వెలిమినేడు ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు ప్రయత్నాల పట్ల రైతుల్లో వ్యతిరేకత !

వెలిమినేడు ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు ప్రయత్నాల పట్ల రైతుల్లో వ్యతిరేకత !
x
Highlights

వారంతా తరతరాలుగా పుడమి తల్లినే నమ్ముకున్న చిన్న సన్నకారు రైతులు. వారికి వ్యవసాయమే జీవనాధారం. ఉన్నకొద్దిపాటి భూమిని సాగు చేస్తూ బతుకు బండిని...

వారంతా తరతరాలుగా పుడమి తల్లినే నమ్ముకున్న చిన్న సన్నకారు రైతులు. వారికి వ్యవసాయమే జీవనాధారం. ఉన్నకొద్దిపాటి భూమిని సాగు చేస్తూ బతుకు బండిని లాగుతున్నారు. ఆ రైతులకు తెలంగాణ ప్రభుత్వం షాకిచ్చింది. రైతుల సాగు భూమిలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తామనే పిడుగు లాంటి వార్త మోసుకొచ్చింది. దీంతో ఇన్నాళ్లు పలుగు, పారపట్టిన అక్కడి రైతుల అడుగులు ఇప్పుడు ఉద్యమం వైపు వెళుతున్నాయి.. ప్రభుత్వం, పాలకుల తీరును నిరసిస్తూ పోరాటానికి సిద్ధమయ్యారు.

నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో రైతుల సాగు భూముల్లో ఇండస్ట్రీయల్ పార్క్‌ ఏర్పాటు చేస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఆ ప్రాంత రైతులు ఆందోళన బాట పట్టారు. తమకున్న భూమిలో బంగారం పండుతుందని అదే ఆధారం అని అక్కడి రైతులు చెప్తున్నారు. భూమిని కోల్పోతే తమకు చావే దిక్కని ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు రంగం సిద్దమవుతోంది. దీంతో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బాధిత రైతులు ఆందోళన బాట పట్టారు.

తెలంగాణ రాష్ట్ర రాజధాని కూత వేటు దూరంలో ఉన్న చౌటుప్పల్, చిట్యాల, భువనగిరి, నార్కట్‌పల్లి ప్రాంతాల్లో సుమారు 100 వరకు పరిశ్రమలున్నాయి. వీటిలో కెమికల్ కంపెనీలే అత్యధికంగా ఉంటాయి. దీంతో ఈ ప్రాంతాల్లో ఇప్పుడు తాగే నీరే కాదు పీల్చే గాలి కూడా కలుషితమవుతోంది. ఇప్పటికే భూగర్భ జలాలు కలుషితమై పరిసర ప్రాంత ప్రజల జీవనం ప్రశ్నార్ధకంగా మారింది. కిడ్నీ సమస్యలు, శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నారు ఇక్కడి జనం. తమ భూముల్లో కంపెనీలు పెట్టొద్దని స్థానికులు చెప్తున్నారు. తమది ఏడాదికి రెండు పంటలు పండే భూమి అని రాళ్లు రప్పల భూమి కాదని స్థానిక రైతులు చెప్తున్నారు. సిరులు పండే ఈ భూములను ఇండస్ట్రీయల్ పార్క్‌ పెట్టి నాశనం చేయోద్దని రైతులు కోరుతున్నారు. తాము ఇండస్ట్రీయల్ కి వ్యతిరేకం కాదని తమ భూములను మాత్రం లాక్కోవద్దంటున్నారు.

వెలిమినేడు గ్రామ పరిధిలోని 418,421,440 నుంచి 464 సర్వే నెంబర్ లలో 121 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు ప్రతిపాదన పెట్టింది ప్రభుత్వం. ఇందులో కొంత ప్రభుత్వ భూమి ఉండగా కొంత పట్టా భూమి ఉంది. 50 ఏళ్ల క్రితమే భూమి లేని నిరుపేద రైతులకు అప్పటి ప్రభుత్వం కొద్దిపాటి భూమిచ్చింది. ఆ భూమి రైతుల పేరున పట్టా కూడా చేసింది నాటి ప్రభుత్వం. ప్రస్తుతం వీరిని పట్టాదారు రైతులుగా గుర్తించి రైతు బంధు పథకానికి అర్హులుగా ప్రకటించింది నేటి తెలంగాణ ప్రభుత్వం. ఇప్పుడీ భూమిపై కూడా ప్రభుత్వ కన్ను పడింది.

హైద్రాబాద్‌కు కూత వేటు దూరంలో ఉన్న ప్రాంతాల్లో భూముల ధరలకు ఎప్పుడో రెక్కలొచ్చాయి. హైద్రాబాద్ టూ విజయవాడ హైవేను ఆనుకుని ఉన్న వెలిమినేడు ప్రాంతంలో ఎకరం కోటి పైనే ఉంటుంది. కొంచెం లోపలికి ఉన్న భూములయితే 50 నుంచి 70 లక్షల వరకు ధర పలుకుతుంది. దీంతో 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇచ్చినా భూ నిర్వాసితులకు ప్రస్తుత మార్కెట్ రేటుతో పోలిస్తే ఓ పది శాతం పరిహారం మాత్రమే అందుతుంది.

రైతుల ఆందోళనకు వివిధ సంఘాలు మద్దతు తెలిపాయి. రోజు రోజుకూ ఆందోళన తీవ్రతరమవుతోంది. రైతుల పొట్ట కొట్టే ఇండస్ట్రియల్ పార్క్ ప్రతిపాదనను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని రైతుల పక్షాన ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు జరిగితే వందల సంఖ్యలో రైతులు ఆర్ధికంగా నష్టపోవడమే కాదు ఉపాధిని కూడా కోల్పోయే ప్రమాదముంది. అయితే ఇండస్ట్రీయల్ పార్క్ ను వెలిమినేడు గ్రామస్తులతో పాటు చుట్టూ పక్కల గ్రామాల రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories