Narendra Modi: ఎట్టకేలకు ప్రధాని నోట పసుపు బోర్డు మాట

Finally The Prime Minister Mouth Is The Word Of The Turmeric Board
x

Narendra Modi: ఎట్టకేలకు ప్రధాని నోట పసుపు బోర్డు మాట

Highlights

Narendra Modi: నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌కు కలిసొస్తుందంటున్న రైతులు

Narendra Modi: ప్రధాని మోడీ నోట తెలంగాణలో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు మాట ఎట్టకేలకు వచ్చింది. మహబూబ్ నగర్ బహిరంగ సభలో పసుపు బోర్డు తెలంగాణకు ఇస్తున్నామని ప్రకటించారు ప్రధాని... ఈ ప్రకటన ఇందూరు నుంచి పాలమూరుకు అనూహ్యంగా మారింది.. దీన్ని నిజామాబాద్ రైతులు నమ్ముతారా..? ప్రధాని మాటను నమ్మితే.

పసుపు రైతులు బీజేపీకి పట్టం కడతారా...? గత ఎన్నికల్లో బాండు పేపర్ రాసిచ్చి.. పసుపు బోర్డు తెస్తానన్న ఎంపీ అర్వింద్.. తర్వాత చాలా మాటలు మార్చాడు.. ఎన్నో అబద్దాలు వల్లె వేశాడు. పసుపు బోర్డు అంబాసిడర్ కారు లాంటిదంటూ పోల్చాడు. తాను తెచ్చిన స్పైసెస్ బోర్డు బెంజ్, టయోటా కారు లాంటిదంటూ వర్ణించాడు.. ఏవేవో రకరకాల పోలికలు చెప్పి... పసుపు రైతులను మభ్యపెడుతూ వచ్చాడు.

కానీ పాలమూరులో జరిగిన సభలో ప్రధాని మోడీ పసుపు బోర్డు ప్రకటన చేశారు. అయితే నిజామాబాద్‌‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోడీతో ఎంపీ అర్వింద్ ప్రకటన చేయిస్తారని పసుపు రైతులు, ప్రజలు భావించారు. కానీ దీన్ని రెండు రోజులు ముందుగానే అనూహ్యంగా పాలమూరులో ప్రకటించారు ప్రధాని.

దీంతో నిజామాబాద్ సభ అభినందన సభగా మారిపోయింది. ఇందూరు జిల్లా ప్రజలే కాకుండా జగిత్యాల, నిర్మల్ జిల్లాల పసుపు రైతులు కూడా పెద్ద ఎత్తున నిజామాబాద్ సభకు హాజరయ్యారు. ఎక్కడా లేని విధంగా వినూత్న రీతిలో నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల జిల్లాల రైతులు, ప్రజలు ప్రధానికి స్వాగతం పలికారు. సభలో ప్రధాని నా కుటుంబసభ్యులారా అంటూ తెలుగులో ప్రసంగించడంతో మరింత సంతోషంలో మునిగిపోయారు. సభ ముగియగానే.. ప్రధాని రోడ్ షోలో పూల వర్షం కురిపించారు.

నిజామాబాద్‌లో జరిగే బహిరంగ సభను రైతుల వేడుకగా చేసుకుందామని బీజేపీ వ్యూహం పన్నింది... ఈ పరిణామం పసుపు రైతుల్లో సంతోషాన్నిచ్చేదే... కానీ ఇంతకాలం తమను బీజేపీ మోసం చేసిందనే అప ప్రద కొనసాగుతుందా..? పసుపు బోర్డు ప్రకటనతో అర్వింద్‌కు పొలిటికల్ మైలేజీ వస్తుందా...? చూడాలి... మోడీ ప్రకటన చేశారు కనుక.. ఇక బీజేపీకి నిజామాబాద్‌లో తిరుగు లేదని రైతుల్లో వాదన ఉంది. ఎలాగయితే నేం మొత్తానికి సాధించామనే సంతోషం పసుపు రైతుల్లో కనిపిస్తోంది. ఇది బీజేపీ ఓన్ చేసుకోవాలని భావిస్తోంది. నిజామాబాద్‌ సభను పూర్తిగా పసుపు రైతు సభగా మార్చింది బీజేపీ... కవిత ఎంపీగా ఉన్న సమయంలో ప్రధానితో పాటు పలువురు సీఎంలను కలిసినా... వారంతా దీనిపై అయిష్టంగానే ఉన్నారు. ఇది టెక్నికల్‌గా సాధ్యం కాదంటూ కొట్టేశారు. కానీ గత ఎంపీ ఎన్నికల్లో అర్వింద్‌ దీన్నే ప్రధాన అస్త్రంగా ఓటర్లపై సంధించారు. ఏకంగా పసుపు బోర్డు తెచ్చి ఇస్తానని బాండు పేపర్ రాసిచ్చాడు.

కానీ అనూహ్యంగా మోడీ హవాతో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా నిజామాబాద్‌ నుంచి కవితపై అర్వింద్‌ గెలిచాడు. దీంతో పపుపు బోర్డు ఏర్పాటుపై ఒత్తిడి పెరుగుతూ వచ్చింది. బీఆర్‌ఎస్ పార్టీ కూడా అర్వింద్‌‌పై ఒత్తిడి పెంచింది. దీంతో స్పైసెస్ బోర్డ్, రీజినల్ ఆఫీసు అంటూ ఏవోవే సాకులు చూపుతూ అర్వింద్‌ తప్పిచుకుంటూ రావడమే కాదు... పసుపు బోర్డు పాత అంబాసిడర్ కారులాంటిదనీ, తాను తెచ్చిన సంస్కరణలు, మార్పులను బెంజ్‌ కారుతో పోల్చాడు. దీంతో ఇక పసుపు బోర్డుకు మంగళం పాడినట్టేనని అంతా భావించారు. కానీ బీఆర్‌ఎస్‌ లీడర్లు, కవిత మాత్రం పసుపు రైతులకు న్యాయం జరగాలంటే, మద్దతు ధర లభించాలంటే పసుపు బోర్డే ఏకైక మార్గమని గట్టిగా చెబుతూ వచ్చారు.

చివరకు మోడీ నోట జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తామనడంతో... పాత అంబాసిడరే బెటర్‌ అని బీజేపీ ఒప్పుకున్నట్టు స్పష్టమయింది. అయితే ఇందూరు వేదికగా ప్రకటిస్తే అది కేవలం అర్వింద్‌కు మాత్రమే క్రెడిబిలిటీ దక్కుతుందనే యోచనతో పాలమూరులో ప్రకటించారనే వాదన ఉంది. నిజామాబాద్‌ పర్యటన, సభలో దీని ఏర్పాటుపై రైతు సంబురాలు చేసుకోవడం మూలంగా మోడీ, బీజేపీ పట్ల రైతుల్లో విశ్వాసం పెరగాలనేది ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం సూచన... అందుకే ఇలా చేశారని తెలుస్తోంది.

ఏదేమైనా పసుపు బోర్డు ఏర్పాటు హామీతో రైతుల్లో ఆశలు చిగురించాయి. ఈ ప్రకటన బీజేపీకి మైలేజీని తీసుకొచ్చే అంశమవుతుందని కామలనాథులు అంటుంటే... నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌కు మైలేజీ తెచ్చే అంశమవుతుందని ఆ జిల్లా రైతుల నుంచి వాదన వినిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories