దిశను హత్య చేసిన దగ్గర నుంచి... నిందితులను ఎన్‌కౌంటర్‌ దాకా ఎప్పుడేం జరిగింది?

దిశను హత్య చేసిన దగ్గర నుంచి... నిందితులను ఎన్‌కౌంటర్‌ దాకా ఎప్పుడేం జరిగింది?
x
Highlights

దిశ హత్యోదంతం దేశ ప్రజల మనసుల్ని కలిచివేసిన ఘటన. పరిచయం లేని దిశ కోసం దేశమంతా ఒక్కటైన ఘటన. రక్తసంబంధం లేకున్నా ఎవరూ పిలవకున్నా ప్రజలంతా ఏకమై న్యాయం...

దిశ హత్యోదంతం దేశ ప్రజల మనసుల్ని కలిచివేసిన ఘటన. పరిచయం లేని దిశ కోసం దేశమంతా ఒక్కటైన ఘటన. రక్తసంబంధం లేకున్నా ఎవరూ పిలవకున్నా ప్రజలంతా ఏకమై న్యాయం కోసం నినదించిన ఘటన. అలాంటి ఘటన కీలక మలుపు తీసుకుంది. దిశను అత్యంత కిరాకతకంగా, అత్యంత అమానవీయంగా చంపిన నలుగురు నిందితులను సైబరాబాద్‌ పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. దిశను హత్య చేసిన దగ్గర నుంచి నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసిన దాకా ఎప్పుడేం జరిగింది? ఒకసారి చూద్దాం.

షాద్‌నగర్‌ మండలం చటాన్‌పల్లి బ్రిడ్జ్‌ దగ్గర దిశ హత్య చేసిన నలుగురు నిందితులు ఎన్‌కౌంటర్‌కు గురయ్యారు. సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా తప్పించుకునే ప్రయత్నం చేయడంతో ఉదయం 5.45 నుంచి 6.15 మంధ్య ఫైర్‌ ఓపెన్‌ చేశామని పోలీసులు చెబుతున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఆరిఫ్, శివ, చెన్నకేశవులు, నవీన్‌ మృతి చెందారు.

వెటర్నరీ డాక్టర్‌ దిశ నవంబరు 27న అర్ధరాత్రి దాటిన తర్వాత చటాన్‌పల్లి వద్ద దిశ సజీవదహనమయ్యారు. ఆరోజు రాత్రి తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో లారీడ్రైవర్లు, క్లీనర్లుగా పనిచేస్తున్న నలుగురు నిందితులు ఆరిఫ్‌, శివ, చెన్నకేశవులు, నవీన్‌ కిరాతకంగా అత్యాచారం చేసి పాశవికంగా పెట్రోలు చల్లి సజీవ దహనం చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనను సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ నేతృత్వంలోని పోలీసు బృందం సవాల్‌గా తీసుకుంది. టెక్నాలజీ సాయంతో కేవలం 24 గంటల్లోనే అంటే నవంబరు 28న నలుగురు నిందితుల అరెస్ట్‌ చేశారు.

నవంబర్‌ 29. షాద్‌నగర్‌ ఏకమైంది. దిశ కోసం ఎక్కడికెక్కడి నుంచో ప్రజలు తరలివచ్చారు. అరెస్టు చేసిన నలుగురు నిందితులను తమకు అప్పగించాలంటూ ప్రజలు పోలీస్‌స్టేషన్‌ ముందు బైఠాయించారు. విచారణ కోసం నలుగురు నిందితులను షాద్‌నగర్‌ ఠాణాకు తీసుకొచ్చిన పోలీసులకు ప్రజలను అదుపు చేయడం ఒకరకంగా కత్తి మీద సామైంది. ఈ నలుగురిని మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచడం కష్టంగా మారడం, నిందితులకు వైద్యపరీక్షలు నిర్వహించడం అసాధ్యంగా కనిపించడంతో మెజిస్ట్రేట్‌ను, వైద్యులను షాద్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌కే తీసుకొచ్చి ఫార్మాలిటీస్‌ పూర్తిచేశారు. తర్వాత పటిష్టమైన బందోబస్తు మధ్య చర్లపల్లి జైలుకు నిందితులను తరలించారు.

నవంబరు 30. నలుగురు నిందితులకు కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. అయితే చర్లపల్లి జైలులోనే ఉన్న నలుగురిని మరోసారి కస్టడీకి అనుమతించాలని షాద్‌‌నగర్‌ పోలీసులు పిటిషన్‌ పెట్టుకున్నారు. డిసెంబరు 4. నిందితులను పోలీస్‌ కస్టడీకి ఇచ్చేందుకు న్యాయస్థానం అంగీకరించింది. డిసెంబర్‌ 5న చర్లపల్లి జైల్లో నిందితులను స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ విచారించింది. హత్య జరిగిన రోజు ఏం జరిగిందో, తెలుసుకునేందుకు నలుగురు నిందితులను ఘటనాస్థలికి తీసుకెళ్లింది. అక్కడ కొన్ని ఆధారాలను సేకరించింది. తిరిగి 5వ తేదీ రాత్రి చర్లపల్లి జైలుకు తీసుకొచ్చింది.

డిసెంబర్‌ 6. ఉదయం మూడున్నర గంటల ప్రాంతంలో మరోసారి తమ కస్టడీలోకి తీసుకున్న పోలీసులు నలుగురు నిందితులను ఘటనాస్థలికి తీసుకెళ్లారు. అక్కడే నిందితులు తిరగబడటంతో కాల్పుల జరపాల్సి వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. ఏమైనా దిశను అత్యంత కిరాతకంగా చంపిన ఘటనాస్థలికి కేవలం 300 మీటర్ల దూరంలోనే నలుగురు నిందితులను పోలీసులు మట్టుబెట్టారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories