Telangana: సూపర్‌ స్ర్పెడర్స్‌ను గుర్తించే పనిలో ప్రభుత్వం

Telangana: Govt. in Plans to Find out super Spreaders
x

రెప్రెసెంటేషనల్  ఇమేజ్ 

Highlights

Telangana: ఫస్ట్‌ వేవ్‌ కంటే కంటే సెకండ్‌ వేవ్‌లో వైరస్‌ జెట్ స్పీడ్ స్పేడ్ అవుతోంది.

Telangana: ఫస్ట్‌ వేవ్‌ కంటే కంటే సెకండ్‌ వేవ్‌లో వైరస్‌ జెట్ స్పీడ్ స్పేడ్ అవుతోంది. ఇంట్లో ఒక్కరికొస్తే మొత్తం కుటుంబమంతా పాజిటివ్‌గా మారుతోంది. కరోనా మాకు రాదు వచ్చినా మమ్మల్ని ఏమీ చేయలేదు. ఇది చాలా మందిలో కనిపిస్తున్న నిర్లక్ష్య ధోరణి. ఇదే కొవిడ్‌ శరవేగ విస్తరణకు దారితీస్తోంది. రాష్ట్రంలో నమోదవుతున్న వాటిలో దాదాపు 80 శాతానికి పైగా కేసుల్లో ఎటువంటి లక్షణాలు లేకుండానే నిర్ధారణ అవుతున్నాయి. దీంతో ఎవరిలో వైరస్‌ ఉందో ఎవరిలో లేదో తెలియని గందరగోళం నెలకొంది.

వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, శానిటైజర్లు వాడడం తప్పనిసరని వైద్యనిపుణులు చెబుతున్నారు. మనం ఈ జాగ్రత్తలన్నీ తీసుకున్నా నిత్యావసరాలైన పాలు, కూరగాయలు, కిరాణా సరుకులు వంటివి తెచ్చుకోవడానికి బయటికి వెళ్లక తప్పదు! ఇలా బయటికి వెళ్లినప్పుడు ఏ పాల బూత్‌లోనో, కిరాణా దుకాణంలోనో, పెట్రోల్‌ బంకులోనో, కరోనా వైరస్‌ సోకిన వారుంటే అంతే సంగతులు! ఒక్కరి నుంచి అనేక మందికి మహమ్మారి వ్యాపిస్తుంది! ఇలాంటి వారినే సూపర్‌ స్ర్పెడర్స్‌ అంటారు! అయితే తెలంగాణలో 25 లక్షల మందికి పైగా సూపర్‌ స్ర్పెడర్స్‌ ఉంటారని అంచనా! కరోనా వాహకులుగా భావించే వీరందరికీ వీలైనంత త్వరగా వ్యాక్సిన్‌ వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

డ్రైవర్లు, వీధి వ్యాపారులు, గ్యాస్‌ డెలివరీ బాయ్స్‌, బ్యాంకు ఉద్యోగులు, పెట్రోల్‌ బంకుల్లో పనిచేసేవారు, ఊరూరు తిరుగుతూ వ్యాపారం చేసేవారంతా ఈ సూపర్‌స్ర్పెడర్ల విభాగంలోకి వస్తారు. వీరిని గుర్తించే ప్రక్రియను ప్రభుత్వం ఇప్పటికే మొదలుపెట్టింది. అన్ని జిల్లాల్లోనూ వివరాలను సేకరిస్తున్నారు. ఈ బాధ్యతలను జిల్లా కలెక్టర్లకు అప్పగించారు. రాష్ట్రంలో సూపర్‌స్ర్పెడర్లు 25 లక్షల వరకు ఉంటారని వైద్య ఆరోగ్యశాఖ అంచనా వేస్తోంది. మూడు నాలుగు రోజుల్లో జిల్లాల వారీగా సేకరించిన సూపర్‌ స్ర్పెడర్ల వివరాలపై ఓ నివేదిక తయారు చేయనున్నారు. దాన్ని సీఎం కేసీఆర్‌కు అందించనున్నారు. ఆ నివేదిక ఆధారంగా వారికి టీకా ఎలా ఇవ్వాలన్న దానిపై మార్గదర్శకాలు రూపొందించే అవకాశం ఉంది.

ప్రస్తుతం సూపర్‌ స్ర్పెడర్లను వైద్య ఆరోగ్యశాఖ రెండు విభాగాల కింద పరిగణించనుంది. ఒకటి 45 ఏళ్లు పైబడినవారు, రెండోది 18-45 మధ్యవారు. మొదటి కేటగిరీలోకి వచ్చేవారందరికీ కేంద్ర ప్రభుత్వ కోటాలో టీకా ఇవ్వనున్నారు. ప్రస్తుతం 45 ఏళ్లు దాటిన వారికి కేంద్రమే ఉచితంగా టీకాలు ఇస్తోంది. ఆలోపు వయసు వారికి రాష్ట్ర ప్రభుత్వ కోటాలో ఇవ్వాలని సర్కారు యోచిస్తోంది. ఇలా రెండు విభాగాలుగా చేసి సూపర్‌స్ర్పెడర్లందరికీ వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు సమాయత్తమవుతోంది. అయితే సూపర్‌స్ర్పెడర్లలో 45 ఏళ్లకు పైబడిన వారు కొందరు టీకా తీసుకొని ఉంటారనేది ఓ అంచనా. టీకాల లభ్యతను బట్టి వీలైనంత త్వరగా ఈ సూపర్‌ స్ర్పెడర్లకు వ్యాక్సిన్‌ ఇస్తామని వైద్యశాఖ చెబుతోంది. సీఎం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వగానే ఈ కార్యక్రమం మొదలు పెడతామని అంటోంది. అయితే వీరికి కొవిన్‌ పోర్టల్‌ ద్వారా రిజిస్టర్‌ చేసుకోవాలా లేక వచ్చిన వారికి వచ్చినట్లుగా టీకా ఇవ్వాలా? అన్న దానిపై ఇంతవరకు స్పష్టత రాలేదు. ఇక కొన్ని దేశాల్లో ఇప్పటికే సూపర్‌స్ర్పెడర్లను గుర్తించి టీకాలు ఇచ్చారు. మన దేశంలో మాత్రం తొలిసారిగా తెలంగాణలోనే వీరిని గుర్తించి టీకాలివ్వనున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories