Hyderabad: అంతకంతకు పెరుగుతున్న మంటల ఉధృతి.. ఇతర ప్రాంతాల నుంచి ఫైరింజన్లను రప్పిస్తున్న అధికారులు

Fire Accident In Nallagutta
x

Hyderabad: అంతకంతకు పెరుగుతున్న మంటల ఉధృతి.. ఇతర ప్రాంతాల నుంచి ఫైరింజన్లను రప్పిస్తున్న అధికారులు 

Highlights

Hyderabad: ఇంతవరకూ అదుపులోకి రాని మంటలు

Hyderabad: సికింద్రాబాద్‌ నల్లగుట్టలోని ఓ షాపింగ్‌మాల్‌లో ఉదయం 11 గంటల సమయంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. డెక్కన్‌ నైట్‌వేర్‌ స్పోర్ట్స్‌ షో రూమ్‌లో మంటలు ఎగిసిపడ్డాయి. ఆరు అంతస్తుల భవనంలో కింద కార్ల విడి భాగాల గోడౌన్‌, పైన స్పోర్ట్స్‌ షోరూం నిర్వహిస్తున్నారు. గోదాంలో షార్ట్ సర్క్యూట్‌ కావడంతో మంటలు చెలరేగాయి. ఆ మంటలు పైఅంతస్తులో ఉన్న షోరూంకు అంటుకోవడంతో భారీగా పొగలు వ్యాపించాయి. ఉదయం నుంచి అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నా మంటలు మాత్రం అదుపులోకి రావడంలేదు. దట్టమైన పొగల కారణంగా చుట్టుప్రక్కల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 6 ఫైర్‌ ఇంజన్లు మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా పరిస్థితి అదుపులోకి రాలేదు. మరో 4 భవనాలకు కూడా మంటలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురైయ్యారు.

మరోవైపు భారీ క్రేన్ల సాయంతో భవనం కిటికీలు పగలగొట్టి గోడలను కూడా కూల్చేశారు రెస్క్యూ టీమ్. లోపల ఉన్న పొగ మొత్తం బయటికి పంపించేలా చర్యలు చేపట్టారు. ఏ క్షణంలోనైనా భవనం కూలే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. భవనం లోపల ఇంకా ఎంత మంది ఉన్నారనేది క్లారిటీ రాలేదు. మంటలు, తీవ్రమైన పొగ వల్ల సహాయచర్యలకు విఘాతం వాటిల్లింది. తీవ్రమైన పొగ కారణంగా ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు. వీరిని సమీప ఆస్పత్రికి తరలించారు. మంటలు చెలరేగిన సమయంలోనే వాటిని నియంత్రించే చర్యలు చేపట్టకపోవడంతో ప్రమాదం సంభవించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఒక్కసారిగా పొగలు కమ్మేయడంతో స్థానికులంతా పరుగులు తీశారు.

ప్రమాద స్థలాంలో జరుగుతున్న సహాయక చర్యలు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పరిశీలించారు. అగ్నిప్రమాద ఘటనలో ఇప్పటి వరకు ఎవరూ గాయపడలేదని తెలిపారు. భవనంపైన చిక్కుకున్న ఐదుగురిని సిబ్బంది సురక్షితంగా కాపాడారని మంత్రి చెప్పారు. అయితే, దుకాణం లోపల ఇద్దరు చిక్కుకుని ఉన్నట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇళ్ల మధ్య గోదాంలు, పరిశ్రమలు ఉండటం దురదృష్టకరమని మంత్రి విచారం వ్యక్తం చేశారు. అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అనుమతులు లేని పరిశ్రమలు, గోదాంలపై కఠిన చర్యలు తీసుకుంటామని తలసాని స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories