తెలంగాణలో దంచికొడుతున్న వర్షాలు.. భారీ వానలతో ప్రాజెక్టులకు చేరుతున్న వరద

Heavy Rain In Telangana
x

తెలంగాణలో దంచికొడుతున్న వర్షాలు.. భారీ వానలతో ప్రాజెక్టులకు చేరుతున్న వరద

Highlights

TS Rain: జలకళను సంతరించుకుంటున్న ప్రాజెక్టులు

TS Rain: తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వరదలకు ప్రాజెక్టులకు నీరు చేరుతుండడంతో జలకళను సంతరించుకున్నాయి. ఎగువ నుంచి భారీగా వరద వచ్చి చేరుతుండడంతో కరీంనగర్ లోయర్ మానేరు డ్యామ్‌ గేట్లను అధికారులు ఎత్తివేశారు. ఆరు గేట్లు ఎత్తి దిగువకు 18 వేల క్యూసెక్కుల నీటి విడుదల చేశారు. 24 టీఎంసీల సామర్థ్యం ఉన్న LMD లో ప్రస్తుతం 20 టీఎంసీ నిల్వ ఉంది. 36 వేల ఇన్ ఫ్లో చేరుతుండటంతో గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వానలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ప్రధాన రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. మరో వైపు చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఇక ప్రాజెక్టులకు భారీగా వరద ప్రవాహం చేరి జలకళను సంతరించుకుంటున్నాయి. గత రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీ వరద పోటెత్తుతుంది. అధికారులు 26 గేట్లు దిగువకు గోదావరిలోకి విడుదల చేశారు. ప్రాజెక్టులోకి ప్రస్తుతం లక్షా 20 వేలక్యూసెక్కుల వరద నీరు వస్తోందని అధికారులు తెలిపారు.

అటు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మూల వాగుకు నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో కోనరావుపేట మండలం నిమ్మపెల్లి, వట్టిమల్ల గ్రామాల మధ్య వరద ప్రవహిస్తోంది. రోడ్లపై భారీగా వరద నీరు ప్రవహిస్తుండడంతో పరిసర గ్రామాలకు రాకపోకలకు నిలిచిపోయాయి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతోంది. ప్రాజెక్టుకు భారీగా ఇన్‌ఫ్లో చేరుతుండడంతో 12 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి 8 వేల 752 క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేశారు అధికారులు. ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 72 మీటర్లుగా ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories