Hit And Run Cases: హైదరాబాద్ లో పెరుగుతున్న హిట్ అండ్ రన్ కేసులు

Hit-And-Run Cases Are Increasing In Hyderabad
x

Hit And Run Cases: హైదరాబాద్ లో పెరుగుతున్నహిట్ అండ్ రన్ కేసులు

Highlights

Hit And Run Cases: మద్యం తాగి వాహనం నడుపుతూ జనం ప్రాణాలు తీస్తున్న దుండగులు

Hit And Run Cases: కొందరి నిర్లక్ష్యం ఎన్నో కుటుంబాల‌ను కోలుకోలేని దెబ్బ తీసేలా చేస్తుంది. మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ కొందరు అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు. ఏటా ఎందరో జైలుకు వెళ్తున్నా ప్రమాదాలు ఆగడం లేదు. మందుబాబుల్లో మాత్రం మార్పు రావడంలేదు. నగరంలో పెరుగుతున్న హిట్ అండ్ రన్ కేసులు ఆందోళనకు గురి చేస్తున్నాయి.

రాత్రి అయ్యిందంటే చాలు హైదరాబాద్ రోడ్లు రేసింగ్ ట్రాక్ లుగా మారుతున్నాయి. ఖరీదైన కార్లు ఓ వైపు ..లెక్క లేని నిర్లక్ష్యం మరోవైపు..ఇవి చాలదన్నట్టు ఒళ్ళు తెలియనంతగా తప్ప తాగి రోడ్ల పైకి వస్తున్న కొందరు ప్రమాదాలు చేస్తూ అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు. ఇప్పటికే డ్రంకన్ డ్రైవ్ ల కారణంగా వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా జూబ్లీహిల్స్ పరిధిలో జరిగిన ఓ ఘోర ప్రమాదం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది.

నగరం లో హిట్ అండ్ రన్ కేసులకు కొదువ లేదు. గతంలో డీకే నగర్‌లో స్టూడెంట్‌ దేవి..పంజాగుట్ట వద్ద చిన్నారి రమ్య కుటుంబం.. తాజాగా జూబ్లీహిల్స్‌లో బౌన్సర్‌ తారక్‌ కేసులు సంచలనం సృష్టించాయి. అయితే తాజాగా జరిగిన ప్రమాదం లో తారక్ అనే వ్యక్తి మరణించడం ఉద్రిక్తతలకు దారి తీసింది.

బౌన్సర్‌ తారక్‌ మృతికి కారణమైన రిత్విక్‌ రెడ్డి మద్యం మత్తులో ఉన్నట్టు జూబ్లీహిల్స్‌ పోలీసుల విచారణ లో వెల్లడయ్యింది. అయితే పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఈ తరహా కేసులు మాత్రం తగ్గడం లేదు. అయితే..డ్రంకెన్ డ్రైవింగ్‌ టెస్ట్ లు పూర్తి స్థాయిలో నిర్వహించకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి.

రాత్రి వేళల్లో మద్యం తాగేవారికి, ఆ స్థితిలో వాహనాలు నడిపే వారికి సమయం, సందర్భం అంటూ ఉండదు. పోలీసులు ప్రధానంగా వీకెండ్స్‌గా పిలిచే శుక్ర, శనివారాల్లో రెగ్యులర్‌గా, మిగిలిన సమయాల్లో ఆకస్మికంగా తనిఖీలు చేపడుతున్నారు. ఈ డ్రైవ్స్‌ నిర్వహణకూ నిర్ణీత సమయం ఉంటోంది. ఎప్పుడైనా కానీ కొన్ని గంటలు మాత్రమే చేపట్టగలుగుతున్నారు. దీంతో అర్ధరాత్రి తర్వాత ఎక్కువగా ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.

ట్రాఫిక్‌ విభాగంలో ఉన్న సిబ్బంది కొరత నేపథ్యంలో ప్రతి రోజూ, రాత్రంతా డ్రంక్‌ డ్రైవింగ్‌ తనిఖీలు చేపట్టలేకపోతున్నారు. దీన్నే మందుబాబులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఇక ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహించే సమయం, స్థలాలు గమనిస్తున్న మందుబాబులు డ్రంక్‌ అండ్ డ్రైవింగ్‌ తనిఖీలు ఉండని రోజుల్లో రెచ్చిపోతున్నారు. ఏప్రాంతంలో డ్రంకన్ డ్రైవ్ ఉందో ఫోన్ ద్వారా ముందుగానే సమాచారం తెలుసుకొని ఆ రూట్ లో కాకుండా వేరే రూట్ లో వెళుతున్నారు.

తాజాగా జరిగిన జూబ్లీహిల్స్ ఘటన సోషల్ మీడియా లోనూ వైరల్ గా మారడం సంచలనం సృష్టించింది. ఇక అటు మృతుడి బంధువులు కూడా బాధ్యులను గుర్తించి శిక్షించాలని. మృతదేహం‌‎తో జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర ఆందోళనకు దిగడం తో కేసును ఛాలెంజింగ్ తీసుకున్న పోలీసులు నిందితులను తొందరగా అరెస్ట్ చేశారు. అయితే, చాలా కేసులు వెలుగు లోకి రావడం లేదు.

మద్యం సేవించి నిర్లక్ష్యంగా వాహనం నడిపి ఎదుటి వారి ప్రాణం పోవడానికి కారణమైన వారి పై కఠినంగా వ్యవహరించాలని పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి కేసుల్లో బెయిల్‌ సైతం తొందరగా లభించదు. న్యాయస్థానంలో నిరూపితమైతే గరిష్టంగా పదేళ్ల నుంచి జీవిత ఖైదు లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది. ఈ సెక్షన్‌ కింద నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్‌ సైతం లభించదు.

Show Full Article
Print Article
Next Story
More Stories