మిషన్ కరీంనగర్‌ కమాండర్ ఇన్‌ చీఫ్‌ ఈటల.. 70 మంది జాబితా కూడా సిద్ధంగా..

Etela Rajender Operation Akarsh in Karimnagar TRS Leaders
x

మిషన్ కరీంనగర్‌ కమాండర్ ఇన్‌ చీఫ్‌ ఈటల.. 70 మంది జాబితా కూడా సిద్ధంగా.. 

Highlights

Etela Rajender: హుజూరాబాద్‌‌ గెలుపుతో మాంచి ఊపు మీదున్న ఈటల రాజేందర్‌కు, కీలక టాస్క్‌ అప్పగించారా?

Etela Rajender: హుజూరాబాద్‌‌ గెలుపుతో మాంచి ఊపు మీదున్న ఈటల రాజేందర్‌కు, కీలక టాస్క్‌ అప్పగించారా? రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో, బీజేపీ జాతీయ నేతలు, ఈటలతో రహస్యంగా సమావేశమై ఏం చర్చించారు? ఈటల చేపట్టబోయే కొత్త మిషన్‌ గురించే మంతనాలు జరిపారా? ఇంతకీ సీక్రెట్‌ మీటింగ్‌ వెనక కథేంటి? అందులో డిస్కస్ చేసిన సీక్రెట్ అంశాలేంటి?

తెలంగాణలో కాషాయదళం కొత్తకొత్త సమీకరణలు ఆలోచన చేస్తోంది. మైండ్‌ గేమ్‌ మొదలెట్టింది. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగామని, హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. వరుస ఉద్యమాలతోనే ఇది సాధ్యమైందన్నారు. పవర్‌లోకి రావాలంటే పోరాటాలు మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారట. ఇదే సంధర్భంలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ చుగ్‌ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, ఈటల రాజేందర్‌కు సైతం కీలకమైన బాధ్యతలు అప్పగించడం కూడా చర్చనీయాంశమైంది.

అధికార టీఆర్ఎస్‌ పార్టీకి చెందిన 24 మంది అగ్రనేతలు, తమతో టచ్‌లో వున్నారంటూ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ చుగ్ వ్యాఖ్యానించడం ఆసక్తి కలిగిస్తోంది. తమ వద్ద 119 మంది అభ్యర్థులున్నారని, వారిలో గెలిచే 70 మంది జాబితా కూడా సిద్ధంగా ఉందన్నారు తరుణ్ చుగ్. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని మీడియా ప్రతినిధులతో జరిపిన చిట్‌చాట్‌లో తరుణ్ చుగ్ అన్నారు. టచ్‌లో ఉన్న రెండు డజన్ల మందిలో ఎమ్మెల్యేలు కూడా ఉన్నారా అని అడిగితే, ఎమ్మెల్యే అంటే నాయకుడే కదా అని వ్యాఖ్యానించారు. బీజేపీతో నిజంగా టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు టచ్‌లో వున్నారా? లేదంటే కేవలం మైండ్‌ గేమేనా? అధికారంలోకి వచ్చేంత సత్తా కాషాయదళానికి వుందా?

తెలంగాణలో ప్రస్తుతం బీజేపీ జోష్‌‌ మీదున్నది మాత్రం వాస్తవం. ఎందుకంటే, వరుసగా ఎన్నికల్లో గెలుస్తోంది. అలజడి రేపుతోంది. ఆందోళనలు చేస్తోంది. టాక్‌ ఆఫ్ ది టౌన్‌ అవుతోంది. కానీ ఒక్కసారి బీజేపీ గెలిచిన ఎమ్మెల్యే స్థానాలను పరిశీలిస్తే మాత్రం ఇది బలుపా...వాపా అన్నది ఒక పట్టాన అంతుబట్టదు. దుబ్బాక బైపోల్‌లో బీజేపీ గెలిచినా, రఘునందన్‌ పర్సనల్‌ పాపులారిటీతోనే అక్కడ కాషాయ జెండా ఎగిరింది. హుజూరాబాద్‌లోనూ ఈటల వ్యక్తిగత చరిష్మానే కమలానికి బాటలేసిందన్నది మెజారిటీ రాజకీయ విశ్లేషకుల అంచనా. అయినా దమ్మురేపామని ప్రధాని మోడీతో పాటు అమిత్ షా వంటి అగ్ర నేతలు సైతం స్టేట్ లీడర్లకు కితాబిచ్చారు. అలా ప్రచారం చేసుకోవడం, విజయాలను ఓన్ చేసుకోవడం ఏ రాజకీయ పార్టీకైనా కామనే. తమ పార్టీ జెండాపై గెలిచినప్పుడు, విజయం పార్టీదే అవుతుంది. అయితే, ఈ బైపోల్‌ విక్టరీల కాన్ఫిడెన్స్‌తో, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని బీజేపీ నేతలు అంటున్నారు.

కానీ 119 నియోజకవర్గాల్లో బీజేపీకి వున్న అభ్యర్థులెంతమంది అన్న ప్రశ్నకు, బీజేపీ టాప్‌ లీడర్ల దగ్గరే ఆన్సర్‌ దొరకదు. ఇతర రాష్ట్రాల తరహాలోనే ఇతర పార్టీల నుంచి స్ట్రాంగ్ లీడర్స్ వస్తే తప్ప, బీజేపీకి గెలుపు గుర్రాలు లేరు. కేవలం వేళ్లమీద లెక్కబెట్టేంత అభ్యర్థులు మాత్రమే కనిపిస్తున్నారు. ఇంకా ఎన్నికలకు దాదాపు రెండేళ్లుంది. ఇఫ్పటి వరకు అత్యధిక నియోజకవర్గాల్లో బీజేపీ క్యాండిడేట్స్ కనిపించడం లేదు. మెజారిటీ సీట్లలో ఇప్పటికీ టీఆర్ఎస్-కాంగ్రెస్‌ మధ్యే పోటీ వుంది. అయినా పవర్‌లోకి వస్తామంటూ బీజేపీ అంటోంది. అనేకమంది టీఆర్‌ఎస్‌‌ ఎమ్మెల్యేలు టచ్‌లో వున్నారంటూ మైండ్‌ గేమ్‌ మొదలెట్టింది. మరి గ్రౌండ్‌ లెవల్లో బలోపేతం కాకుండా, అభ్యర్థులు లేకుండా బీజేపీ ఎలా అధికారంలోకి వస్తుందంటున్నారు పొలిటికల్ పండితులు.

ఇదే సమయంలో హుజూరాబాద్‌ నుంచి గ్రాండ్‌ విక్టరీ సాధించిన ఈటల రాజేందర్‌కు, బీజేపీ అగ్రనాయకత్వం కీలక మిషన్ అప్పగించిందన్న చర్చ జరుగుతోంది. ఆపరేషన్‌ కరీంనగర్‌‌పై ఈటలకు దిశానిర్దేశం చేసిందని తెలుస్తోంది. హుజూరాబాద్‌ చుట్టుపక్కల కనీసం ఐదారు ఎమ్మెల్యే స్థానాలను తప్పకుండా గెలిపించాలని, రాష్ట్రమంతా తిరిగి, కేసీఆర్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చెయ్యాలని చెప్పిందట. తాజాగా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం కాకుండా, తన అనుచరుడు, కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్‌ సింగ్‌ను రంగంలోకి దింపారు ఈటల. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయిస్తున్నారు.

తమకు బలం లేదు కాబట్టి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో దూరంగా వుండాలని బీజేపీ భావించినా, టీఆర్‌ఎస్ విజయం ఏకగ్రీవం కారాదని, ఝలక్ ఇవ్వాలని, అందుకు తనకు అవకాశం ఇవ్వాలని, పార్టీలో తన మాట నెగ్గించుకున్నారు ఈటల రాజేందర్. తన అనుచరుడు రవీందర్‌ సింగ్‌ను బరిలోకి దింపారు. ఎలాగైనా గెలిపిస్తానని శపథం చేశారు. ఎందుకంటే స్థానిక సంస్థల్లో తన అనుచరులే ఎక్కువగా వున్నారని, రవీందర్‌ సింగ్‌ను గెలిపిస్తానని అన్నారట ఈటల. అంతేకాదు, రాబోయే రోజల్లో వేములవాడకు బైపోల్ ఖాయమని అంచనా వేశారట.

మిషన్ కరీంనగర్‌ కమాండర్ ఇన్‌ చీఫ్‌ ఈటల రాజేందర్. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఈటలకు ఎనలేని పట్టుంది. వరుసగా ఏడుసార్లు ఎమ్మెల్యే, దాదాపు ఏడేళ్లు మంత్రి. స్ట్రాంగ్‌ లీడర్‌గా రాష్ట్రవ్యాప్తంగా పేరు. అందుకే కరీంనగర్‌ మిషన్‌ ఈటలకు అప్పగించారన్నది ఒక చర్చ. మరి బండి సంజయ్‌ది కూడా కరీంనగరే. అలాంటప్పుడు బండి మాట కాదని, ఈటల మాట కరీంనగర్‌ జిల్లాలో నెగ్గుతుందా అన్నది డౌట్. అయితే, సంజయ్‌ ఎంపీగా గెలిచినా, జిల్లా మొత్తమ్మీద పట్టులేదన్నది కొందరి వాదన. అయినా, పార్టీ అధ్యక్షుడు కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా సంజయ్ దృష్టిపెడతారని, ఈటల రాజేందర్‌ మాత్రం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో అత్యధిక స్థానాలు గెలిపించే బాధ్యతను తీసుకుంటారని పార్టీలో కొందరు మాట్లాడుకుంటున్నారు.

మొత్తానికి‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో దిశానిర్దేశం చేసుకుంది స్టేట్ బీజేపీ. వచ్చే ఎన్నికల్లో తమదే అధికారం అంటోంది. టీఆర్ఎస్‌లో పలువురు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌లోనూ కొందరు నేతలు టచ్‌లో వున్నారంటూ మైండ్‌ గేమ్ ఆడుతోంది. అటు ఈటల రాజేందర్‌కు మరిన్ని బాధ్యతలు అప్పగిస్తున్నారు అగ్ర నాయకులు. బీజేపీ మాటలు మరీ కోటలు దాటుతున్నాయా? నిజంగా సింహాసనం అధీష్టించేంత దమ్ముందా? టీఆర్ఎస్, కాంగ్రెస్‌ల నుంచి నిజంగా నేతలను లాగుతుందా? చూడాలి, ఏమవుతుందో.

Show Full Article
Print Article
Next Story
More Stories