అన్నీ తెలిసిన జూపల్లి, ఆ చిన్న లాజిక్‌ ఎలా మిస్సయ్యారు?

అన్నీ తెలిసిన జూపల్లి, ఆ చిన్న లాజిక్‌ ఎలా మిస్సయ్యారు?
x
జూపల్లి కృష్ణారావు
Highlights

తన బద్దశత్రువును భుజానికెత్తుకున్న అధిష్టానంపై, నివురుగప్పిన నిప్పులా వున్న ఆయన, ఒక్కసారిగా భగ్గుమన్నారు. మున్సిపల్‌ ఎన్నికలను ఆయుధంగా చేసుకుని...

తన బద్దశత్రువును భుజానికెత్తుకున్న అధిష్టానంపై, నివురుగప్పిన నిప్పులా వున్న ఆయన, ఒక్కసారిగా భగ్గుమన్నారు. మున్సిపల్‌ ఎన్నికలను ఆయుధంగా చేసుకుని సంధించాలనుకున్నారు. రెబెల్స్‌ను బరిలోకి దింపి, గెలిపించుకుని, ఇక హైకమాండే తనతో బేరసారాలకు దిగిరావాలనుకున్నారు. కానీ సీన్‌ రివర్సయి, ఇప్పుడు రెంటికీ చెడ్డ రేవడిలా లబోదిబోమంటున్నారు. ఇంతకీ ఎవరాయన? ఎందుకొచ్చింది ఆయనకు అలాంటి పరిస్థితి?

కొల్లాపూర్‌ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇప్పుడు అంతర్మథనంలో పడ్డారట. ఉద్యమంలో మంత్రి పదవి త్యాగం చేశారని కేసీఆర్‌తో మంచి మార్కులు కొట్టిసి ఆయన క్యాబినెట్ లో మంత్రి పదవి దక్కించుకున్న జూపల్లి ఇప్పుడు టీఆర్ఎస్ కు దూరమయ్యే పరిస్థితులు తలెత్తాయి. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీ ఎన్నికలు జూపల్లి రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకంలోకి నెట్టాయి.

ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డితో విభేదాల కారణంగా కొల్లాపూర్ మున్సిపాలిటీలో తన మద్దతుదారులను ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి రెబల్స్‌గా బరిలోకి దింపారు జూపల్లి కృష్ణారావు. మొత్తం 20 వార్డుల్లో పోటీ చేసిన జూపల్లి వర్గం, 11 వార్డుల్లో విజయం సాధించింది. దీంతో జూపల్లి వర్గం ఆనందంలో మునిగిపోయింది. ఆ వెంటనే కేటీఆర్ నుంచి ఫోన్ రావడంతో ఎంతో సంతోషంగా హైదరాబాద్ బయలుదేరిన జూపల్లి, ఆ తర్వాత కొన్ని గంటల వ్యవదిలోనే మొత్తం కథ తలకిందులు కావడంతో, షాకయ్యారట.

చైర్మన్ పదవి మినహా మరేదైనా కోరుకో అని జూపల్లి వర్గానికి స్పష్టం చేశారట కేటీఆర్. దీంతో ఒక్కసారిగా జూపల్లి వర్గీయుల ఆనందం ఆవిరైపోయిందట. చైర్మన్ పదవి లేకపోతే టీఆర్ఎస్‌లో చేరేది లేదని జూపల్లి వర్గం తేల్చి చెప్పిందట. దీంతో 9 వార్డులు గెలుకున్న టీఆర్ఎస్, తన సమీకరణలు ఎప్పటికప్పపడు మార్చుకుని మూడు ఎక్స్ అఫిషియా ఓట్లతో కొల్లాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను కైవసం చేసుకుంది. దీంతో జూపల్లి వర్గీయుల అవసరం లేకుండానే కొల్లాపూర్‌ మున్సిపాల్టీపై టీఆర్ఎస్ జెండా ఎగిరింది. అదే జూపల్లి కొంపముంచింది.

మొత్తం 11 వార్డులు గెలిచిన జూపల్లి వర్గం, తమను టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంటారని భావించారు. కాని గులాబీ అధిష్టానం జూపల్లికి ఝలక్కిచ్చింది. ప్రజల మద్దతు ఉన్నా అధిష్టానం మద్దతు దక్కకపోవడంతో, ఇప్పుడు జూపల్లి రూటెటంటూ అందరూ చర్చింకుంటున్నారు. మరో రెండు వార్డులను జూపల్లి వర్గం గెలుచుకుని ఉంటే, టీఆర్ఎస్ దిగోచ్చేదని, ఎక్స్ అఫీషియా ఓట్ల కారణంగా జూపల్లి ఆశలన్నీ అడియాశలయ్యాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఐతే పార్టీకి వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా క్షమించేది లేదని కేసీఆర్ చేసిన హెచ్చరికలను బేఖాతరు చేసిన జూపల్లి భవిష్యత్తు, ఇప్పుడు అడకత్తెరలో పోకచెక్కలా తయారైందన్న చర్చ జరుగుతోంది.

ఇప్పటి వరకు గులాబీ అధిష్టాం జూపల్లిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. చైర్మన్ల ఎంపిక పూర్తయ్యింది కాబట్టి పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిపై చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన జూపల్లిపై అదిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అన్నది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే కొల్లాపూర్‌లో తనకు కాకుండా హర్షవర్ధన్‌ను అధిష్టానం ప్రోత్సహిస్తుండటంతో రగిలిపోతున్న జూపల్లి, మున్సిపల్‌ పరిణామాల నేపథ్యంలో, తానే పార్టీ నుంచి వెళ్లిపోతారా లేదంటే అధిష్టానం వేటేస్తే, దాన్ని ప్రజల్లో సానుభూతిగా మలచుకుందామనుకుంటున్నారా ఇదే జరిగితే ఆయన కాంగ్రెస్‌లో చేరతారా..? లేక బీజేపి వైపు చూస్తారా అన్నది కూడా ఆసక్తిగా మారింది. మొత్తానికి గులాబీ అధిష్టానానికి తన బలం చూపిద్దామనుకుని, క్యాంపు రాజకీయాలతో సస్పెన్స్‌ సినిమా చూపిద్దామనుకున్న జూపల్లికి, రివర్స్‌ స్క్రీన్‌ ప్లేతో హైకమాండ్‌ షాకిచ్చిందన్న మాటలు వినపడ్తున్నాయి. చూడాలి జూపల్లి ఫ్యూచరేంటో.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories