హైదరాబాద్‌ను ముంచెత్తిన వాన.. 7 గంటల్లోనే 16 సెంటీమీటర్ల వర్షం

Heavy Rain In Hyderabad
x

హైదరాబాద్‌ను ముంచెత్తిన వాన.. 7 గంటల్లోనే 16 సెంటీమీటర్ల వర్షం

Highlights

Hyderabad: రాష్ట్రంలో మరో మూడురోజులు భారీ వర్షాలు

Hyderabad: హైదరాబాద్ మహానగరాన్ని కుంభవృష్టి ముంచెత్తింది. ఒకటీ రెండు గంటలు కాదు.. ఏకంగా 7 గంటల పాటు నిర్విరామంగా వాన దంచికొట్టింది. చిరుజల్లులతో మొదలైన వర్షం.. ఉధృతంగా మారింది. దీంతో నగరవాసులు అతలాకుతలమయ్యారు. గంటకు 4 నుంచి 8 కిలోమీటర్ల గాలి వేగంతో కూడిన వర్షం కురవడంతో ప్రజలు ఆగమాగమయ్యారు. వివిధ పనుల కోసం ద్విచక్ర వాహనాలు, కార్లలో రోడ్లపైకి వెళ్లిన వారు ట్రాఫిక్‌ సుడిగుండంలో చిక్కుకున్నారు. ఎంతకూ తగ్గని వర్షాన్ని చూసి జనం హడలిపోయారు. తప్పని పరిస్థితిలో కొందరు వానలో తడుస్తూ గంటల తరబడి ప్రయాణం చేశారు. బయటకు వెళ్లిన వారు ఇంటికి చేరుకునేందుకు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఫోన్ల ద్వారా తెలుసుకున్న కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వాహనదారులతోపాటు ఇళ్లలో ఉన్నవారు సైతం వణికిపోయారంటే నగరంలో వర్షం ఏ స్థాయిలో కురిసిందో అర్థం చేసుకోవచ్చు.

ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజులుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ద్రోణి తీవ్రత నగరంపై అంతగా ఉండదని వాతావరణ శాఖ అధికారులు భావించినా... అకస్మాత్తుగా ఏర్పడిన క్యుములోనింబస్‌ మేఘాల కారణంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. చినుకులతో ప్రారంభమైన వర్షం క్రమేపీ కుంభవృష్టిగా మారింది. వెనువెంటనే తీవ్రత అందుకున్న వర్షం భీకరంగా మారింది. ఒక్కో గంటకు ఉధృతంగా మారి కుమ్మేయడంతో దారులన్నీ గోదారులయ్యాయి. ఒక్కోసారి తగ్గినట్టే తగ్గి మళ్లీ మొదలైంది. తగ్గేదేలే అంటూ దంచికొట్టింది. హైదరాబాద్‌లో సాధారణ వర్షపాతం కంటే పదింతలు అధికంగా నమోదైంది. కురిసిన కుండపోత వర్షానికి గోల్కొండ, లంగర్‌హౌజ్‌, టోలీచౌకీ, నదీం కాలనీ, సబ్జా కాలనీ, సాలార్‌జంగ్‌ కాలనీల్లో రోడ్లు ధ్వంసమై ఇసుక మేటలు ఏర్పడ్డాయి. మణికొండలోని పలు కాలనీల్లో వరద తీవ్రత తగ్గలేదు.

తెలంగాణలో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆ తర్వాత మరో రెండు రోజులు వర్షాలు కొనసాగే అవకాశం ఉందనీ తెలిపింది వాతావరణ శాఖ... పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, రాజన్న, సిరిసిల్ల, కరీంనగర్‌, నారాయణపేట, వనపర్తి గద్వాల, ఖమ్మం జిల్లాలు మినహా తెలంగాణ వ్యాప్తంగా ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. మిగతా చోట్ల కూడా తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories