కాంగ్రెస్ పార్టీ ఘర్ వాపసీ నినాదం.. పార్టీ వీడి పలు పార్టీల్లో చేరిన వారికి ఆహ్వానం

కాంగ్రెస్ పార్టీ ఘర్ వాపసీ నినాదం.. పార్టీ వీడి పలు పార్టీల్లో చేరిన వారికి ఆహ్వానం
Ghar Wapsi: రాజకీయాల్లో అధికారం, ప్రతిపక్షం సర్వసాధారణం. అయితే రాజకీయ అవసరాలకు అనుగుణంగా నేతలు అధికారపక్షంలోకి మారుతూ ఉంటారు.
Ghar Wapsi: రాజకీయాల్లో అధికారం, ప్రతిపక్షం సర్వసాధారణం. అయితే రాజకీయ అవసరాలకు అనుగుణంగా నేతలు అధికారపక్షంలోకి మారుతూ ఉంటారు. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ.. ఎన్నికల ముందు పార్టీ వీడిన నేతలను మళ్లీ సొంత గూటికి ఆహ్వానిస్తుంది. అయితే ఎన్నికల ముందు పార్టీ వీడిన వారిని మళ్లీ తిరిగి పార్టీలోకి ఆహ్వానించడానికి కారణమేంటి..?
గ్రౌండ్ లెవెల్‌లో పార్టీని మరింత బలోపేతం చేయడం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలుపే లక్ష్యం.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో సీటు కైవసం చేసుకోవడం.. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్నకాంగ్రెస్ పార్టీ దీనిపైనే ఫోకస్ చేస్తోంది. ఇందులో భాగంగా ఎన్నికల ముందు.. అంతకంటే ముందే పార్టీని వీడిన నేతలను మళ్లీ తిరిగి సొంత గూటికి వచ్చేయండి అంటూ ఆహ్వానిస్తోంది.
ఇందులో మాజీ మంత్రి, తెలంగాణ మొదటి పీసీసీ అధ్యక్షుడుగా పని చేసిన బీసీ నాయకుడు పొన్నాల లక్ష్మయ్య పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఎన్నికల కంటే ముందు బీసీలకు ప్రాధాన్యత లేదని.. జనగాం టికెట్ కూడా రాదని ముందే గ్రహించి పొన్నాల.. పార్టీ విడిచి కారులో షికారు చేస్తున్నారు. పొన్నాల లైఫ్ మొత్తం కాంగ్రెస్‌లోనే ఉన్నారు. ఎన్నికల కంటే ముందు మాత్రమే బీఆర్ఎస్‌కి వెళ్లారు. దీంతో పొన్నాల లక్ష్మయ్యను తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకు రావాలని ఆ పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. పీజేఆర్, ముఖేష్ గౌడ్ ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో పెద్ద లీడర్లు. కానీ వారి ఇద్దరి నాయకుల కుమారులు ఇద్దరు చెరో పార్టీలో ఉన్నారు. మొదట ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్లే. అయితే ప్రస్తుతం పీజేఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి BRSలో.. ముఖేష్ కుమార్ గౌడ్ కొడుకు విక్రమ్ గౌడ్ మొన్నటి వరకు బీజేపీలో ఉన్నారు. ప్రస్తుతం బీజేపీకి రాజీనామా చేసి ప్రస్తుత రాజకీయాలను గమనించుకుంటూ తన బిజినెస్ మీద బిజీగా ఉన్నారు. ఈ ఇద్దరి తండ్రులు చివరి వరకు కాంగ్రెస్‌లోనే ఉన్నారు. హస్తం పార్టీలో ఉండగానే మరణించారు. దీంతో పార్టీ వీరిని కాంగ్రెస్‌లోకి తీసుకొని.. ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో.. అలాగే రానున్న జీహెచ్ఎంసి ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేయాలని భావిస్తోందట..
ఇక వీరితోపాటు మర్రి శశిధర్ రెడ్డి సైతం పార్టీపై అలకబూని బీజేపీ గూటికి చేరారు. శశిధర్ రెడ్డి గ్రేటర్‌లో మంచి పట్టున్న నాయకుడు.. పైగా పార్టీలో సీనియర్ నాయకుడు కూడా. దీంతో ఆయనను పార్టీలోకి తిరిగి ఆహ్వానించాలని కాంగ్రెస్ పెద్దలు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాగే ఎన్నికల కంటే ముందు పార్టీ వీడిన రాగిడి లక్ష్మారెడ్డి, సిఎంకి సన్నిహితంగా ఉన్న సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డిని తిరిగి పార్టీలోకి ఆహ్వానించాలనే ఆలోచనలో ఉన్నట్లు పార్టీ వర్గలో చర్చ జరుగుతుంది. వీరితోపాటు కాంగ్రెస్ వాదినని చెప్పుకునే మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డిని సైతం సొంత గూటికి రమ్మనే ఆలోచన లో పార్టీ ఉందట. ఇలా కాంగ్రెస్ నుంచి BJP, BRSకి వెళ్లిన వారిని తిరిగి పార్టీలోకి ఆహ్వానించాలని చూస్తోందట తెలంగాణ కాంగ్రెస్ అధిష్టానం.
ఇక వీరితోపాటు మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణ రెడ్డి, జాజుల సురేందర్, కాంగ్రెస్ హయాంలో మంత్రులుగా పని చేసి, ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీలో ఎమ్మెల్యేలుగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, సుదీర్ రెడ్డి, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతి, చలమల కృష్ణారెడ్డి, జానారెడ్డి కోటరీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు, చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్.. ఇలా ఎవరైతే హస్తం పార్టీ వీడి వేరే పార్టీలోకి వెళ్లారో.. వీరిలో ఎవరైనా ఘర్ వాపసీ అవ్వాలనీ అనుకుంటే గాంధీభవన్ తలుపులు తెరిచే ఉన్నాయనే సంకేతాలు పార్టీ ఇప్పటికే ఇచ్చేసింది. ఇదంతా కుడా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, జీహెచ్ఎంసి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీ ఈ ఆపరేషన్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
ఏదిఏమైనా పార్టీ తీసుకున్న ఈ వ్యూహాత్మక నిర్ణయాన్ని కొందరు స్వాగతిస్తుంటే.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నపుడు పార్టీ కాదనుకుని వెళ్లిన వారిని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వాళ్లను ఎందుకు పార్టీలోకి పిలుస్తున్నారని నిలదీస్తున్నారు కొందరు కాంగ్రెస్ వాదులు. మరికొందరు మాత్రం కాంగ్రెస్ మరింత బలోపేతం అవుతుందన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు. కాంగ్రెస్ నేతల ఆహ్వానానికి.. ఘర్ వాపసీ నినాదానికి ఎందరు సానుకూలంగా స్పందిస్తారో చూడాలి మరి.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



