Rewind 2025: 2025లో జీహెచ్ఎంసీలో అనేక మార్పులు.. దేశంలోనే అతిపెద్ద నగరంగా గుర్తింపు..!

GHMC 2025 Year Review: 2025లో జీహెచ్ఎంసీ అనేక మార్పులు చేర్పులకు గురైంది. దేశంలోనే అతిపెద్ద మహానగరంగా రూపొందింది.
GHMC 2025 Year Review: 2025లో జీహెచ్ఎంసీ అనేక మార్పులు చేర్పులకు గురైంది. దేశంలోనే అతిపెద్ద మహానగరంగా రూపొందింది. నగరం చుట్టు ఉన్న మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు కలుపుకొని.. జీహెచ్ఎంసీ మహానగరాలకే మహానగరంగా మారింది. అంతేకాదు.. మరెన్నో అద్భుతాలు ఈ ఏడాదిలో జరిగాయి. ఇంతకీ 2025లో జీహెచ్ఎంసీలో జరిగిన మార్పులు ఏమిటి.
2025 లో జిహెచ్ఎంసి బాహుబలిలా విస్తరించింది. దేశంలోనే అతి పెద్ద నగరంగా గుర్తింపు పొందింది.. చుట్టుపక్కల ప్రాంతాల విలీనంతో మరింతగా విస్తరించింది. అయితే పరిస్థితులు మాత్రం మూడు అడుగుల ముందుకు ఆరడుగుల వెనక్కు అన్న చందంగా తయారైంది. ఈ ఏడాది కొత్త మినిస్టర్ ఆధ్వర్యంలో జిహెచ్ఎంసి ముందుకు వెళ్ళింది. ఒక ఉప ఎన్నిక, కొన్ని ఫ్లైఓవర్ ల ప్రారంభంతో జీహెచ్ఎంసీలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి.
జిహెచ్ఎంసి 2025 లో కూడా నగరవాసులకు అనేక వసతులను అందించింది.. ఈ ఏడాది ఏప్రిల్ లో జిహెచ్ఎంసి కమిషనర్ గా కర్ణన్ బాధ్యతలు స్వీకరించారు.. ఇక నగరం పేరు చెప్తే ట్రాఫిక్ సమస్య గుర్తువస్తుంది ఇలాంటి ట్రాఫిక్ కు చెక్ పెట్టేందుకు ఇప్పటికే అనేక ఫ్లై ఓవర్లు నగర్ వాసులకు అందుబాటులోకి వచ్చాయి.. ఇక ఈ ఏడాది చాలా సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ముఖ్యమైన ఫ్లైఓవర్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. జూ పార్క్ నుంచి ఆరాంగర్ ఫ్లైఓవర్ పనుల ఆలస్యం వల్ల ఈ ప్రాంతంలో నిత్యం ట్రాఫిక్ సమస్యలు ఉండేవి.. అయితే ఈ ఏడాది ఈ ఫ్లైఓవర్ కు మోక్షం కలిగింది.. ఆ తర్వాత అత్యంత రద్దీగా ఉండే కొండాపూర్ నుంచి గచ్చిబౌలి వరకు ఉండే ఫ్లై ఓవర్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు... ఈ ఫ్లైఓవర్ కు పిజెఆర్ పేరు ను పెట్టింది ప్రభుత్వం.. వీటితోపాటు ఓల్డ్ సిటీలో ఓ ఫ్లైఓవర్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు
కేబీఆర్ పార్క్ దగ్గర చాలా ఏళ్లుగా ఉన్న పెండింగ్ సమస్యలకు ఏడాది చెక్ పెట్టారు. ఆటోమేటిక్ కార్ పార్కింగ్ వ్యవస్థని అందుబాటులోకి తీసుకొచ్చారు.. ఇది అక్కడ వాకర్స్ కు ఎంతో ఉపయోగకరంగా మారింది.. మరోవైపు ఈ ఏడాది 117 ఏళ్ల తర్వాత ఆ స్థాయిలో వరదలు నగరాన్ని ముంచెత్తాయి. జంట జలాశయాలనుంచి ఒకేసారి నీటిని కిందకు విడుదల చేయడంతో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి.. భారీ వర్షాలతో నగరం మొత్తం అతలాకుతలంగా మారింది.. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, పూడిక తీయకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.. ఏడాది ఫుడ్ సేఫ్టీ తనిఖీలతో భాగ్యనగరంలో ఫుడ్ ది బెస్ట్ కాదు అని నిరూపితమైంది. పెద్ద పెద్ద హోటల్స్ కూడా కనీస ప్రమాణాలు పాటించట్లేదని జిహెచ్ఎంసి ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో బయటపడింది..
ఈ ఏడాది కూడా అనుకున్న స్థాయిలో అభివృద్ధి పనులు ఎక్కడ జరగలేదు.. మహిళలకు ప్రత్యేక టాయిలెట్లు ఏర్పాటు చేయడంలో మరోసారి జిహెచ్ఎంసి విఫలమైంది.. మరోవైపు ఈ ఏడాదే జిహెచ్ఎంసి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ సమర్థవంతంగా నిర్వహించింది.. జిల్లా ఎన్నికల అధికారి జిహెచ్ఎంసి కమిషనర్ అయినా కర్ణన్ ఎలాంటి అవాంతరాలు లేకుండా ఎన్నికను సజావుగా నిర్వహించారు .. ఇక ఈ ఏడాది చివరిలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఒక సంచలనంగా మారింది అదే 20 మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లను జిహెచ్ఎంసి లో విలీనం చేస్తూ తీసుకున్న నిర్ణయం. దీంతో జిహెచ్ఎంసి పరిధి 650 చదరపు కిలోమీటర్ల నుండి 2000 చదరపు కిలోమీటర్లకు విస్తరించింది. ప్రస్తుతం ఉన్న 150 వార్డులు 300 వార్డులుగా రూపాంతరం చెందాయి. దీనిపైన చాలామంది కోర్టుకు వెళ్లిన వాటిని కొట్టేసింది కోర్టు. దీంతో వార్డుల విభజన అధికారికం అయ్యాయి.
ఇంతింతై.. వటుడింతై అన్నట్లు జీహెచ్ఎంసీ తన పరిధిని పెంచుకొని.. దేశంలోనే అతి పెద్ద నగరంగా విస్తరించింది. సాధారణంగా తన పరిధిలోని ఉన్న సమస్యలనే పట్టించుకోలేని.. జీహెచ్ఎంసీ ఇప్పుడు.. పెరిగిన మహానగరంలోని కొత్త సమస్యలతో ఎలా వేగుతుంది.. ఎలాంటి పరిష్కారాలు చూపుతుంది అనేది సర్వత్రా ఆసక్తిగా మారింది. మరోవైపు 2026 లో జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రక్రియలోకి వెళ్లనుంది.. మరి ఆ దిశగా అభివృద్ధి చెందుతుందా.. అంటే వేచిచూడాల్సిందే. వచ్చే ఏడాది రూపాంతరం చెందిన కొత్త జిహెచ్ఎంసి ప్రజలకు ఏ స్థాయిలో సేవలందిస్తుందో చూడాలి.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



