Top
logo

ఇందూరు కమలంలో కోల్డ్‌వార్‌ ప్రకంపనలేంటి?

ఇందూరు కమలంలో కోల్డ్‌వార్‌ ప్రకంపనలేంటి?
Highlights

ఒకరు మాజీ ఎమ్మెల్యే మరొకరు తాజా ఎంపీ ఈ ఇద్దరి మధ్య పచ్చి గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. పార్టీలో పట్టు కోసం...

ఒకరు మాజీ ఎమ్మెల్యే మరొకరు తాజా ఎంపీ ఈ ఇద్దరి మధ్య పచ్చి గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. పార్టీలో పట్టు కోసం కొత్త నేత ప్రయత్నిస్తుంటే తన క్యాడర్‌ను కాపాడుకునేందుకు పాత నేత, అంతే దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇలా ఆ జిల్లాలో రెండు గ్రూపుల మధ్య కార్యకర్తలు నలిగిపోతున్నారు. మున్సిపల్ ఎన్నికల వేళ ఈ వివాదం మరింత ముదురుతోంది. టికెట్ల కోసం నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందనే టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఆ మాజీ ఎమ్మెల్యేకు తాజా ఎంపీకి పూడ్చుకోలేనంత గ్యాప్ ఎందుకు.. ? మున్సిపల్ ఎన్నికల్లో క్యాడర్‌ను భయపెడుతున్న ఆ వర్గ పోరు ఏంటి...? నేతల మధ్య గ్రూప్ వార్‌తో, పార్టీ పట్టు సడలుతోందా..? కొత్త-పాత నేతల మధ్య పంతాలే పార్టీ కొంప ముంచే పరిస్ధితి ఏర్పడిందా..? ఆధిపత్య పోరులో ఎవరిదారి వారిదై పోయిందా...? ఇంతకీ ఎవరా కోల్డ్‌వార్‌ వారియర్స్..?

తెలంగాణలో కమలం పార్టీకి పట్టున్న నియోజకవర్గాల్లో నిజామాబాద్ అర్బన్ ఒకటి. ఇక్కడ ఆ పార్టీకి బలంగా ఉంది. గతంలో ఈ నియోజకవర్గం నుంచి రెండుసార్లు బీజేపీ అభ్యర్ధి ఎమ్మెల్యేగా విజయం సాధించగా ఇప్పుడు నిజామాబాద్ పార్లమెంట్ లోనూ కమలం వికసించింది.

పార్టీ కోర్ కమిటీ సభ్యునిగా ఉన్న యెండల లక్ష్మీనారాయణ పీసీసీ అధ్యక్షుని హోదాలో ఉన్న డి.శ్రీనివాస్‌పై విజయం సాధించారు. అనంతరం మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోను ఆ పార్టీ ఓడిపోయినా గౌరవప్రదమైన ఓట్లతో పరువు కాపాడుకుంది. నేతలు గ్రూపులు, వర్గాలు పక్కన పెట్టి సమన్వయంతో పనిచేస్తే విజయం ఖాయమనే ధీమాలో ఉన్నారు ఆ పార్టీ పెద్దలు. అధిష్టానం ఒకటి తలిస్తే ఇక్కడ మరోలా జరగడం క్యాడర్‌లో గుబులు రేపుతోంది. పార్టీ బలపడుతుందనే ప్రచారం ఉన్నా నేతల మధ్య గ్రూపులు, కార్యకర్తలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

మున్సిపల్ ఎన్నికల్లో తాము నమ్ముకున్న నేతతో ఉంటే టికెట్లు వస్తాయో లేదో అనే టెన్షన్ పాత నేత క్యాడర్‌లో కనిపిస్తుంటే, పాత నేతను కాదని అభ్యర్ధుల ఎంపికలో కొత్త నేతకు ఏ మేరకు ప్రాధాన్యం ఇస్తారనే చర్చ మరోవైపు నడుస్తోంది. ఈ ఇద్దరి విషయం పక్కన పెడితే మూడో నేత సైతం తన వర్గం పరిస్ధితి ఏంటని ప్రశ్నిస్తుండటం మరింత కాక రేపుతోంది.

బీజేపీ సీనియర్ నేత, కోర్ కమిటీ సభ్యుడు ఎండల లక్ష్మినారాయణ పార్టీలో సీనియర్ నాయకుడు. అర్బన్‌లో ఆయన క్యాడర్ బలంగా ఉంది. ప్రస్తుతం పార్టీలో ఎండల వర్గం ఒకటి ఉండగా రెండేళ్ల క్రితం పార్టీలో చేరి ఎంపీగా ఎన్నికైన ధర్మపురి అర్వింద్, సీనియర్లను పక్కన పెట్టి సొంత కుంపటి పెట్టుకున్నారనే ప్రచారం సాగుతోంది. జిల్లాపై పట్టు సాధించి తన వర్గం ఏర్పాటు చేసుకునే దిశలో అర్వింద్ పావులు కదుపుతూన్నారనే టాక్ నడుస్తోంది.

తన పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో తన మాటే శాసనం కావాలని అర్వింద్ ఉవ్విలూరుతున్నారని, పార్టీలోనే కొందరు నేతలు చర్చించుకుంటున్నారు. ఐతే అర్వింద్ దూకుడుకు ఎండల లక్ష్మినారాయణ వర్గం, బ్రేకులు వేసేందుకు సమయం దొరికినప్పుడల్లా ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

పార్టీ క్యాడర్ సైతం రెండు వర్గాలుగా చీలిపోయింది. అర్వింద్ వర్గం-ఎండల వర్గం ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఎంపీ పెట్టే మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వరు మాజీ ఎమ్మెల్యే సమావేశానికి ఎంపీ హాజరుకారు. ఇలా ఇద్దరు నేతలు ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నట్లు అధిష్ఠానం దృష్టికి వెళ్లింది.

సీనియర్ లీడర్లకు కనీస మర్యాద ఇవ్వరని అర్వింద్‌పై ఎండల వర్గం ఆగ్రహంగా ఉంది. అటు ఎండల వర్గంపై అర్వింద్ వర్గం అంతే గుస్సా ప్రదర్శిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఎండల వర్గం తమకు సపోర్ట్ చేయలేదని నేతలిద్దరూ కాలు దువ్వుకుంటున్నారు. దీంతో ఇందూరు కాషాయ పార్టీలో వర్గ పోరు మరింత ముదురుతోంది. ఎవరి కార్యక్రమం వారు చేసుకోవడంతో క్యాడర్ సైతం రెండు గ్రూపులుగా విడిపోయింది.

మున్సిపల్ ఎన్నికల వేళ, రెండు గ్రూపుల మధ్య క్యాడర్ నలిగిపోతోంది. తాము నమ్ముకున్న నేతకు ఏ మేరకు ప్రాధాన్యం ఉంటుందో తెలియక కలవరపడుతున్నారు కార్యకర్తలు. ఈ అంశంపై రెండు వర్గాల క్యాడర్ వేర్వేరుగా సమావేశాలు సైతం నిర్వహించుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో టికెట్లు ఇప్పించే బాధ్యత తనదంటే తనదంటూ ఇద్దరు నేతలూ తమ క్యాడర్‌కు భరోసా ఇచ్చారు.

అర్బన్‌లో గతంలో ఎమ్మెల్యేగా పోటి చేసి, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ త్యాగం చేసిన మరో నేత ధన్‌పాల్ సూర్యనారాయణ సైతం తన క్యాడర్‌కు కార్పొరేషన్‌లో టికెట్లు ఇప్పించుకునేందుకు గట్టి ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ బలంగా ఉన్నా రోజురోజుకు బలపడుతుందనే ప్రచారం జరుగుతున్నా నేతల మధ్య ఆధిపత్య పోరుతో పార్టీ డీలా పడుతోందని కమలం శ్రేణులు కలవరపడుతున్నారు.

నిజామాబాద్ కమలం పార్టీలో గ్రూపు నేతలను సమన్వయం చేస్తే పార్టీ బలపడటం ఖాయమని, పార్టీలో కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ఈ వివాదం మరింత ముదరకముందే కమలం పెద్దలు మేల్కొంటారా లేదా అన్నది వేచి చూడాలి.


లైవ్ టీవి


Share it
Top