయి. ప్రతి విషయాన్ని డేగకన్నుతో పరిశీలిస్తున్నాయి విపక్షాలు. ఎక్కడ ఏ అలికిడైనా ఉలిక్కిపడుతున్నాయి...

తెలంగాణ రాజకీయాలు చిత్ర విచిత్ర మలుపులు తిరుగుతున్నాయి. ప్రతి విషయాన్ని డేగకన్నుతో పరిశీలిస్తున్నాయి విపక్షాలు. ఎక్కడ ఏ అలికిడైనా ఉలిక్కిపడుతున్నాయి రాజకీయ పక్షాలన్నీ. ఏ చిన్న సంఘటన జరిగినా అనుకూలంగా మలుచుకోవడానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. దీంతో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా ఇంత హీటెక్కడానికి కారణం ఏంటి...?

రాజకీయ పార్టీల లక్ష్యం అధికార పీఠం ఎక్కడమే. అందుకోసమే ఏదైనా చేస్తాయి. ఉన్న అధికారాన్ని కాపాడుకోవడానికి అధికార పక్షం ప్రయత్నిస్తే...లేని అధికారాన్ని పొందడానికి ప్రతిపక్షాలు పోరాడుతాయి. ఇప్పుడు తెలంగాణలో ఇదే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. టీఆర్‌ఎస్‌ అమలు చేసిన ఆపరేషన్‌ ఆకర్ష్‌ కారణంగా కాంగ్రెస్‌ కుదేలయిపోయింది. దీంతో కాంగ్రెస్‌ స్థానాన్ని భర్తీ చేయడంతో పాటు...వచ్చే ఎన్నికల్లో రాష్ట్రాధికారం పొందడమే లక్ష్యంగా కాషాయ సేన దూసుకుపోతోంది. కేంద్రంలో ఉన్న అధికారం అండతో తెలంగాణ బీజేపీ చెలరేగిపోతోంది. దుబ్బాక, గ్రేటర్‌ హైదరాబాద్‌లో సాధించిన ఫలితాలతో త్వరలో జరగబోయే మూడు రకాల ఎన్నికల్లో పాగా వేయడానికి కమలం పార్టీ వ్యూహ రచన చేస్తోంది. నాగార్జున సాగర్‌ అసెంబ్లీ సీటుకు జరగాల్సిన ఉప ఎన్నిక ఆరు జిల్లాలకు చెందిన రెండు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఎన్నిక కొన్ని నగర పాలక సంస్థలకు జరగాల్సిన ఎన్నికల్లో విజయ బావుటా ఎగరేయాలని బీజేపీ ఉవ్విళ్ళూరుతోంది. అదే సమయంలో జరగబోయే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి దుబ్బాక, గ్రేటర్‌ హైదరాబాద్‌ల్లో బీజేపీ సాధించిన సక్సెస్‌ ఒట్టి వాపేనని నిజమైన బలం కాదని నిరూపించేందుకు గులాబీ దళం కూడా తహతహలాడుతోంది.

దుబ్బాక ఉప ఎన్నికకు ముందు రాష్ట్ర రాజకీయాలు ఇంత రంజుగా సాగలేదు. ప్రభుత్వంపై కాంగ్రెస్‌, బీజేపీ చేసే విమర్శల్ని అధికార పక్షం లైట్‌గా తీసుకునేది. కొద్ది నెలలుగా సీన్‌ మారింది. ఒక వైపున బీజేపీ...మరోవైపున కాంగ్రెస్‌ ఎవరికి వారుగానే టీఆర్‌ఎస్‌పై విమర్శల దాడి తీవ్రం చేస్తున్నాయి. ఎక్కడ ఏ సంఘటన జరిగిని డేగ కంటితో పరిశీలిస్తున్నాయి. మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ నిర్వాసితుల సమస్యలతో మొదలైన ప్రభుత్వ వ్యతిరేకత దుబ్బాక ఉప ఎన్నికతో తీవ్రమైందనే విషయం అర్థమైంది. అధికార పార్టీ చేసే ప్రతి పనినీ బీజేపీ నేతలు నిశితంగా పరిశీలిస్తున్నారు. విమర్శిస్తున్నారు. కాషాయసేన నుంచి వస్తున్న ప్రతిఘటనతో ఒక్కోసారి టీఆర్‌ఎస్‌ శ్రేణులు కంగుతింటున్నాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల సందర్భంగా వరదబాధితుల సాయాన్ని బీజేపీ అడ్డుకుంటోందని చేసిన విమర్శ ఎన్నికల దిశనే మార్చేశాయి. బీజేపీ హిందూ ఎజెండాతో ముందుకు సాగుతుంటే కాంగ్రెస్‌ నాయకత్వం సామాజిక వర్గాల వారీగా ఓట్‌బ్యాంక్‌ను ఆకర్షించే దిశగా వ్యూహాలు అమలు చేస్తోంది. రాబోయే ఎన్నికలకే అన్ని పార్టీలకు కార్య క్షేత్రాలుగా మారబోతున్నాయి.

సాగర్‌ ఉప ఎన్నిక, రెండు గ్రాడ్యుయేట్‌ MLC స్థానాల ఎన్నికలు, వరంగల్‌ సహా పలు నగరపాలక సంస్థలకు జరిగే ఎన్నికలే టార్గెట్‌గా బీజేపీ అప్పుడే కదనరంగంలోకి దూకింది. వరంగల్‌ జిల్లాలో ఏ చిన్న సంఘటన జరిగినా దాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవడానికి రెడీ అవుతోంది. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అయోధ్య రామమందిరం మీద కామెంట్స్‌ చేస్తే వెంటనే రియాక్టయింది కాషాయ సేన. దాడులు, ప్రతిదాడులతో జిల్లా అట్టుడికిపోయింది. అంతకుముందు కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగరరావు కూడా రామాలయం మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే సారీ చెప్పేదాకా వదల్లేదు.

ప్రధానంగా హిందూ ఎజెండాను భుజాన వేసుకున్న బీజేపీ అయోధ్య రామమందిరం విషయంలో ఎవరు ఏ చిన్న కామెంట్‌ చేసినా వెంటాడుతోంది. దీనికి తోడు కొందరు టీఆర్‌ఎస్‌ నేతలు అసందర్భంగా చేస్తున్న కామెంట్స్‌ కూడా కాషాయ పార్టీకి మేలు చేస్తున్నాయి. ఈ ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్యలతో టీఆర్‌ఎస్‌ను హిందూ వ్యతిరేక పార్టీగా ఫోకస్‌ చేయడానికి కమలం నాయకులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో బలహీన వర్గాల గురించి ఎమ్మెల్యే ధర్మారెడ్డి చేసిన కామెంట్స్‌ కూడా హీట్‌ పుట్టించాయి. రిజర్వేషన్ల మీద అధికారులయ్యేవారికి సబ్జెక్ట్‌ నాలెడ్జ్‌ ఉండదని చేసిన కామెంట్స్‌ టీఆర్‌ఎస్‌ను కూడా ఇరకాటంలోకి నెట్టాయి. దీనిపై కాంగ్రెస్‌ తీవ్రంగా స్పందించింది. బలహీనవర్గాలకు ఎమ్మెల్యే ధర్మారెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేసింది కాంగ్రెస్‌.

అధికార పార్టీ నేతల నుంచి ఏ చిన్న పొరపాటు దొర్లినా దాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడానికి అటు బీజేపీ ఇటు కాంగ్రెస్‌ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. దీనికి తోడు ఇటీవల టీఆర్‌ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు కొందరు చేస్తున్న ప్రకటనలు ప్రభుత్వాన్ని, గులాబీ పార్టీని ఇరకాటంలోకి నెడుతున్నాయి. హిందువులు, బలహీనవర్గాల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడిన పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి, అలాగే కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌ క్షమాపణ చెప్పేవరకు వదల్లేదు ప్రతిపక్షాలు.

Show Full Article
Print Article
Next Story
More Stories