ఆరిన అక్షర దీపం..అసలేం జరిగింది?

ఆరిన అక్షర దీపం..అసలేం జరిగింది?
x
Highlights

అక్షరమే ఆయుధంగా అంచెలంచెలుగా ఎదుగుతున్న ఆ ఇంటి దీపం అనూహ్యంగా ఆరిపోయింది. ఆర్థిక ఒత్తిళ్లు, అంతంత మాత్రపు కుటుంబ నేపథ్యం, చేయూత ఇస్తామన్నవారు ముఖం...

అక్షరమే ఆయుధంగా అంచెలంచెలుగా ఎదుగుతున్న ఆ ఇంటి దీపం అనూహ్యంగా ఆరిపోయింది. ఆర్థిక ఒత్తిళ్లు, అంతంత మాత్రపు కుటుంబ నేపథ్యం, చేయూత ఇస్తామన్నవారు ముఖం చాటేయటం, ఉపకారవేతనం రూపేణా సర్కార్‌ సహకారం అందకపోవటం వెరసి చదువు ముందుకెళ్లే పరిస్థితి లేకపోవటం ఆమెను కలచివేసింది. ప్రతిభ ఉన్నప్పటికీ ఐఏఎస్‌ లక్ష్యసాధన ఇక అందని ద్రాక్షే అనుకుందో ఏమో ఉరి బిగించుకొని ప్రాణాలు తీసుకొంది. రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్‌ మండలకేంద్రంలో ఈ నెల 3న ఈ దయనీయ ఘటన చోటుచేసుకుంది.

ఫరూఖ్‌నగర్‌కు చెందిన మెకానిక్ శ్రీనివాస్‌రెడ్డి, సుమతిల కుమార్తె ఐశ్వర్య. ఈ అమ్మాయి ఢిల్లీలోని ఓ ప్రముఖ కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. కరోనా నేపథ్యంలో ఇటీవల ఇంటికొచ్చిన ఆమెకు ఓ మెసేజ్‌ వచ్చింది. ఢిల్లీ వసతి గృహం నుంచి ఖాళీ చేయాలనేది ఆ సందేశంలోని సారాంశం. అక్కడ ఖాళీచేసి మరోచోట ఉండాలంటే డబ్బు కావాలి. కుటుంబ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అప్పుల కోసం, ఆర్థిక సహాయం కోసం ఆ తల్లిదండ్రులు చేయని ప్రయత్నం లేదు. ఇదే సమయానికి తండ్రికి కామెర్లు రావడంతో అదనపు ఖర్చులు వేధించాయి. కుటుంబంలో పూట గడవని పరిస్థితి తలెత్తింది. విద్యార్థి చదువు సందిగ్ధంలో పడింది.

ఐశ్వర్య చదువులో చిన్ననాటి నుంచే ప్రతిభ చూపుతోంది. పదోతరగతి, ఇంటర్‌లో మంచి మార్కులు పొందింది. ఆమె ప్రతిభను గుర్తించిన ఓ ఉపాధ్యాయుడు ఢిల్లీలోని పేరొందిన కళాశాలలో డిగ్రీ చేయాలని, ఐఏఎస్‌ శిక్షణ అక్కడ తీసుకోవచ్చని సూచించారు. ఆర్థిక ఇబ్బందులతో అది అసాధ్యమని తల్లిదండ్రులు చెప్పడంతో పట్టణానికి చెందిన కొందరు అమ్మాయికి అయ్యే ఖర్చును మొత్తం భరిస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో కుటుంబీకులు ఐశ్వర్యను ఢిల్లీకి పంపించారు. తర్వాత వారు పట్టించుకోకపోవడం, కరోనా కారణంగా తండ్రి సంపాదన దిగజారటంతో ఇంట్లో పరిస్థితులు దారుణంగా మారాయి.

12వ తరగతిలో తెలంగాణలో టాపర్‌గా నిలిచిన ఐశ్వర్యరెడ్డిని ఢిల్లీకి పంపించడం కోసం ఆమె తల్లిదండ్రులు ఇల్లు కూడా తాకట్టు పెట్టారు. అలాగే 12వ తరగతిలో కనబర్చిన ప్రతిభకు ఆమె కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖ ఇచ్చే ఇన్‌స్పైర్‌ స్కాలర్‌షిప్‌కు ఎంపికయ్యింది. అయితే ఈ ఉపకారవేతనం కూడా మార్చి నుంచి విడుదల కాలేదు. దాంతో ఆమె తీవ్ర ఒత్తిడికి లోనయ్యింది. తన చదువు కోసం తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా చూసిన ఐశ్వర్యకు మనసు వికలమైంది. దాతల సహకారం పొందేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తన చదువుకు అవకాశాలన్నీ మూసుకుపోయినట్లు భావించిన విద్యార్థిని తన జీవితాన్నే ముగించుకోవాలన్న నిర్ణయానికి వచ్చింది. ఈ నెల 3న ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది ఐశ్వర్య. ఉన్నతస్థాయికి ఎదిగి తమకు, రాష్ట్రానికి, దేశానికి మంచిపేరు తీసుకొస్తుందని భావించిన తల్లిదండ్రుల కల కలగానే మిగిలిపోయింది. కంటికి రెప్పలా కాపాడుకున్న కుమార్తె కళ్లెదుటే విగతజీవిగా పడి ఉండడాన్ని జీర్ణించుకోలేక పోయిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories