తెలంగాణలో నేడు, రేపు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు

TS Rain: వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం

Jyothi
Updated on: 10 Sept 2022 9:30 AM IST
Heavy Rains In Telangana
X

తెలంగాణలో నేడు, రేపు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు

TS Rain: నైరుతి రుతుపవనాలు తెలంగాణపై చురుకుగా కదులుతున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. రెండు రోజులుగా హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుండటంతో ఇవాళ, రేపు కూడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఉన్న అల్పపీడనం శుక్రవారం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు దగ్గరలో వాయవ్య బంగాళాఖాతం వద్ద స్థిరంగా కొనసాగుతుంది. రానున్న 36 గంటల్లో ఉత్తరాంధ్ర, దక్షిణ ఓడిశా తీరాలకు దగ్గరలో ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణశాఖ వివరించింది. జైసల్మేర్‌, ఉదయ్‌పూర్‌, జల్గావ్‌, రామగుండం మీదుగా బంగాళాఖాతంలోని అల్పపీడన ప్రాంతంపైనుంచి ఉపరితల ద్రోణి వెళ్తున్నదని తెలిపింది.

మరో ద్రోణి అల్పపీడన ప్రాంతం నుంచి దక్షిణ తెలంగాణ మీదుగా... ఉత్తర అంతర్గత కర్ణాటక వరకు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల వరకు విస్తరించిందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. వీటి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు దంచి కొడుతున్నాయి. శుక్రవారం అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారాంపట్నంలో 20.90 సెంటీమీటర్ల వర్షం కురిసింది. శనివారం నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌ జిల్లాల్లో అతి భారీవర్షాలు కురుస్తాయని సూచించింది.

Jyothi

Jyothi

Next Story