కాంగ్రెస్ ను వదలని ముఠా తగాదాలు.. ముఠా తగాదాల్లో మరెన్నో మలుపులు

కాంగ్రెస్ ను వదలని ముఠా తగాదాలు.. ముఠా తగాదాల్లో మరెన్నో మలుపులు
x
Highlights

కాంగ్రెస్ ను కాంగ్రెస్ మాత్రమే ఓడించగలదు ఇదీ కొన్నేళ్ళ క్రితం దాకా కాంగ్రెస్ అధికారంలో ఉన్న సందర్భాల్లో వినవచ్చే మాట. కాంగ్రెస్ ను కాంగ్రెసే నాశనం...

కాంగ్రెస్ ను కాంగ్రెస్ మాత్రమే ఓడించగలదు ఇదీ కొన్నేళ్ళ క్రితం దాకా కాంగ్రెస్ అధికారంలో ఉన్న సందర్భాల్లో వినవచ్చే మాట. కాంగ్రెస్ ను కాంగ్రెసే నాశనం చేసుకుంటోంది ఇదీ కొన్నేళ్ళుగా విపక్షంలో ఉన్న కాంగ్రెస్ గురించి వినవస్తున్న మాట. నిజానికి జాతీయ స్థాయిలో అయినా రాష్ట్ర స్థాయిలో అయినా ఈ తరహా వ్యాఖ్యల్లో ఎంతో నిజం ఉంది. ఈ రెండు సందర్భాల్లోనూ కీలకపాత్ర వహించేది ముఠా తగాదాలే.

కాంగ్రెస్ అంటే ముఠాలు. అది ఇప్పటి సంగతేం కాదు. 125 ఏళ్ళ చరిత్ర ఉన్న ఆ పార్టీ ఆవిర్భావం నుంచీ ఉన్నదే. కాంగ్రెస్ పుట్టుకొచ్చిందే కొన్ని ముఠాల కలయిక నుంచి. దఫదఫాలుగా ఆ పార్టీ ముక్కచెక్కలైంది కూడా ముఠా తగాదాల కారణంగానే. దేశంలో మరే పార్టీలో లేనన్ని ముఠా తగాదాలు కాంగ్రెస్ లోనే ఉన్నాయి. 125 ఏళ్ళ క్రితం కాంగ్రెస్ పుట్టింది ఒక పార్టీగా కాదు. స్వాతంత్ర్య పోరాటానికి ఒక వేదికగా అది ఆవిర్భవించింది. అందుకే భిన్న భావజాలాలకు చెందిన వారు అందులో చేరారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత అలాంటి వారంతా ఒక్కొక్కరుగా బయటకు వెళ్లిపోయారు. అలా మిగిలిన పార్టీలో భావజాలాలకు బదులుగా వ్యక్తిగత అజెండాలతో ముఠాలు పుట్టుకొచ్చాయి. దేశానికి స్వాతంత్ర్యం వస్తున్న సందర్భంలోనే ఆ ముఠాతగాదాలకు బీజం పడింది. ఆ తరువాత అది మహా వృక్షంగా మారింది. ఓ మర్రిచెట్టుకు దాని ఊడలు బలాన్ని ఇవ్వాలి. కాంగ్రెస్ విషయంలో మాత్రం ఆ ఊడలే ముఠాల రూపంలో దాన్ని బలహీనపరుస్తూ వచ్చాయి. తెలంగాణ రాష్ట్ర స్థాయిలో అది మరోసారి స్పష్టంగా బయటపడింది.

అధికార పక్షాన్ని విమర్శించేందుకు లభించే ఏ అవకాశాన్ని కూడా విపక్షం వదులుకోవద్దనేది సాధారణ సూత్రం. కాంగ్రెస్ లో మాత్రం దీనికి భిన్నంగా జరుగుతుంటుంది. అందుకే కాంగ్రెస్ ను పీతల గంపగా కూడా వ్యవహరిస్తుంటారు. గంపలో నుంచి ఒక పీత బయటపడుదామని ప్రయత్నిస్తుంటే, మిగితావి దాన్ని కిందికి లాగుతాయంటారు. కాంగ్రెస్ లో కూడా అంతే. ఒక నాయకుడు బలపడుదామని చూస్తుంటే, మిగిలిన వారు కిందికి లాగుతుంటారు. నిజానికి ఇది కాంగ్రెస్ విధానంగానే ఉంటోంది. పార్టీ అధిష్ఠానం కూడా ఈ తరహా ఎత్తుగడలే అవలంబిస్తుంటుంది. అవే ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో కనిపించడంలో విశేషం లేదు. కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి విషయానికి వస్తే ఇందులో రెండు అంశాలున్నాయి. అందులో ఒకటి ఆయన పై వచ్చిన ఆరోపణలకు సంబంధించింది, మరొకటి ఆయన ఇతరులపై చేసిన ఆరోపణలకు సంబంధించింది. ఈ రెండు సందర్భాల్లోనూ సొంత పార్టీ నుంచి ఆయనకు సపోర్ట్ లభించకపోగా విమర్శలే అధికమయ్యాయి.

కాంగ్రెస్ పార్టీ లో ఒక్క నాయకుడు మాత్రమే ఎదురులేని నేతగా రాణించిన సందర్భాలు అతి తక్కువ. ఎంత బలమైనా నాయకులైనా జాతీయ స్థాయిలో అయినా, రాష్ట్రాల స్థాయిలో అయినా ముఠా తగాదాల్లో చిక్కుకుపోయిన ఉదంతాలే ఎక్కువగా ఉన్నాయి. సాక్షాత్తూ కాంగ్రెస్ అధిష్ఠానమే ముఠాలను ప్రోత్సహిస్తుంటే, ఇక ముఠా తగాదాలు ఉండవా అనే వారూ ఉన్నారు.

కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి చేరికనే ఓ ఆశ్చర్యకరమైన అంశం. మరో వైపున ఆయన రాక పార్టీలో కొందరికి మింగుడుపడలేదు. ఆయన అనుసరించిన ధోరణి మరెందరికో కొరుకుడు పడలేదు. ఆయన వ్యవహార శైలి ఎలా ఉన్నప్పటికీ, కాంగ్రెస్ లో కొంతమేర కదలిక వచ్చేందుకు ఆయన కారణమయ్యారు. అదే సమయంలో ఆయన దుందుడుకు వైఖరి పార్టీలో మొదటినుంచి ఉన్న కొందరు నేతలకు నచ్చలేదు. ఒంటరిగానే ముందుకు దూసుకెళ్లడాన్ని కొంతమంది నాయకులు మెచ్చలేదు. అలాంటి వారంతా సమయం వచ్చినప్పుడల్లా బయటపడ్డారు. ఇప్పుడు జరుగుతోంది కూడా అదే. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి లాంటివారిని ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. కాంగ్రెస్ సంస్కృతికి ఓ ప్రత్యేకత ఉంది. అన్నిటిపై తమ ముద్ర ఉండాలని అధిష్ఠానం భావిస్తుంటుంది. గతంలో జగన్ ఓదార్పు యాత్ర చేపట్టాలనుకున్నప్పుడు అధిష్ఠానం నుంచి అనుమతి రాలేదు. అలాంటి చర్యలతో జగన్ సొంత పార్టీ పెట్టుకోవాల్సి వచ్చింది. అదే సమయంలో పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుంది. అందుకే రేవంత్ రెడ్డిపై వచ్చిన ఆరోపణలను, రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను కూడా రేవంత్ రెడ్డి సొంత వ్యవహారాలుగా కొందరు పార్టీ నాయకులు చెప్పుకొచ్చారు.

జగ్గారెడ్డి మాటలు వింటే ఓ విషయం మాత్రం స్పష్టమైంది. తమకు డైరెక్షన్ ఇవ్వాల్సిందిగా ఆయన పార్టీ అధిష్ఠానాన్ని కోరారు. ఫేస్ బుక్ లో జరుగుతున్న డిస్ట్రబెన్స్ కార్యక్రమాలను సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఆయన అనే కాదు మరో వైపున హనుమంతరావు వ్యవహార శైలి కూడా అదే విధంగా ఉంది. రేవంత్ రెడ్డి తన వ్యక్తిగత వ్యవహారాలను పార్టీకి అంటగట్టడం సరికాదని ఆయన మండిపడ్డారు. పార్టీలో చర్చించిన తరువాతనే ఒక అంశాన్ని టేకప్ చేయాలని స్పష్టంగా చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ ఇటీవలి చరిత్రలో వైఎస్ హయాంలో మాత్రమే ముఠా తగాదాలు కొంతమేరకు తగ్గాయి. అదే సమయంలో పార్టీలో తనదైన శైలిలో ముందుకెళ్ళిన ఘనత కూడా ఆయనకే దక్కింది. ఆయన హయాంలోనూ ఆయనకు వ్యతిరేక వర్గాలు ఉన్నాయి. అంతకంటే ముందు చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇలా ఎంతో మందికి ఎన్నో వర్గాలు తెరపైకి వచ్చాయి. అప్పట్లో కేకే లాంటి వారు సొంత గొంతుకలు వినిపించారు. పార్టీలోకి వచ్చిన కొత్తలో హల్ చల్ చేసిన రేవంత్ రెడ్డి ఆ తరువాత మాత్రం ఆ విషయంలో విఫలమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. సొంతంగా ఆయన చేసిన కొన్ని కార్యక్రమాలకు పార్టీ నేతల నుంచి పెద్దగా మద్దతు రాలేదు. అధిష్ఠానం నుంచి అనుమతి ఉంటే తప్ప పార్టీ నేతలు ఏకతాటిపైకి రావడం కష్టం. కొత్తగా చేరిన వారికి పార్టీలో కీలక పదవులు ఇవ్వవద్దని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కొందరు డిమాండ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి కి సత్తా ఉంటే టీడీపీ లో ఉన్నప్పుడే నిరూపించుకునే వారని అంటున్నారు. కాంగ్రెస్ కు బలం ఉంది కాబట్టే ఆయన కాంగ్రెస్ లో చేరి పదవులు కోసం ప్రయత్నిస్తున్నారని విమర్శిస్తున్నారు. రాష్ట్రాల్లో బలమైన నాయకత్వాన్ని ఎదగనీయకపోవడం కాంగ్రెస్ లో ఆనవాయితీగా వస్తోంది. అధిష్ఠానం వ్యవహరించే తీరు కూడా అలానే ఉంటుంది. రాష్ట్రాల్లో ఉన్న నేతలను జాతీయ స్థాయిలోకి తీసుకోవడం, జాతీయ స్థాయిలో ఉన్న వారిని రాష్ట్రాల్లోకి పంపడం సాధారణ విషయమే. ఎన్నికలకు ముందు లేదంటే సంస్థాగత ఎన్నికల సందర్భంగానో కాంగ్రెస్ లో నాయకత్వ మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ ధపా మాత్రం తెలంగాణలో అందుకు భిన్నంగా జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

గతంలో జరిగిన ఐటీ దాడులు కావచ్చు ఇటీవల అరెస్టు కావడం కావచ్చు పార్టీలో కొంత షైన్ అవుతున్నారనుకుంటున్న సమయానికి రేవంత్ రెడ్డి మరో విధమైన చిక్కుల్లో చిక్కుకుపోతున్నారు. ఇక తాజాగా రేవంత్ రెడ్డి అరెస్టు అంశం లోక్ సభలో ప్రస్తావనకు వచ్చింది. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ ఎంపీ నామానాగేశ్వర రావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ఎంపీ నామా లోక్‌సభలో ప్రస్తావించారు. నిబంధనలు ఉల్లంఘించి పోలీసుల కళ్లు గప్పి రేవంత్ రెడ్డి డ్రోన్ కెమెరాలతో వీడియోలు తీశారని అన్నారు. ఇటువంటివి ప్రైవసీని దెబ్బతీసే యత్నాలని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి పై ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాలని నామా కోరారు. మరో వైపున రేవంత్ రెడ్డికి మద్దతుగా తమిళనాడు కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణి మాట్లాడారు. అరెస్టు విషయాన్ని ఓ లేఖ ద్వారా స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇక తాజాగా పీసీసీ పదవి పై కూడా చర్చ మొదలైంది. పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చిందన్నట్లుగా మరో వ్యక్తికి పీసీసీ అధ్యక్షపదవి దక్కినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇటీవల అధిష్ఠానం అపాయింట్ మెంట్ ఇవ్వడం కొత్త ఊహగానాలకు తెరతీసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ముఠా తగాదాలు మరెన్ని మలుపులు తిరుగుతాయో చూడాలి.

కాంగ్రెస్ లో ముఠా తగాదాలు రాష్ట్రాల్లో ఆ పార్టీని బలహీనం చేస్తూ వచ్చాయి. రాహుల్ హయాంలో ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు కొన్ని ప్రయత్నాలు జరిగాయి. ఆ తరువాత మాత్రం పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. రాష్ట్రాల్లో పార్టీ వ్యవహారాల్లో కోటరీ ప్రాబల్యం అధికంగా ఉండడం మొదటి నుంచీ ఉన్నదే. వర్గాలను ప్రోత్సహించేది కూడా అదే. తాజాగా రేవంత్ రెడ్డి అరెస్టు విషయంలో, తెలంగాణ పీసీసీ విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం ఎలా వ్యవహరిస్తుందో వేచి చూడాలి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories