వరద నీటిలో గల్లంతైన బంగారు ఆభరణాలు

వరద నీటిలో గల్లంతైన బంగారు ఆభరణాలు
x
Highlights

రెండు రోజుల నుంచి హైదరాబాద్ నగరంలో కురుస్తున్న వర్షాలకు నగరం అంతా జలమయమయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు నగరంలో వాగులు వంకలు పొంగి...

రెండు రోజుల నుంచి హైదరాబాద్ నగరంలో కురుస్తున్న వర్షాలకు నగరం అంతా జలమయమయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు నగరంలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లలోకి వరద నీరు వచ్చి చేరుతుంది. అదే విధంగా నగరంలోని రోడ్లలన్నీ వరద నీటితో చెరువులను తలపిస్తున్నాయి. దీంతో ట్రాఫిక్ కు అంతరాయం కలగడం మాత్రమే కాదు కొన్ని కొన్ని వాహనాలు, చిన్న చిన్న వస్తువులు వరద నీటిలో కొట్టుకుపోతున్నాయి. ఈ క్రమంలోనే బంగారు ఆభరణాలు కూడా వరద నీటిలో గల్లంతయ్యాయి. బంగారు ఆభరణాలతో వర్షంలో వెళ్తున్న ఓ వ్యక్తి బ్యాగు నీటిలో పడిపోవడంతో అవి కొట్టుకు పోయాయి. ఈ సంఘటనకు సంబంధించి బంజారాహిల్స్‌ డీఐ మహ్మద్‌ హఫీజుద్దీన్‌ తెలిపిన వివరాల్లోకెళితే జూబ్లీహిల్స్‌లోని కృష్ణ పెరల్స్‌ దుకాణానికి బషీర్‌బాగ్‌లోని వీఎస్‌ గోల్డ్‌ దుకాణదారుడు సేల్స్‌మెన్‌ ప్రదీప్‌కు కిలోన్నర బంగారు ఆభరణాలను ఇచ్చి శనివారం ఉదయం పంపారు.

కొనుగోలు దారుడు కొన్ని ఆభరణాలను కొన్న తరువాత అదే రోజు సాయంత్రం సేల్స్ మెన్ ప్రదీప్ మళ్లీ ఆ ఆభరణాల సంచి తీసుకుని బైకుపై బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 3 మీదుగా బషీర్ బాగ్ కు వర్షంలోనే బయల్దేరాడు. అదే రోడ్డులో ఉన్న కిడ్స్‌ పాఠశాల ముందుకు రాగానే భారీగా కురుస్తున్న వర్షానికి వరద నీరు వచ్చింది. ఒక్కసారిగా అంత నీరు రావడంతో ద్విచక్రవాహనం పట్టుకోల్పయి కాళ్ల మధ్యలో పెట్టుకున్న ఆభరణాల సంచి కిందపడి ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఈ విషయం సేల్స్ మెన్ దుకాణ యజమానికి వెంటనే తెల్పడంతో దుకాణ యజమాని, మరో 15 మంది సిబ్బంది శనివారం రాత్రి 10 వరకు వెతికారు. అయినా ఫలితం దక్కలేదు. దీంతో దుకాణ యజమాని అజయ్‌కుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రదీప్‌ను కూడా విచారిస్తున్నారు. అయితే ఇప్పుడు సంచిలోని నగలు ఏమయ్యాయనేది ఉత్కంఠ నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories