New year 2020 : కొత్త సంవత్సరం.. కోటి ఆశలు.. దైవదర్శనం..!

New year 2020 : కొత్త సంవత్సరం.. కోటి ఆశలు.. దైవదర్శనం..!
x
Highlights

కొత్త సంవత్సర వేడుకలకు సర్వం సిద్ధమైపోయింది. ప్రజలంతా కొత్త కు స్వాగతం చెప్పటానికి సిద్ధమైపోయారు. హైదరాబాద్ నగర వాసులు న్యూ ఇయర్ వేడుకలు ఉత్సాహంగా...

కొత్త సంవత్సర వేడుకలకు సర్వం సిద్ధమైపోయింది. ప్రజలంతా కొత్త కు స్వాగతం చెప్పటానికి సిద్ధమైపోయారు. హైదరాబాద్ నగర వాసులు న్యూ ఇయర్ వేడుకలు ఉత్సాహంగా జరుపుకోవడానికి రెడీ అయిపోయారు. ఇక కొత్త సంవత్సర వేడుకలు అంటేనే రకరకాలుగా ఉంటాయి. ఎవరి అభిరుచిని బట్టి వారు వారి స్థాయిలో వేడుకలు నిర్వహించుకుంటారు. ఇక ఇదే సమయంలో కొత్త సంవత్సరం మొదటి రోజు తమ ఇష్ట దైవాల్ని పూజించాలని కోరుకుంటారు. ఉదయాన్నే ఆలయాలవైపు అడుగులు వేస్తారు. హైదరాబాద్లో చాలా దేవాలయాలు భక్తుల కొంగు బంగారంలా భాసిల్లుతున్నాయి. ఈ కొత్త సంవత్సరం సందర్భంగా హైదరాబాద్ లో కొలువైవున్న దేవాలయాల వివరాలు మీకోసం అందిస్తోంది హెచ్ఎంటీవీ లైవ్.

హైదరాబాద్ పరిసర ప్రాంతాలలోని ఆలయాల పూర్తి వివరాలు...

1. చిలుకూరు బాలాజీ ఆలయం:


విద్యార్థులు విదేశాలకు వెళ్లాలనే కోరికను ఇట్టే తీరుస్తాడని చాలా మంది ఆ ఆలయానికి వెళ్లి దైవదర్శనం చేసుకుంటుంటారు. ఇక్కడ మొక్కుకుంటే వీసా తొందరగా వస్తుందని చాలా మంది భక్తుల నమ్మకం. ఇంతటి మహిమాన్విత శక్తులు కలిగిన ఆలయమే చిలుకూరు బాలాజీ ఆలయం.

ఈ ఆలయం తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ కు 23 కి.మీ. దూరంలో చిలుకూరు అనే గ్రామంలో ఉంది. ఈ ఆలయ మరో విషేశం ఏంటంటే దేశంలోనే హుండీలేని ఆలయంగా ఇది ప్రసిద్దికెక్కింది. అంతేకాదు ఇక్కడ ఎవరైనా కోరికలు కోరుకుని ముందుగా 11 ప్రదిక్షణలు చేస్తారు. తరువాత ఆ కోరిక తీరిన తరువాత 108 ప్రదక్షిణలు చేస్తారు. ఇక ఈ ఆలయంలో ధనిక, పేద అధికార తారతమ్యాలు లేకుండా స్వామివారిని అందరూ ఒకే వరుసలో నిలుచుని దర్శించుకుంటారు.

ఆలయానికి ఇలా వెళ్లొచ్చు..

ఈ ఆలయానికి బస్సుల్లో వెళ్లాలనుకున్న వారు ముందుగా మెహెదీపట్నం చేరుకోవాలి. అక్కడి నుంచి ఆలయానికి అనేక బస్సులను ఆర్టీసీ సంస్థ నడిపిస్తుంది.

2. పెద్దమ్మ తల్లి , జూబ్లీహిల్స్:


శ్రీ పెద్దమ్మ దేవాలయం హైదరాబాదు నగరంలోని జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఉంది. హైదరాబాదులో ఉన్న పురాతనమైన ఆలయాలలో ఇది ఒకటి. ఈ ఆలయాన్ని దివంగత మాజీ మంత్రి పి.జనార్థనరెడ్డిచే పునర్నిర్మాణం జరిగింది. ఈ ఆలయ సముదాయంలో ఐదు అంతస్థుల గర్భగుడి, ఏడు అంతస్థుల రాజగోపురం, కళ్యాణమండపం, వసతి గృహాలు ఉన్నాయి.

ఇక ఈ ఆలయానికి వేళ్లాలనుకుంటే సికింద్రబాద్, కోఠి నుంచి, కొండాపూర్, మాదాపూర్ నుంచి నేరుగా బస్సు మార్గం ఉంది. 127,222,10హెచ్, 47 ఈ బస్సులు ఈ మార్గం మీదుగా వెళతాయి.

3. సంఘీ టెంపుల్:


సంఘి దేవాలయం, తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ కి 35కిలోమీటర్ల దూరంలో ని సంఘినగర్ లోని పరమానంద గిరి అనే కొండపైన ఈ ఆలయం ఉంది. హైదరాబాద్ నగరంలోని ప్రముఖ ఆలయాల్లో ఒకటి సంఘీటెంపుల్. పండుగ రోజుల్లో ఇక్కడ భక్తుల రద్దీ అనేది అధికంగా ఉంటుంది. సోమవారం, శుక్రవారం ఈ ఆలయంలో ఉదయం 8 గంటలకి ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి. ఈ దేవాలయ రాజా గోపురాన్ని అనేక కిలోమీటర్ల దూరం నుంచి స్పష్టంగా చూడవచ్చు. ఈ ఆలయంలో శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువై భక్తులకి దర్శనం ఇస్తున్నాడు. వేంకటేశుడు ఇక్కడ దాదాపు పది అడుగుల (9.5) ఎత్తైన రూపంలో కనువిందు చేస్తాడు.

దక్షిణ భారత నిర్మాణ శైలిలో ఈ ఆలయం నిర్మించబడింది. అందమైన కొండల మద్య ఉండడం వల్ల ఈ దేవాలయం చాల ఆకర్షణీయంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ దేవాలయానికి వెళ్ళడానికి కోటి నుంచి, దిల్ సుఖ్ నగర్ నుంచి చాల బస్సు సర్వీసులు ఉన్నాయి.

4. బల్కంపేట ఎల్లమ్మ:


దాదాపు 700 ఏళ్లక్రితం హైదరాబాదు నగరం ఏర్పడకముందు బల్కంపేట చుట్టూ పొలాలతో ఒక చిన్న గ్రామంగా ఉండేది. ఒక రైతు తన పొలంలో బావిని తవ్వుతూ ఉండగా అమ్మవారి ఆకృతితో ఉన్న బండరాయి అడ్డొచ్చింది. భక్తితో ఆ విగ్రహాన్ని ఒడ్డుకు చేర్చాలని ప్రయత్నించినా, కదలకపోవడంతో వూళ్లోకెళ్లి జనాన్ని తీసుకొచ్చాడు. తలో చేయీ వేసినా కదలలేదు. దీంతో శివసత్తులు ఇచ్చిన సలహాతో, మూలవిరాట్టు బావి లోపలనే ఉంచి ఒడ్డున నిలబడే పూజలు చేసేవారు. రేణుకా ఎల్లమ్మ మహిమలు చుట్టుపక్కల ప్రాంతాలకూ విస్తరించడంతో, ఓ చిన్న ఆలయం వెలసింది. రాజా శివరాజ్‌ బహద్దూర్‌ అనే సంస్థానాధీశుడి హయాంలో 'బెహలూఖాన్‌ గూడా' గా పిలువబడిన ఈ ప్రాంతం, తరువాతి కాలంలో బల్కంపేటగా మారిపోయింది. ఎల్లమ్మతల్లి 'బల్కంపేట ఎల్లమ్మ'గా సుప్రసిద్ధురాలైంది. భక్తుల ఆరాధ్య దైవంగా వెలుగొందుచున్నది. 1919లో దేవాలయ నిర్మాణం పూర్తి స్థాయిలో జరిగింది.

ఇదిలా ఉంటే అమ్మవారు బావిలో ఉద్భవించడం వలన అందులో జల ఊట నిరంతరం వస్తూనే ఉంటుంది. ఇదే ఈ ప్రాంతం ప్రత్యేకమైన విశేషం. ఈ జలాన్నే భక్తులు తీర్థంగా స్వీకరిస్తారు. ఈ జలం సమస్త పాపాలనుండి, రోగాల నుండి విముక్తి కలిగిస్తుందని భక్తుల నమ్మకం.

5. కీసరగుట్ట:


ఈ ఆలయం తెలంగాణ రాష్ట్రంలోని, రంగారెడ్డి జిల్లా, కీసరమండలం లో ఉంది. ఈ ఆలయంలో శ్రీ రామలింగేశ్వరస్వామి వెలిసాడు. ఈ ఆలయాన్ని శ్రీరాముడు అరణ్యవాసం చేస్తున్న సమయంలో నిర్మించారని చరిత్ర చెపుతుంది. ఈ ఆలయంలోని మూలవిరాట్టు శ్రీ రామలింగేశ్వరునిగా పిలవబడుతున్నాడు. అంతే కాదు ఈ ఆలయానికి చేరువలోనే అనేక శివలింగాలు ఉన్నాయి. అనేక చోట్ల భక్తులకు పరమశివుడు లింగ రూపంలోనే దర్శనం ఇస్తుంటాడు. కానీ ఈ ఆలయంలో మాత్రం ఒక విశిష్టత ఉంది. ఇక్కడ గుట్టపైన వెలసిన శివుడు లింగ రూపంలో కాకుండా శివమూర్తి రూపంలో దర్శనం ఇస్తాడు. ఆలయ పురాణం ప్రకారం, శ్రీరాముడు శివలింగాన్ని ప్రతిష్టించాలని భావించగా ముహూర్త సమయానికే శివలింగాన్ని ప్రతిష్టించాడని, ఆ సమయంలో హనుమంతుడు లేడని చెబుతుంటారు. ఇక ఆలస్యంగా వచ్చిన హనుమంతుడు తాను లేకుండానే విగ్రహప్రతిష్ట చేసారని అలగడంతో అప్పుడు హనుమంతుడిని శాంతిపచేయడనికి శ్రీరాముడు, ఈ క్షేత్రం కేసరగిరి గా ప్రసిద్ధి చెందుతుందని ఆశీర్వదించి, హనుమంతుడు తెచ్చిన లింగాలలో ఒక లింగాన్ని ప్రతిష్టించాడు.

కీసరగుట్ట చేరుకోవాలంటే సికింద్రాబాద్ స్టేషన్ నుంచి నేరుగా బస్సులు అందుబాటులో ఉన్నాయి. లేదా ఈసీఐల్ వరకూ బస్సులో వెళితే అక్కడ నుంచి కూడా బస్సులు ఉంటాయి. ఆటోలు వంటి ప్రయివేట్ రవాణా సదుపాయాలు కూడా ఈసీఐల్ నుంచి లభిస్తాయి.

6. అష్టలక్ష్మి ఆలయం:


తెలంగాణ రాష్ట్రంలోని, హైదరాబాద్ నగర శివార్లలోని వాసవి కాలనిలో శ్రీ అష్ట లక్ష్మి దేవాలయం ఉంది. గర్భాలయ మండపంలో ప్రధాన ద్వారానికి ఎదురుగా ప్రధాన గర్భాలయం, దాని చుట్టూ మరో ఏడు గర్భాలయాలు ఉన్నాయి. ప్రధాన గర్భాలయంలో శ్రీ ఆదిలక్ష్మి సమేత శ్రీమన్నారాయణుడు చతుర్భుజాలతో శంఖు చక్ర అభయ, వరద ముద్రలో దివ్యాలంకార శోభితులై భక్తులకి దర్శనమిస్తున్నారు. ఇంకా మిగతా ఏడు గర్భాలయాల్లో శ్రీ సంతానలక్ష్మి, శ్రీ గజ లక్ష్మి, శ్రీ ధనలక్ష్మి, శ్రీ ధ్యానలక్ష్మి, శ్రీవిజయలక్ష్మి, శ్రీవీరలక్ష్మి, శ్రీఐశ్వర్యలక్ష్మి అమ్మవార్లు కొలువై పూజలందుకుతున్నారు. గర్భాలయంలో శ్రీమన్నారాయణుడు సాలగ్రామ మాలను ధరించి ఉండటం వలన స్వామిని దర్శించుకుంటే సర్వపాపాలు హరించబడతాయని, వీరిని దర్శించడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్డస్తాయని శాస్ర చెపుతుంది.

ఇక్కడకు చేరుకోవడానికి నగరం నలుమూలల నుంచీ బస్సు సౌకర్యం అందుబాటులో ఉంటుంది. లేదా మెట్రోలో కూడా నేరుగా కొత్తపేట చేరుకొని అక్కడ నుంచి ప్రయివేట్ వాహనాల్లో ఇక్కడకు చేరుకోవచ్చు. బస్టాండ్ నుంచి అయినా, మెట్రో నుంచి అయినా కొంత దూరం నడవాల్సి ఉంటుంది.

7. బిర్లా మందిర్:


హైదరాబాద్ నగరంలో హుస్సేన్ సాగర్ కి దగ్గరలో ఒక చిన్న కొండపైన బిర్లా ఫౌండేషన్ వారు నిర్మించిన ఆలయమే బిర్లా మందిర్. ఈ ఆలయంలోని గర్భగుడిలో ఉండే స్వామివారు తిరుపతి లోని శ్రీనివాసుడిని పోలి ఉంటారు. ఈ ఆలయంలోపల రామాయణ, మహాభారత ఘట్టాలు చెక్కబడి ఉన్నాయి. ఇక్కడ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి మందిరం పూర్తిగా పాలరాతితో నిర్మించబడినది. ఇంకా ఈ ఆలయంలో మార్బుల్ రాయితో చేసిన దేవతావిగ్రహాలు అందరిని ఆకర్షిస్తాయి. చుట్టూ ఉంటే ఉద్యావనం, కొండపై నుంచి చూస్తే మంచి వాతావరణం ఉంటుంది. అంతే కాదు ఈ ఆలయానికి సమీపంలోనే అసెంబ్లీ, రవీంద్రభారతి, హుసేన్ సాగర్, సెక్రటేరియట్, నెక్లెస్ రోడ్డు ఉంటాయి.

దాదాపుగా నగరం నడిబొడ్డున ఈ ఆలయం ఉండడంతో ఇక్కడికి తేలికగా చేరుకోవచ్చు. సికిందిరాబాద్, నాంపల్లి రైల్వేస్టేషన్ల నుంచి.. పారడైజ్ మెట్రో స్టేషన్ నుంచి ఇక్కడకు సిటీ బస్సులు ఉన్నాయి.

8. ఉజ్జయిని మహంకాళి టెంపుల్:


సికింద్రాబాద్ లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం ఉంది. ఈ ఆలయానికి దాదాపుగా 200 సంవత్సరాల చరిత్ర ఉంది. మహాకాళి అవతారమే ఈ అమ్మవారిగా భక్తుల నమ్మకం. పూర్వం నుండి ఈ అమ్మవారు ఇక్కడ గ్రామదేవతగా పూజలను అందుకుంటుంది. ఇంకా ఈ అమ్మవారిని ఎల్లమ్మ, పోచమ్మ, పెద్దమ్మ, మైసమ్మ, మారెమ్మ ఇలా అనేక రకాల పేర్లతో భక్తులు పిలుచుకుంటారు. ఇక భక్తుల రద్దీ ఎప్పుడు ఎక్కువగా ఉండే ఈ ఆలయానికి ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో జరిగే రెండు రోజుల మహంకాళి జాతరకు కొన్ని లక్షల మంది భక్తులు వస్తుంటారు. ఈ అమ్మవారిని కొలిస్తే అందరినీ చల్లగా చూస్తుందనేది భక్తుల నమ్మకం. అంతే కాదు ప్రతీ ఏడాది ఇక్కడ బోనాలు నిర్వహిస్తే రాష్ట్రంలో వర్షాలు బాగాపడి, పంటలు బాగా పండుతాయని అర్చకులు చెపుతుంటారు.

ఈ అమ్మవారి ఆలయం కూడా సికిందరాబాద్ రైల్వేస్టేషన్ దగ్గరలోనే ఉంటుంది. సికింద్రాబాద్ నుంచి నడిచి కూడా ఇక్కడకు తేలికగా చేరుకోవచ్చు.

9. పూరి జగన్నాథ ఆలయం:


హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో పూరి జగన్నాథ ఆలయం ఉంది. ఈ ఆలయంలో బలరాముడు, సుభద్ర, శ్రీకృష్ణుడు కొలువై ఉన్నారు. ఈ ఆలయం దేశంలోనే ప్రసిద్ధి చెందిన ఆలయాలలో ఒకటైన ఒరిస్సా లోని పూరి జగన్నాథ ఆలయ నిర్మాణాన్ని పోలి ఉంటుంది. హైదరాబాద్ నగరంలో ఎక్కువమంది దర్శించే ఆలయాలలో ఈ ఆలయం కూడా ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయం పూరి లో నెలకొని ఉన్న జగన్నాథ దేవాలయం నకు ప్రతిరూపంగా భావిస్తారు. ఈ దేవాలయంలో ప్రముఖ ఆకర్షణ భాగం "శిఖరం". ఇది 70 అడుగుల ఎత్తు ఉంటుంది. ఎరుపు రంగులో ఉన్న ఈ దేవాలయం సేండ్ స్టోన్ తో కట్టబడినది. 60 మంది శిల్పులు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో ఉపఆలయాలుగా లక్ష్మీదేవి, శివుడు, గణేష, హనుమాన్, నవగ్రహాలు కూడా ఉన్నవి.

ఈ ఆలయానికి వేళ్లాలనుకుంటే సికింద్రబాద్, కోఠి నుంచి, కొండాపూర్, మాదాపూర్ నుంచి నేరుగా బస్సు మార్గం ఉంది. 127,222,10హెచ్, 47 ఈ బస్సులు ఈ మార్గం మీదుగా వెళతాయి.

ఈ ఆలయాలు కాకుండా కొద్దిగా సమయాన్ని, కాలాన్నీ వెచ్చించి దైవ దర్శనం చేసుకుందామనుకుంటే నగరానికి 200 కిలోమీటర్ల పరిధిలో ప్రసిద్ధ దేవాలయాలు చాలా వున్నాయి. యాదగిరిగుట్ట నరసింహ స్వామి ఆలయం, పెనుగంచిప్రోలు అమ్మవారి ఆలయం, మెదక్ జిల్లాలో ఏడుపాయల దుర్గమ్మ ఆలయం, వేములవాడ, కొండగట్టు ఆంజనేయుని ఆలయం ఇలా చాల దేవాలయాలు ఉన్నాయి. ఇంకేముంది మీ వీలుని బట్టి కొత్త సంవత్సరంలో మీ ఇష్ట దైవాన్ని దర్శించుకుని సంవత్సరం అంతా సంతోషంగా కాలం గడపడానికి ప్లాన్ చేసుకోండి! హ్యాపీ న్యూ ఇయర్!!


Show Full Article
Print Article
More On
Next Story
More Stories