Special Story: ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమై.. సద్దుల బతుకమ్మతో ముగింపు..

hmtv Special Story On Significance Of  Bathukamma Festival
x

Special Story: ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమై.. సద్దుల బతుకమ్మతో ముగింపు..

Highlights

Special Story: బతుకమ్మ ప్రకృతిని ఆరాధించే అరుదైన పండుగ బతుకమ్మ.

Special Story: బతుకమ్మ ప్రకృతిని ఆరాధించే అరుదైన పండుగ బతుకమ్మ. తొమ్మిది రోజుల పాటు సాగే పూల ఉత్సవం బతుకమ్మ. ఆడపిల్లలను 'బతుకు అమ్మా' అని మనసారా ఆశీర్వదించే పండుగ బతుకమ్మ. ఆశ్వయుజ అమావాస్య నాడు ఎంగిలిపూల బతుకమ్మగా ప్రారంభమయ్యే సంబరాలు తొమ్మిది రోజులపాటు సాగి సద్దుల బతుకమ్మ రోజు గౌరమ్మను సాగనంపడంతో ముగుస్తాయి. ఈ తొమ్మిది రోజుల పాటు మహిళలు చేసే సందడి అంతా ఇంతా కాదు. ప్రకృతిలో లభించే ప్రతి పువ్వు ఏరికోరి తెచ్చి, రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, నిత్యం గౌరీదేవిని తమ ఆటపాటలతో పూజిస్తారు. అందరూ కలిసి సంతోషంగా పాటలు పాడుతూ, బతుకమ్మ ఆటలు ఆడతారు. ఒకరు పాడుతుంటే మిగతా వారంతా వారికి వంత పాడతారు.

బతుకమ్మ పండుగ జరుపుకోవడానికి ఉపయోగించే పూలకు కూడా ఒక విశేషం ఉంది. ఔషధ గుణాలు ఉన్న పువ్వులను బతుకమ్మలుగా పేర్చడం కోసం ఉపయోగిస్తారు. తంగేడు, గునుగు, బంతి, చేమంతి, కట్ల, సంపెంగ, సీత జడలు, మల్లె, మందార, మరువం, పారిజాతం, కమలం, తామర, గులాబీ పూలతో చక్కగా బతుకమ్మలను పేర్చుతారు. ఇలా చేసిన బతుకమ్మలపై పసుపుతో గౌరమ్మను తయారుచేసి పెడతారు. ఇలా తయారు చేసిన బతుకమ్మను దైవంగా పూజిస్తారు. మహిళలు చక్కగా ముస్తాబై అత్యంత భక్తి శ్రద్ధలతో తయారుచేసిన బతుకమ్మలను తీసుకొని ఆలయాలలో, వీధులలో అందరూ గుంపుగా కూడి సంబరాలు జరుపుకుంటారు. చిన్న, పెద్ద, అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ సంబరాలలో పాలుపంచుకుంటారు. తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ గ్రామీణ జీవనాన్ని ప్రతిబింబించేలా జానపదాలను పాడుతూ పండుగ జరుపుకుంటారు.

ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమయ్యే ఈ వేడుకలు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. బతుకమ్మ 9 రోజులూ అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేకమైన నైవేద్యం సమర్పిస్తారు. మొదటి రోజు అత్యంత భక్తి శ్రద్ధలతో ఎంగిలిపూల బతుకమ్మలను పేర్చి పూజిస్తారు. అమ్మవారికి నైవేద్యంగా నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి ప్రసాదం తయారు చేస్తారు. 2వ రోజు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు అటుకుల బతుకమ్మను జరుపుకుంటారు. అటుకులు, పప్పు, బెల్లం తో నైవేద్యం తయారు చేసే అమ్మవారికి నివేదిస్తారు. మూడవరోజు ముద్దపప్పు బతుకమ్మతో మహిళలు సంబరాలు చేసుకుంటారు. ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి గౌరీ దేవికి సమర్పిస్తారు. నాలుగవ రోజు నానుబియ్యం బతుకమ్మను జరుపుకుంటారు. నానబెట్టిన బియ్యం, బెల్లం, పాలు కలిపి నైవేద్యం తయారుచేసి అమ్మవారికి నివేదించి వేడుక చేసుకుంటారు.

ఐదవ రోజు అట్ల బతుకమ్మను జరుపుకుంటారు. ఆ రోజు అమ్మవారికి నైవేద్యంగా అట్లను, దోసెలను పెట్టి పూజిస్తారు. ఆరవ రోజు బతుకమ్మను జరుపుకోరు. ఆరోజు అలిగిన బతుకమ్మ పేరుతో సంబరాలకు దూరంగా ఉంటారు. మళ్లీ ఏడవ రోజు వేపకాయల బతుకమ్మతో వేడుక చేసుకుంటారు. వేప పండ్లలా బియ్యంపిండిని చుట్టి, వాటిని బాగా వేయించి, వాటిని నైవేద్యంగా సమర్పిస్తారు. 8 వ రోజు వెన్నముద్దల బతుకమ్మతో సంబరాలు జరుపుకుంటారు. ఎనిమిదవ రోజు వెన్న, నువ్వులు, బెల్లం కలిపి నైవేద్యంగా తయారుచేసి అమ్మవారికి నివేదిస్తారు. తొమ్మిదవ రోజు చివరగా అత్యంత ముఖ్యమైన సద్దుల బతుకమ్మను జరుపుకుంటారు. ఆశ్వయుజ అష్టమి నాడు అంటే దుర్గాష్టమి నాడు ఐదు రకాల నైవేద్యాలతో సద్దుల బతుకమ్మను ఘనంగా నిర్వహిస్తారు. సద్దుల బతుకమ్మ రోజు అమ్మవారికి నైవేద్యంగా పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ అన్నం, కొబ్బరి అన్నం, నువ్వుల అన్నం తయారు చేసి అమ్మవారికి నివేదిస్తారు. ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి నైవేద్యం పెట్టే వాటిలో రక రకాల తృణధాన్యాలను వినియోగిస్తారు.

బతుకమ్మ పండుగ 9 రోజులు తెలంగాణలో సందడి అంతా ఇంతా కాదు. ఆడపడుచులందరూ అత్తవారింటి నుంచి కన్నవారింటికి చేరుకుని ఈ పూల పండుగ జరుపుకుంటారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే పాటల్లో మహిళలు తమ కష్ట సుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, భయం, చరిత్ర, పురాణాలు మేళవిస్తారు. ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు తెలిపేలా బతుకమ్మ పాటలను పాడతారు. బతుకమ్మ పాటలలో పురాణ, ఇతిహాస కథలు మొదలుకొని తెలంగాణ వీరుల కథలు, జానపద ఇతివృత్తాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా బతుకమ్మ పాటల్లో తెలంగాణ సంస్కృతి ప్రతిబింబిస్తుంది. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ పాడే పాటలు మొదలుకొని ఒక్కేసి పువ్వేసి చందమామ ఒక్క జాములాయె చందమామ, చిత్తూ చిత్తూల బొమ్మ శివుడీ ముద్దుల గుమ్మ అంటూ పాటలు మహిళల నోటి నుండి జాలువారుతాయి.

పండుగ తొమ్మిది రోజులు రోజూ బతుకమ్మలు చేసి వాటి చుట్టూ తిరుగుతూ ఆడుతారు. ఆ తరువాత దగ్గరలో ఉన్న జలాలలో నిమజ్జనం చేస్తారు. చివరి రోజు సద్దుల బతుకమ్మ పండుగ అత్యంత మనోహరంగా ఉంటుంది. ఆ రోజు మహిళలు భారీ బతుకమ్మలను పేర్చుతారు. పేర్చిన బతుకమ్మపై పసుపుతో చేసిన గౌరమ్మను పెట్టి పూజిస్తారు. సాయంకాలం అందరూ తమ తమ బతకమ్మలతో ఒక చోట చేరి వాటిని మధ్యలో పెట్టి వాటి చుట్టూ తిరుగుతూ పాటలతో గౌరి దేవిని కీర్తిస్తూ ఆడుతారు, పాడుతారు. ఇలా చాలా సేపు ఆడిన తర్వాత ఊరేగింపుగా వెళ్లి బతుకమ్మలను చెరువులో నిమజ్జనం చేస్తారు. ఆ తర్వాత మహిళలు వాయినాలు ఇచ్చి పుచ్చుకుంటారు. ఇంటి నుండి తీసుకువచ్చిన పెరుగన్నం, సత్తుపిండిలను ఇచ్చి పుచ్చుకొని తింటారు. ఆ తరువాత బతుకమ్మను కీర్తిస్తూ ఇంటికి చేరుతారు. ఈ తొమ్మిది రోజులూ, ఈ పాటలన్నీ అర్ధరాత్రి వరకూ వీధులలో మారు మ్రోగుతూనే ఉంటాయి.

ఊరూ వాడా అన్న తేడా లేకుండా తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అంబరాన్ని తాకుతాయి. లక్షలాదిగా మహిళలు పట్టు చీరలు కట్టుకొని, పుత్తడి బొమ్మల్లా ముస్తాబై బతుకమ్మ వేడుకలను జరుపుకుంటారు. పేద, ధనిక అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ ఒక్క చోట చేరి ఆడి పాడి సంతోషంగా గడుపుతారు. ఇంత చక్కని, అందరూ సమిష్టిగా జరుపుకునే అందమైన, అద్భుతమైన పండుగ ప్రపంచంలోనే బతుకమ్మ ఒక్కటే అని చెప్పటం తెలంగాణాకే గర్వకారణం.

Show Full Article
Print Article
Next Story
More Stories