కేసీఆర్ పాలనకు ఏడాది.. మరి రెండో విడతలో సర్కారు ఘనతలేంటి?

కేసీఆర్ పాలనకు ఏడాది.. మరి రెండో విడతలో సర్కారు ఘనతలేంటి?
x
కేసీఆర్
Highlights

కేసీఆర్‌ 2.O@365 డేస్. రెండోసారి అఖండ విజయంతో మరోసారి సింహాసనం అధీష్టించిన కేసీఆర్‌ పాలనకు సరిగ్గా ఏడాది. మరి సంవత్సర పాలన ఎలా సాగింది. 2014 కన్నా,...

కేసీఆర్‌ 2.O@365 డేస్. రెండోసారి అఖండ విజయంతో మరోసారి సింహాసనం అధీష్టించిన కేసీఆర్‌ పాలనకు సరిగ్గా ఏడాది. మరి సంవత్సర పాలన ఎలా సాగింది.

2014 కన్నా, 2018లో కేసీఆర్‌కు ఎక్కువ సీట్లు కట్టబెట్టి ఆశీర్వదించారు తెలంగాణ ప్రజానీకం. కేసీఆర్‌ వన్స్‌మోర్‌ అంటూ గ్రాండ్‌ విక్టరీ అందించారు. మరి ఎన్నో ఆశలతో రెండోసారి పీఠమెక్కిన కేసీఆర్‌ సర్కారు ఏడాది పాలన ఎలా సాగింది ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో పట్టాలెక్కినవెన్ని సవాల్‌ విసిరినవేంటి? వాటిని తనదైన చాణక్యంతో కేసీఆర్‌ ఎలా చక్కదిద్దారు? రానున్న నాలుగేళ్లపై గులాబీదళం దీమా ఏంటి?

డిసెంబర్ 13, 2018. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు, రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజు. 2014 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా కేసీఆర్‌‌కు పట్టంకట్టిన ప్రజలు, 2018 ముందస్తు ఎన్నికల్లో అంతకంటే ఘనంగా ఆశీర్వదించారు. రెండో విడత పాలనకు ఏడాది పూర్తికావడంతో, ఈ సంవత్సరకాలంలో కేసీఆర్‌ ప్రభుత్వం సాధించిన ఘనతలేంటి నెరవేర్చిన హామీలేంటి ఎదుర్కోన్న సవాళ్లేంటి అన్న అంశాలపై చర్చ మొదలైంది.

కేసీఆర్ రెండో విడత అధికారం చేపట్టిన తర్వాత, సాక్షాత్కారమైన సాగునీటి అద్భుతం కాళేశ్వరం. రాష్ట్రంలోని 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని, సీఎం కేసీఆర్‌, గత జూన్‌ 21న ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, మహారాష్ట్ర అప్పటి సీఎం దేవేంద్ర పడ్నవిస్‌తో తెలుగు రాష్ట్రాల అప్పటి గవర్నర్ నరసింహన్‌ తో కలిసి ప్రారంభోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ప్రపంచలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా చరిత్ర సృష్టించిన కాళేశ్వరం ప్రాజెక్టును, వచ్చే ఏడాది ఖరీఫ్‌ నాటికి మొత్తం పూర్తి చేసి, చివరి ఆ‍యకట్టుకు నీరందించేందుకు రాత్రింబవళ్లు పనులు కొనసాగుతున్నాయి.

ఇక సంక్షేమంలో దేశంలోనే మంచి పేరు తెచ్చుకున్న కేసీఆర్, రెండోవిడతలోనూ అంతకుముందే అమలవుతున్న అన్ని పథకాలనూ కొనసాగించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీల్లో ఒకటి అన్ని రకాల ఆసరా పెన్షన్ల రెట్టింపు. ఆసరా పెన్షన్లను రూ.1,000 నుంచి రూ.2,016కు, వికలాంగుల పెన్షన్లను రూ.1,500 నుంచి రూ.3,016కు పెంచారు. అంతేకాదు, వృద్ధాప్య పెన్షన్ల కనీస అర్హత వయసు 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించారు. దాదాపు 40 లక్షల మందికి ఆసరా పెన్షన్లు చెల్లించేందుకు ఏటా రూ.5,300 కోట్లు ఖర్చు చేస్తోంది కేసీఆర్ ప్రభుత్వం.

రైతులకు పెట్టుబడి సాయమైన రైతు బంధు మొత్తాన్ని కూడా పెంచుతామని ఎన్నికల్లో హామినిచ్చిన కేసీఆర్, ఆ వాగ్దానాన్ని సైతం నెరవేరుస్తున్నారు. రైతు బంధు కింద ఎకరానికి రూ.8 వేలు చొప్పున ఏడాదికి అందిస్తున్న ఆర్థిక సాయాన్ని రూ.10 వేలకు పెంచారు కేసీఆర్. రెండో సారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, ఉచిత రైతు బీమా పథకాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ కేసీఆర్ ప్రభుత్వం కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. 2019, ఆగస్టు 14 నుంచి 2020, ఆగస్టు 13 వరకు ఈ పథకం అమలు కానుంది.

రెండో విడతలో కొత్త సచివాలయం, అసెంబ్లీ భవనాల నిర్మాణాలకు నాంది పలికారు సీఎం కేసీఆర్. ఎర్రమంజిల్‌లో నూతన అసెంబ్లీ, పాత సచివాలయాన్ని కూల్చి అదే స్థానంలో కొత్త సచివాలయం నిర్మించాలని నిర్ణయించారు. దానికి అనుగుణంగా వాటి నిర్మాణ పనులకు సీఎం కేసీఆర్ 2019, జూన్ 27న శంకుస్థాపన చేశారు.

కేసీఆర్‌ రెండో విడతలో కన్పించిన మరో మార్పు, మంత్రివర్గంలో మహిళలకు చోటు. ఇద్దరు మహిళలకు కేసీఆర్ స్థానం కల్పించారు. వీరిలో తొలుత సబితా ఇంద్రారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. తద్వారా తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళా మంత్రి అయ్యారు. ఆ తర్వాత సత్యవతి రాథోడ్ రెండో మహిళా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కేసీఆర్ తన రెండో విడతలో 30 రోజుల ప్రణాళిక ప్రయోగం చేశారు. కొత్త పంచాయతీరాజ్‌ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడంతో పాటు గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరిచేందుకు 30 రోజుల కార్యాచరణ ప్రణాళికను విజయవంతంగా అమలు చేశారు.

మొత్తానికి ఒకవైపు అన్నివర్గాలకూ సంక్షేమపథకాలను సమర్థంగా అమలు చేస్తూ, మరోవైపు సాగునీటి పథకాలను శరవేగంగా పూర్తి చేయాలన్న లక్ష్యం, ఇంకోవైపు పాలనా సంస్కరణలపైనా దృష్టిపెట్టారు కేసీఆర్. పాత చట్టాల స్థానంలో కొత్త చట్టాల రూపకల్పనకు అడుగులు వేస్తున్నారు. మున్సిపల్, రెవెన్యూ శాఖల్లో అవినీతిని సమూలంగా నిర్మూలించేందుకు ఇప్పటికే కొత్త మున్సిపల్‌ చట్టానికి శ్రీకారం చుట్టారు. అలాగే ముసాయిదా రెవెన్యూ చట్టాన్ని రెడీ చేశారు.

కేసీఆర్ రెండో విడతలో సంక్షేమం అక్షయపాత్రను తలపిస్తోంది. సాగునీటి రంగం పరుగులు పెడుతోంది. అయితే, ఆర్థికమందగమనం టీఆర్ఎస్‌ ప్రభుత్వానికి ఛాలెంజ్ విసురుతోంది. దీంతో కేంద్రంతో ఢీ అంటే ఢీ అనాల్సి వస్తోంది. కొన్ని సవాళ్లు కూడా గులాబీ సర్కారును గుచ్చుకున్నా, కేసీఆర్‌ తన చాణక్యంతో చక్కదిద్దారు.

దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా సవాల్‌ విసిరిన ఆర్థికమాంద్యం, తెలంగాణపైనా ప్రభావం చూపింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు గత ఫిబ్రవరిలో రూ.1,82,087 కోట్లతో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది ప్రభుత్వం. అయితే, గత సెప్టెంబర్‌లో ప్రవేశపెట్టిన పూర్తి స్థాయిలో బడ్జెట్‌ను రూ.1,46,492.30 కోట్లకు తగ్గించుకుంది. దీనికి కారణం ఫైనాన్షియల్ స్లోడౌన్. మాంద్యంతో రాష్ట్ర రాబడులు తగ్గిపోవడం, కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల వాటాలు రాకపోవడంతో 2019–20కి సంబంధించిన బడ్జెట్‌ అంచనాలను ప్రభుత్వం కుదించాల్సి వచ్చింది. ఇప్పటికే ప్రారంభించిన పనులను పూర్తి చేయాలని, కొత్త పనులు చేపట్టరాదని నిర్ణయం తీసుకుంది కేసీఆర్ సర్కారు. అన్ని ప్రభుత్వ శాఖలు, పనుల్లోనూ దుబారాను తగ్గించడంతో పాటు పొదుపు పాటించాలని ఆదేశాలిచ్చారు కేసీఆర్.

ఇక కేసీఆర్‌ సర్కారును ఈ ఏడాది పాలనలో చికాకు పెట్టిన ఇబ్బంది ఆర్టీసీ సమ్మె. దాదాపు 50 రోజుల పాటు కార్మికుల సమ్మె కొనసాగింది. అయినా, కఠినంగా వ్యవహరించిన కేసీఆర్, కార్మికులే దిగొచ్చే వరకు మెట్టు దిగలేదు. ఆ తర్వాత సమ్మె కష్టమంతా మర్చిపోయేలా వరాలు కురిపించారు. అందర్నీ విధుల్లోకి తీసుకోవడంతో పాటు ప్రగతి రథ చక్రాన్ని కొత్త పుంతలు తొక్కిద్దామంటూ, కార్మికులకు కర్తవ్యబోధ చేసి, ఉత్సాహం నింపారు. మహిళా కండక్టర్ల పనివేళలు తగ్గించి, వారినీ ఖుషీ చేశారు. ప్రైవేటీకరణ పట్టు సడలించుకున్నారు.

ఎన్నికల హామీల్లో పట్టాలెక్కని కొన్ని హామీలను సైతం అమల్లోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది కేసీఆర్ ప్రభుత్వం. వాటిలో రైతులకు రూ.లక్ష వరకు పంట రుణాల మాఫీ, నిరుద్యోగులకు నెలకు రూ.3,016 నిరుద్యోగ భృతి చెల్లింపు, ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ. అలాగే పదవీ విరమణ వయసు 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పొడిగింపు. వీటిని సైతం అమలు చేసేందుకు ఇప్పటికే కసరత్తు సైతం మొదలుపెట్టిందని మంత్రులంటున్నారు.

తొలి ఏడాదిలోనే కేసీఆర్ ఇచ్చిన అన్ని హామీలనూ ఒక్కొక్కటిగా అమలు చేస్తుండటంతో, ప్రజలు అధికార పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఆశించిన ఫలితాలు రాకపోయినప్పటికీ స్థానిక ఎన్నికలు, బైపోల్‌లోనూ విజయం అందించారు. ప్రతిష్టాత్మక హుజూర్‌ నగర్‌ బైపోల్‌లో ఏకంగా పీసీపీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత సీటులోనే విజయం సాధించారు. 31 జిల్లా పరిషత్ చైర్మన్ స్థానాలను గెలిచి తిరుగులేదని నిరూపించుకున్నారు.

మొత్తానికి ఏడాది పాలనలో ఆర్థిక మాంద్యం పెను సవాలు విసురుతున్నా, సంక్షేమానికి మాత్రం ఆటంకం కలగకుండా పకడ్బందీగా ముందుకెళుతున్నారు కేసీఆర్. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడం, అలాగే పాలనా సంస్కరణల్లో భాగంగా కొత్త చట్టాలు తీసుకురావడం వంటి విప్లవాత్మక చర్యలూ తీసుకుంటున్నారు. రానున్న నాలుగేళ్లలో మరింత దూకుడుగా ప్రభుత్వం ముందుకెళుతుందని టీఆర్ఎస్ నేతలంటున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories