Top
logo

గురువారం వచ్చిందంటే చాలు ఆ ఊళ్లో టెన్షన్ టెన్షన్

గురువారం వచ్చిందంటే చాలు ఆ ఊళ్లో టెన్షన్ టెన్షన్
X

గురువారం వచ్చిందంటే చాలు ఆ ఊళ్లో టెన్షన్ టెన్షన్

Highlights

గురువారం వచ్చిందంటే చాలు ఆ ఊళ్లో టెన్షన్ టెన్షన్ దెయ్యం భయంతో ఇళ్లన్నీ ఖాళీ ఎవరికి ఏం జరుగుతుందోనన్న భయం...

గురువారం వచ్చిందంటే చాలు ఆ ఊళ్లో టెన్షన్ టెన్షన్ దెయ్యం భయంతో ఇళ్లన్నీ ఖాళీ ఎవరికి ఏం జరుగుతుందోనన్న భయం వారిలో కలుగుతుంటుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో దెయ్యం భయంతో కొన్ని గ్రామాలు వణికిపోతున్నాయి. జనగామ జిల్లా పోతారం గ్రామంలో దెయ్యం హల్ చల్ చేస్తే మానుకోటలో ఏకంగా కెమెరాలకే చిక్కింది. ఇంతకూ అసలు దెయ్యాలు ఉన్నాయా వీటి వెనక ఏం జరుగుతోంది. హెచ్ ఎంటీవీ క్షేత్రస్థాయిలో పర్యటించి నిజానిజాలు తేల్చే ప్రయత్నం చేసింది.

జనగామ జిల్లాలోని ఓ మారుమూల గ్రామం పేరు పోతారం. ఇన్నాళ్లు ఈ ఊరి పేరు తెలిసిన వారే లేరు. కానీ ఇప్పుడు ఈ గ్రామం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఓ దెయ్యం ఈ ఊరిని తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ చేసింది. ఈ గ్రామంలో వరుసగా ముగ్గురు యువకులు అమావాస్యకు ముందు వచ్చే గురువారాల్లో చనిపోవడంతో గ్రామస్థుల్లో భయాన్ని రేకెత్తించింది. దెయ్యం కారణంగానే యువకులు చనిపోయారని నమ్మి ఊరిలోని ఓ కాలనీ మొత్తం వదిలి వెళ్లిపోయారు. జనవిజ్ఞానవేదిక గ్రామంలో ప్రజలను చైతన్యవంతులను చేయడానికి ప్రయత్నం చేసింది.

గ్రామానికి సంబంధించిన ఓ ముఖ్య నాయకుడు సృష్టించిందే ఈ దెయ్యం బాగోతం అనేది స్పష్టంగా తెలిసింది. బుడిగజంగాల కాలనీలో ఓ నాయకుడు కొన్నేళ్ల క్రితం తరిగొప్పుల వద్ద రెండెకరాల స్థలం కొనుగోలు చేశారు. అది అమ్ముడు పోకపోవడంతో పాటు అక్కడ పెద్దగా రేటు రాకపోవడంతో ఏం చేయాలనే దిశగా ఆలోచించాడు. ఇదే సమయంలో కాలనీలో వరుస మరణాలు ఆయనకు కలిసొచ్చాయి. వెంటనే ప్రణాళిక సిద్దం చేశాడు. మంత్రగాళ్లను పిలిపించి తాయత్తులు కట్టించి చివరకు కాలనీ ఖాళీ చేసి తన స్థలంలోకి మారేలా చూసుకుని సక్సెసయ్యాడు. అంతకు ముందు కేవలం 80 వేలకు స్థలం అమ్మిన ఆతను ఇప్పుడు అదే స్థలం మూడు నుంచి నాలుగు లక్షలకు అమ్మాడట.

అసలు ఆ గ్రామంలో ఏం జరుగుతుందో చూడాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సైతం అక్కడికి వెళ్లి గ్రామస్థుల్లో దెయ్యం భయం పోగొట్టేందుకు దెయ్యం ఉందంటూ పుకార్లు లేవదీసిన ప్రాంతంలో అందరితో కలిసి భోజనం చేసారు.

పోతారం కథ ఇలా ఉంటే.. మానుకోటలో మరో కథ వెలుగులోకి వచ్చింది. ఇక్కడైతే ఏకంగా దెయ్యమే కెమెరాకు చిక్కింది. అచ్చం హాలీవుడ్ సినిమాల్లో కనిపించే సీన్ ఇక్కడ కనిపిస్తోంది. తెల్లని ముసుగుతో స్లో మోషన్ నడకతో చూడగానే భయపడేలా సీన్ క్రియేట్ చేశారు. ఈ దెయ్యం మహబూబాబాద్ జిల్లా జంగిలిగొండ గ్రామశివారులోని గుట్టల వద్ద తిరుగుతోంది. ఎవరో కావాలని చేస్తున్నారని చాలా క్లియర్‌గా తెలుస్తున్నా సరే ఈ దృశ్యాలు చూసిన జనాలు భయపడుతున్నారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో గతంలో కూడా ఇటువంటి సంఘటనలు అనేకం జరిగాయి. వీటన్నిటి వెనక ఏంటనే ఆరా తీసినప్పుడు కేవలం కొందరి స్వార్థం కారణంగానే ఇలాంటి ఘటనలు సృష్టిస్తారనేది సుస్పష్టం. పోతారం గ్రామంలో కూడా అదే జరిగింది. ఈ విషయంలో పోలీస్ లు కొంచెం సీరియస్ గా దృష్టి పెడితే దెయ్యం సృష్టి కర్తలెవరో తేలిపోతుంది.

Web TitleGhost Fever in Potharam Village
Next Story