Top
logo

హైదరాబాద్ ను వదలని వరుణుడు : మరో 3 రోజులు ఇదే పరిస్థితి

హైదరాబాద్ ను వదలని వరుణుడు : మరో 3 రోజులు ఇదే పరిస్థితి
X
Highlights

గత కొన్ని రోజులుగా వరుణదేవుడు భాగ్యనగరాన్ని వదలకుండా వెంటాడుతూనే ఉన్నాడు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో...

గత కొన్ని రోజులుగా వరుణదేవుడు భాగ్యనగరాన్ని వదలకుండా వెంటాడుతూనే ఉన్నాడు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ప్రభావంతో మంగళవారం కూడా భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మొదలుకుని మధ్యాహ్నం వరకు మోస్తరు వర్షం కురవగా సాయంత్రం నుంచి రాత్రి వరకు జోరుగా వర్షం కురిసింది. మరో మూడు రోజులపాటు నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కేవలం నిన్న ఒక్కరోజే నగరంలోని పలు ప్రాంతాల్లో ఐదు సెంటిమీటర్ల వరకు వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.

నగరంలో మంగళవారం కురిసిన వర్షానికి పాతబస్తీలోని హుస్సేనీఆలం, పురానాపూల్‌, దూద్‌బౌలి, ఖబూతర్‌ఖానా ఇతర ప్రాంతాల్లో డ్రైనేజీ, వరదనీరు పొంగిపొర్లింది. అంతే కాకుండా పురానాపూల్‌ శ్మశానవాటికతోపాటు శివాలయం నీటితో నిండిపోయింది. హిమాయత్‌సాగర్‌ గేట్లు ఎత్తేయడంతో పురానాపూల్‌ బ్రిడ్జి వద్ద భారీ ప్రవాహం కొనసాగింది. ఒక మోస్తరు వర్షానికి బండ్ల గూడ, రాజేం ద్రనగర్, ఉప్పర్‌పల్లి, శివరాంపల్లి, సన్‌సిటీ, కిస్మత్‌పూర్, బుద్వేల్, ఆరాం ఘర్, నేషనల్‌ పోలీస్‌ అకాడమీ ప్రాంతాల్లోకి వరదనీరు వచ్చి చేరింది. ఇటు సరూర్ నగర్‌ చెరువులోకి ఎగువ ప్రాంతాల చెరువుల నుంచి భారీగా వరద వచ్చే ప్రమాదం ఉన్నందున ప్రజలు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. సరూర్‌నగర్‌లోని లోతట్టు ప్రాంత కాలనీలైన కోదండరాంనగర్, సీసాల బస్తీ, వీవీ నగర్‌ ముంపు బాధితులను ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూనే ఉన్నారు.

వరదల్లో చిక్కకున్న ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. అయితే ఆయా కేంద్రాల్లో సరైన సదుపాయాలు లేక ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. ఆనంద్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన కేంద్రంలో దుప్పట్లు ఇవ్వకపోవడంతో రాత్రిపూట చలికి వణికిపోతున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీర్‌పేట పరిధిలో 16 పునరా వాస కేంద్రాలు ఏర్పాటు చేసినా సరైన వస తులు లేకపోవడంతో కేవలం నాలుగు కేంద్రాల్లోనే సుమారు 500 మంది బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది.

విడవకుండా కురుస్తున్న జోరు వర్షాలకు నగరంలోని 200వందల కాలనీలు నీటమునిగాయి. వర్షాభావం కాస్త తగ్గినప్పటికీ అవి ఇంకా ఆ వరదనీటిలోనే ఉన్నాయి. వరద తగ్గుముఖం పట్టినా 100పైగా కాల నీలు ఇంకా పూర్తిస్థాయిలో తేరుకోలేదు. కాలనీల ముంపు బాధితులు గత వారం రోజుల నుంచి తిండి, మంచినీళ్ల కోసం తల్లడి ల్లుతున్నారు. వారమైనా విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించకపోవడంతో ఆయా కాలనీలతోపాటు చుట్టు పక్కల బస్తీలుసైతం అంధకారంలోనే మగ్గుతున్నాయి. వరదకు రోడ్లు దెబ్బతిని గుంతల మయం అవగా, వీధులన్నీ బురదతో నిండిపోయాయి. దీనికితోడు వరద, మురుగునీటి వల్ల ఈగలు, దోమలు విజృంభిస్తున్నాయని, దీనివల్ల అంటువ్యాధులు ప్రబలుతాయని ఆందోళన చెందుతున్నారు.

అదే విధంగా మంగళవారం సాయంత్రం 6 గంటలకు హిమాయత్‌సాగర్‌ జలాశయం 1,763 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోవడంతో రెండు గేట్లు ఎత్తి వరదనీటిని మూసీలోకి వదిలిపెట్టారు. ఇక పక్కనే ఉన్న ఉస్మాన్‌సాగర్‌ గరిష్ట నీటిమట్టం 1,790 అడుగులుకాగా ప్రస్తుతం 1,786.110 అడుగుల మేర వరదనీరు చేరింది.

భారీ వర్షాలకు తడిసిన పురాతన కట్టడాలు నేలమట్టమవుతున్నాయి. గౌలిపురా మార్కెట్‌లో ప్రమాదకరంగా మారిన పురాతన ఇంటిని టౌన్‌ ప్లానింగ్‌ సిబ్బంది కూల్చేశారు. చార్మినార్‌ సర్దార్‌మహల్‌ జీహెచ్‌ఎంసీ కార్యాలయం సమీపంలోని పురాతన ఇంటితోపాటు గౌలిపురా సాయిబాబా దేవాలయం సమీపంలోని మరో పురాతన ఇల్లు, గుడిమల్కాపూర్‌లో ఒక ఇల్లు మంగళవారం తెల్లవారుజామున కూలింది. పాతబస్తీలో శిధిలావస్ధకు చేరిన సుమారు 15 పురాతన ఇళ్లను గురించి జీహెచ్‌ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేసి అందులో 8 ఇళ్లను కూల్చేశారు.

Web Titleheavy Rain fall in hyderabad due to cyclone effect
Next Story