GHMC Elections 2020: రాజకీయ పార్టీల్లో పెరిగిన హీట్!

GHMC Elections 2020: రాజకీయ పార్టీల్లో పెరిగిన హీట్!
x
Highlights

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల్లో వేడి జోరందుకుంది.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల్లో వేడి జోరందుకుంది. నామినేషన్ల దాఖలుకు ఒక్కరోజే గడువు ఉండటంతో అభ్యర్థుల వేటలో ప్రధాన పార్టీలు హడావుడిగా ఉన్నాయి. అయితే అసంతృప్తి సెగలు తగలకుండా జాగ్రత్తలు పడుతోన్న పార్టీలు.. ఆచితూచి అడుగులు వేస్తున్నాయి.

గ్రేటర్ ఎన్నికలకు నామినేషన్ల గడువు ముగుస్తుండటంతో అన్ని పార్టీలు అభ్యర్థుల తుది జాబితాపై కసరత్తు మొదలుపెట్టాయి. తొలి జాబితాలో 105 మంది అభ్యర్థులను ప్రకటించిన టీఆర్ఎస్.. మరో 20 మందితో రెండో జాబితాను విడుదలచేసింది. మరో 25 మంది అభ్యర్ధుల పేర్లు ఖరారు చేయాల్సి ఉంది. అయితే తొలి జాబితాలో దాదాపు సిట్టింగ్‌లకే టికెట్ ఇచ్చిన టీఆర్ఎస్‌.. రెండో జాబితాలో ఆరుగురు సిట్టింగ్ కార్పోరేటర్లకు మాత్రమే అవకాశం ఇచ్చింది. మైలార్ దేవ్ పల్లి సిట్టింగ్ కార్పోరేటర్ పార్టీ మారడంతో కొత్తవారికి అవకాశం ఇచ్చారు.

అటు కాంగ్రెస్ ఇప్పటివరకు నాలుగు జాబితాలను విడుదల చేసింది. బుధవారం 47 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన హస్తం పార్టీ.. గురువారం మరికొందరు అభ్యర్థులతో రెండు జాబితాలను రిలీజ్ చేసింది. ఇప్పటివరకు మొత్తం 81 మందిని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. మరో 69 మంది అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది.

మరోవైపు తొలిజాబితాలో కేవలం 21 వార్డులకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. అభ్యర్థుల ఖరారు ప్రక్రియ వేగవంతం చేసింది. గురువారం మరో రెండు జాబితాలను విడుదల చేసింది. రెండో జాబితాలో 19 మందిని.. మూడో జాబితాలో 34 మందిని ప్రకటించింది. ఆ తర్వాత అర్ధరాత్రి 56 మందితో కూడిన మరో జాబితా రిలీజ్ చేసింది బీజేపీ. దీంతో ఇప్పటివరకు బీజేపీకి చెందిన 130 మంది అభ్యర్థులు ఫిక్స్ అయ్యారు.

అటు టీడీపీ కూడా తొలి జాబితాను రిలీజ్ చేసింది. 90 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. ఇక, హైదరాబాద్ పాతబస్తీపై పట్టున్న ఎంఐఎం ఇంతవరకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై నిర్ణయం తీసుకోలేదు. అయితే ఇవాళ్టితో నామినేషన్ల గడువు ముగుస్తుండటంతో తీవ్ర కసరత్తులు చేస్తున్నారు అన్ని పార్టీల నేతలు. ఇప్పటివరకు టీఆర్ఎస్ మినహా.. మిగిలిన పార్టీలు 50కి పైగా స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. దీంతో ఆశావహుల్లో టెన్షన్ మొదలైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories