ధాన్యాగారాల కోట..కీర్తి తరగని మెదక్ ఖిల్లా

ధాన్యాగారాల కోట..కీర్తి తరగని మెదక్ ఖిల్లా
x
Highlights

నిజాం, కాకతీయుల పరిపాలనలో తెలంగాణలో ఎన్నో కోటలు నిర్మాణానికి నోచుకున్నాయి. కోటలు కూలినా చరిత్ర చెరగదు, ప్రాణాలు పోయినా కీర్తి తరగదు అన్నచందంగా రాజులు...

నిజాం, కాకతీయుల పరిపాలనలో తెలంగాణలో ఎన్నో కోటలు నిర్మాణానికి నోచుకున్నాయి. కోటలు కూలినా చరిత్ర చెరగదు, ప్రాణాలు పోయినా కీర్తి తరగదు అన్నచందంగా రాజులు పోయినా.. రాజ్యాలు పోయినా ఆనాటి ఆనవాళ్లు మాత్రం ఇంకా మన తెలంగాణ రాష్ట్రంలో దర్శనం ఇస్తూనే ఉన్నాయి. నేటికీ నిలిచిన పురాతన కట్టడాలు.. కోట గోడలు.. బురుజులు మెదక్ జిల్లా రాచరిక పాలనకు దర్పణం. చరిత్రకు నిలువెత్తు నిదర్శనమైన అలాంటి ఓ కోటనే మెదక్ ఖిల్లా. ఆనాటి రాచరిక పాలనకు సజీవ సాక్ష్యంగా చెప్పుకునే 'ఖిల్లా' మెదక్ పట్టణానికి ఓ మణిహారంగా నిలించింది. మెదక్ కోట ఒక వారసత్వ నిర్మాణానికి ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. ఈ కోట తెలంగాణ ప్రాంతంలో చారిత్రక, నిర్మాణ ప్రాముఖ్యతను కలిగి ఉంది.

కోట చరిత్ర

దక్షిణాపథంపై ఖిల్జీలు తుగ్లక్కుల చీకటి నీడలు పడుతున్న వేళ కాకతీయ సామ్రాట్టు రెండో ప్రతాపరుద్రుడు తన రాజ్య రక్షణ కోసం నిర్మించిన కోట ఇది. ఈ కోట నిర్మాణానికి ఎంచుకున్న స్థలమే ఈ కోటను శత్రుదుర్భేద్యంగా మార్చేసింది. ఎత్తైన కొండ, చుట్టూ నలభై కిలోమీటర్ల వరకూ ఎలాంటి కదలికలున్నా పసిగట్టేందుకు బురుజులు, కోటకు ఎక్కడానికి వీల్లేనంత ఎత్తైన గోడలు, మలుపులు, మెలికలు తిరిగే కొండదారి కోటలో వారికి శత్రువు కనిపిస్తాడు. కానీ శత్రువుకు కోటలో ఏముందో, ఎక్కడ సలసలకాగే నూనె నిండిన డేగిశా కుమ్మరించేందుకు ఎవరు పొంచి ఉన్నారో, ఏ బురుజు రంధ్రాల్లోంచి ఎవరు విషం పూసిన బాణాలను ఎక్కుపెట్టి సిద్ధంగా ఉన్నారో అర్థం కాని పరిస్థితి. కోటలో పలు దిగుడు బావులు, జలాశయాలు, సొరంగ మార్గాలు కూడా నిర్మించారు. అంతేకాదు తాగు నీటి సరఫరాకోసం కుండ పెంకులతో పైప్‌లైన్లు కూడా ఉండేవని చరిత్ర చెపుతుంది.

అయితే 1203 నుంచే ఢిల్లీ సుల్తాన్ల దాడులూ దండయాత్రలూ ఆరంభమయ్యాయి. కాకతీయుల తరువాత ఢిల్లీ సుల్తాన్లు, వారి తరువాత బహుమనీలు ఇలా మెదక్‌ కోట ఒక్కక్క రాజవంశం చేతులు మారుతూ వచ్చింది. 18వ శతాబ్దంలో ఈ కోట నైజాం నవాబుల ఏలుబడిలోకి వచ్చింది. సుల్తాన్ల ఏలుబడిలోనే ఈ కోటలో ఇస్లామిక్‌ శైలి కట్టడాల నిర్మాణం జరిగింది.

మెదక్ కోట విశేషాలు..

ప్రాచీన భారతదేశంలోని కాకతీయుల కాలంనాడు కొండపై నిర్మించిన దుర్గం. ఈ కోట సుమారు 12 వ శతాబ్ద కాలం నాటిది. ఈ కోటను కాకతీయుల కాలంలో ప్రతాపరుద్రుడు కాలంలో నిర్మించారని ప్రతీతి. ప్రతాపరుద్రుడు ఈ దుర్గాన్ని మెతుకు దుర్గంగా పిలిచేవాడు. కాకతీయ సామ్రాజ్యానంతరం ఇది కుతుబ్ షాహీల అధీనంలోనికి వచ్చింది. ఈ కోటలో 17 వ శతాబ్దంలో కుతుబ్ షాహీలచే మస్జిద్ నిర్మించబడింది. అక్కడ ధాన్యాగారాలు, శిథిలమైన గృహాలు ఎన్నో కనిపిస్తాయి.

ఈ కోటలో మూడు ముఖద్వారాలు ఉన్నాయి. వాటిలో "ప్రధాన ద్వారం", సింహద్వారం "గజ ద్వారం" ప్రధాన మార్గం కాకతీయుల యొక్క చిహ్నమైన రెండుతలల గంఢబేరుండంతో కూడుకుని ఉంటుంది. ఆ కోటలో స్థిరమైన పైకప్పుకు ఊతం అందించేందుకు ఉపయోగించే కలపను ఇప్పటికీ మనం చూడవచ్చు. కాకతీయ పాలకులకు, వారి పాలించిన కుతుబ్ షాహిలకు కూడా ఈ కోట నియంత్రణా కేంద్రంగా ఉండేది. కుతుబ్ షాహి పాలకులు ఈ కోట లోపల దాన్యాగారాల గదులతో కూడిన ఒక మసీదును 17వ శతాబ్ద౦లో నిర్మించారు. ఈ కోట చారిత్రిక పరంగానే కాక పురావస్తు పరంగా కూడా గుర్తించదగింది. ఇక ఈ కోటలో 17వ శతాబ్దానికి చెందిన 3.2 మీటర్ల పొడవైన ఒక ఫిరంగిని కూడా మనం చూడొచ్చు. ఈ కోట నుండి పర్యాటకులు సుందర దృశ్యాలతో పాటుగా పూర్తి పట్టణాన్ని స్పష్టంగా చూడవచ్చు.

ఈ కోట ఎక్కడ ఉంది...ఎలా రావొచ్చు..

మెదక్ కోట తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరానికి 100 కి.మీ దూరంలో ఉంటుంది. మెదక్ నగరానికి ఉత్తరాన మూడు వందల అడుగుల ఎత్తైన కొండపై 400 ఎకరాల్లో విస్తరించింది మెదక్ కోట నిర్మించబడింది. ఈ కోట నేషనల్ హైవే 44 కి దగ్గరగా, హైదరాబాద్ నుండి వస్తున్నప్పుడు చేగుంట అనే చిన్న పట్టణం నుండి మలుపు తీసుకొని రావాల్సి ఉంటుంది. అలాగే పై వైపు నుంచి అంటే ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల వైపుగా వస్తే - రామాయంపేట నుంచి 25 కి.మీ. రావాల్సి ఉంటుంది. ముంబై దారి మీదుగా వస్తే సంగారెడ్డి వద్ద నాందేడ్, అకోలా హైవే మీదుగా వచ్చి, జోగిపేట వద్ద మలుపు తీసుకొని 35 km. రావాల్సి ఉంటుంది. ఇక హైదరాబాద్ లోని బాలానగర్ నుండి వస్తే 80 km. - నర్సాపూర్, గుమ్మడిదల, కౌడిపల్లి, పోతాన్ చెట్టిపల్లి, రాంపూర్, మంబోజిపల్లి మీదుగా రావాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories