Harish Rao: బాల్క సుమన్‌ అరెస్టును ఖండించిన హరీశ్‌రావు

Harish Rao: మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టుపై బీఆర్ఎస్ అగ్రనేత, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Arun Chilukuri
Published on: 18 Feb 2026 5:16 PM IST
Harish Rao: బాల్క సుమన్‌ అరెస్టును ఖండించిన హరీశ్‌రావు
X

Harish Rao: మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టుపై బీఆర్ఎస్ అగ్రనేత, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా, అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు 'X' (ట్విట్టర్) వేదికగా వరుస ట్వీట్లు చేస్తూ కాంగ్రెస్ అరాచక వైఖరిని ఎండగట్టారు.

క్యాతనపల్లిలో బీఆర్ఎస్‌కు స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ, అధికార బలం మరియు పోలీసు బలంతో ప్రజా తీర్పును కాలరాస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. "పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తున్న తీరును చూసి యావత్ తెలంగాణ అసహ్యించుకుంటోంది. కాంగ్రెస్ మార్కు గూండాగిరి రాజ్యమేలుతోంది" అని ఆయన ఘాటుగా విమర్శించారు.

జనగాంలో దళిత మహిళా కౌన్సిలర్‌పై దాడి జరిగినప్పుడు పోలీసులు చోద్యం చూశారని, రక్షణ కల్పించాల్సింది పోయి గూండాలకు కొమ్ముకాస్తున్నారని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. క్యాతనపల్లే కాకుండా తొర్రూరు, ఇబ్రహీంపట్నం, జహీరాబాద్ వంటి చోట్ల అడ్డదారుల్లో పీఠాలను దక్కించుకుంటున్నారని విమర్శించారు. "రాష్ట్రంలో భూములను కబ్జా చేసినట్లే, రాజకీయ పీఠాలను కూడా కాంగ్రెస్ కబ్జా చేస్తోంది" అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

దళిత నాయకుడు బాల్క సుమన్‌ను భేషరతుగా విడుదల చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. క్యాతనపల్లి చైర్మన్ ఎన్నిక పారదర్శకంగా, ప్రజాస్వామిక వాతావరణంలో జరిగేలా చూడాలని తెలంగాణ ఎన్నికల కమిషన్‌ను (@CEO_Telangana) ఆయన కోరారు. కాంగ్రెస్ అరాచకాలపై ప్రజలు త్వరలోనే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story