ఆ లీడర్‌ గోడ దూకేందుకు ముహూర్తం ఫిక్స్‌?

ఆ లీడర్‌ గోడ దూకేందుకు ముహూర్తం ఫిక్స్‌?
x
Highlights

జంప్‌ చెయ్యాలని ఆయనకు కాలు లాగుతోందట. మరో పార్టీ విందు టేస్ట్‌ చెయ్యాలని నోరూరుతోందట. అవతలి పక్షం కూడా, పంచభక్ష పరమాన్నంలాంటి హామీలతో రారమ్మంటోందట....

జంప్‌ చెయ్యాలని ఆయనకు కాలు లాగుతోందట. మరో పార్టీ విందు టేస్ట్‌ చెయ్యాలని నోరూరుతోందట. అవతలి పక్షం కూడా, పంచభక్ష పరమాన్నంలాంటి హామీలతో రారమ్మంటోందట. ఇంత టెమ్ట్‌ చేస్తున్నా, ఆయన మాత్రం ఇంకా తెగ ఆలోచిస్తున్నారట.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్‌ బలమైన నాయకుల్లో ఒకరు, మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. డీసీసీ అధ్యక్షుడిగానూ పనిచేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అత్యల్ప ఓట్ల తేడాతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. పైగా అప్పట్లో రైతుల కోసం రాహులు గాంధీ నిర్వహించిన పాదయాత్ర విజయవంతం చేసిన నాయకుడిగా కాంగ్రెస్‌లో మంచి పేరుంది ఆయనకు. ఇప్పుడు మాత్రం ఆయన మనసు, బద్దశత్రువైన పార్టీ వైపు లాగుతోందట.

ఉమ్మడి ఆదిలాబాద్‌లో అత్యంత కీలక నేతల్లో ఒకరైన మహేశ్వర్ రెడ్డిపై కమలం కన్నేసిందట. కాషాయ కండువా కప్పేందుకు, పార్టీ అగ్రనాయకులు సంప్రదింపులు జరుపుతున్నారట. పార్టీలో చేరితే సముచినతమైన స్థానం కల్పిస్తామని భరోసానిచ్చారట‌. రాబోయే ఎన్నికల్లో కమలం పార్టీ పవర్‌లోకి వస్తే, మంత్రి పదవి సైతం ఇస్తామని ఆఫర్ చేశారట కాషాయ నేతలు. దీంతో కమలం వైపు తెగ టెమ్ట్ అవుతున్నారట కాంగ్రెస్ నేత మహేశ్వర్‌ రెడ్డి.

బీజేపీ తెలంగాణలో రోజురోజుకు పుంజుకుంటోందని కార్యకర్తలు సైతం మహేశ్వర్‌ రెడ్డికి చెబుతున్నారట. దుబ్బాక విజయంతో, మరింత ఒత్తిడి చేస్తున్నారట అనుచరులు. కమలం వైపు మనసులాగడానికి, సొంత పార్టీపైన కోపమూ ఒక కారణమట. గత అసెంబ్లీ ఎన్నికల్లో, కాంగ్రెస్ ప్రచార నిర్వహణ బాధ్యతలను ఆయనే తీసుకున్నారట. అయినా పార్టీలో తనకు గుర్తింపులేదని రగిలిపోతున్నారు మహేశ్వర్ రెడ్డి. పైగా కాంగ్రెస్ పెద్దల్లో ఐక్యత లేదన్నది ఆయన మరో బాధ. కాంగ్రెస్‌లో అసలు భవిష్యత్తే కనపడ్డంలేదని దిగులు పడుతున్నారట మహేశ్వర్ రెడ్డి. ఇలా అనేక కోపతాపాలతో, కమలం గూటికి చేరడమే మేలని డిసైడ్‌ అయ్యారట. అయితే, మహేశ్వర్ రెడ్డి చూపు కాషాయం వైపు మళ్లడానికి వేరే కారణాలు కూడా వున్నాయన్న మాటలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికిప్పుడు మహేశ్వర్‌ రెడ్డి బీజేపీలో గనుక చేరకపోతే, ఆయన స్థానంలో మరో నేత జాయిన్ అయ్యేందుకు ఉవ్విళ్లూరుతున్నారట. అదే ఆయనగారి టెన్షన్. నిర్మల్ మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్ కమలం తీర్థం పుచ్చుకుంటారని చాలారోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అప్పాల గణేష్ చేరితే, ఆయనకే బిజెపి టికెట్ ఇస్తారన్న ప్రచారం ఉంది. గణేష్ చేరితే, మహేశ్వర్‌ రెడ్డికి కాస్త ఇబ్బందేనట. దీంతో ఎక్కువకాలం తాత్సారం చెయ్యకుండా, పెట్టేబేడా సర్దేసుకోవాలని మహేశ్వర్‌ రెడ్డి రెడీ అవుతున్నారట. అటు కాంగ్రెస్ నేతలు ఆ‍యనతో సంప్రదింపులు కూడా స్టార్ట్ చేశారట. చివరికి ఏమవుతుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories