D Srinivas: డీఎస్ థర్డ్‌ ఇన్నింగ్స్‌.. ఎలా ఉండబోతోంది?

D Srinivas Likely to Join Congress After end of Rajya Sabha Tenure
x

D Srinivas: డీఎస్ థర్డ్‌ ఇన్నింగ్స్‌.. ఎలా ఉండబోతోంది?

Highlights

D Srinivas: ఆయన రాజకీయ కురవృద్దుడు. అనుభవంలో తలపండిన నేత. రాజకీయాల్లో కొంతకాలంగా సైలెంట్‌గా ఉన్నా మళ్లీ కేమ్‌ బ్యాక్‌ టు హోమ్‌ టౌన్‌ అనేస్తున్నారట.

D Srinivas: ఆయన రాజకీయ కురవృద్దుడు. అనుభవంలో తలపండిన నేత. రాజకీయాల్లో కొంతకాలంగా సైలెంట్‌గా ఉన్నా మళ్లీ కేమ్‌ బ్యాక్‌ టు హోమ్‌ టౌన్‌ అనేస్తున్నారట. మరి సొంతింట్లో ఆయన ఏం చేయబోతున్నారు? ప్రస్తుతం గులాబీ పార్టీ నుంచి ఢిల్లీలో పెద్దల సభకు ప్రాతినిధ్యం వహిస్తూ స్వగృహ ప్రవేశం చేసిన పెద్దాయన పాత్ర ఏంటి? అన్నదే సస్పెన్స్‌గా మారింది. తెర వెనుక చక్రం తిప్పుతానంటూ ఇటీవల కామెంట్స్ చేసి అనూహ్యంగా షేక్‌ హ్యాండ్‌ ఇవ్వడం దేనికి సంకేతం? ఇంతకీ ఎవరా నాయకుడు?

ధర్మపురి శ్రీనివాస్ అలియాస్ డీఎస్‌. ఈ పేరు తెలుగు రాష్ట్రాలకు సుపరిచితం. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ పొలిటీషియన్‌. నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో ఓ ట్రెండ్ సెట్ చేసిన రాజకీయ దిగ్గజం. నాటి తరం నుంచి నేటి తరం రాజకీయ నాయకులకు కార్యకర్తలకు పరిచయం అక్కర్లేని నేత. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సీఎం పోస్ట్ దరిదాపుల దాక వెళ్లి మిస్ అయిన లీడర్‌. బీసీల్లో బలమైన సామాజికవర్గం నుంచి వచ్చి రాజకీయాల్లో ఎదిగారు. ఆ తరువాత పరిణామాలతో గులాబీ కండువా కప్పుకున్నారు. టీఆర్ఎస్‌లోకి వచ్చాక రాజ్యసభ ఎంపీగా అవకాశం ఇచ్చింది అధిష్టానం. ఆ తర్వాతే సీన్‌ మారింది. కొన్నాళ్ల నుంచి గులాబీ పార్టీకి దూరంగా ఉంటూ మొన్నీ మధ్యే కాంగ్రెస్‌లోకి స్వగృహ ప్రవేశం చేశారు.

అయితే, కారు పార్టీలో ఉన్నన్నాళ్లూ అవకాశం ఉన్నప్పుడల్లా ఆ పార్టీకి తన సత్తా చూపిస్తూ రాజకీయ మౌనం పాటించారు డీఎస్. కొన్నాళ్లయితే రాజకీయాల గురించి ఎక్కడా మాట్లాకుండా సెలెంట్‌గా ఉన్న డి.శ్రీనివాస్ ఇటీవలే బాంబు పేల్చారు. రాబోయే రోజల్లో ఏం జరుగుతుందో మీరే చూస్తారంటూ కామెంట్‌ చేశారు. అన్నట్టుగా హస్తం పార్టీలో చేరిపోయారు. డీఎస్‌ తీసుకున్న ఈ నిర్ణయమే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీస్తోంది. తన పెద్ద కుమారుడు ధర్మపురి సంజయ్ కాంగ్రెస్ గూటికి చేరడం దాదాపుగా ఖరారు కావడం, ఇదే విషయంలో తండ్రి ఆశీర్వాదం తీసుకోవడం ఆయన కాంగ్రెస్ వైపు చూశారని, గాంధీభవన్‌ వైపు అడుగులు వేశారనే ప్రచారం జరుగుతోంది.

ఈ సమయంలోనే డీఎస్‌ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని క‌లిసి తాను తిరిగి కాంగ్రెస్ గూటికి వ‌స్తాన‌ని తన మ‌న‌సులో మాట‌ను చెప్పారన్న ప్రచారం జరుగుతోంది. దాదాపు 40 నిమిషాలు సోనియాతో భేటీ అయిన డీఎస్‌ రాష్ట్ర రాజకీయాలపై చర్చించినట్టు తెలుస్తోంది. కానీ, రాజ‌కీయంగా చివ‌రి అంకంలో డీఎస్ పార్టీ మారడంపై ఎన్నో సందేహాలు ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. టీఆర్ఎస్‌లో అవమానులు పడుతూనే చాలా రోజుల నుంచి అందులోనే ఉన్న డీఎస్‌ కాంగ్రెస్‌లో చేరి హ్యాపీ రిటైర్‌మెంట్‌ తీసుకోవాలని భావిస్తున్నారని ఆయన స‌న్నిహితులు చెప్పుకుంటున్నారు. అధికార పార్టీలో చేరిన తర్వాత డీఎస్‌కు మ‌న‌శ్శాంతి లేకుండా పోయిందన్న బాధతో ఉన్నారని, అందుకే కాంగ్రెస్‌లో చేరి, రాజకీయంగా ప్రశాంతమైన జీవితం గడపాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది.

అయితే, ఇప్పటికే ఆయ‌న చిన్న కుమారుడు నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మపురి అర్వింద్ బీజేపీలో కీల‌క నేత‌గా వ్యవ‌హ‌రిస్తున్నారు. ఆయ‌న‌కు రాష్ట్ర పార్టీతో పాటు ఢిల్లీ అధిష్టానం వ‌ద్ద అర్వింద్‌కి ప‌లుకుప‌బ‌డి ఉంది. గ‌త రెండేళ్ల క్రిత‌మే బీజేపీ ట్రబుల్‌ షూటర్‌ అమిత్‌షాతో కూడా డీఎస్‌ భేటీ అయ్యారు. దాదాపు రెండు గంట‌లు రాష్ట్ర రాజ‌కీయాలపై చ‌ర్చించారు. దీంతో, అప్పట్లో డీఎస్ కమలం తీర్థం పుచ్చుకుంటారన్న ప్రచారం ప్రచారం జరిగింది. అలాంటిది అనూహ్యంగా తన నిర్ణయాన్ని మార్చుకున్న డీఎస్‌ మ‌ళ్లీ సొంత‌ పార్టీలోకి వెళ్తుండటంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అయితే, తండ్రిని కాషాయం పార్టీలోకి తీసుకురావడం అర్వింద్ వల్ల కాలేకపోయిందని, అర్వింద్‌ ఈ మేరకు ఆయన్ను ఒప్పించ‌లేక‌పోయారన్న టాక్‌ వినిపిస్తోంది. అదీగాక, రాజకీయంగా చివరి దశలో ఉన్న డీఎస్‌ వల్ల పెద్దగా లాభం లేదనుకొని, బీజేపీ అధిష్టానం కూడా లైట్‌ తీసుకొని ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది.

నిజానికి, కమలం గూటికి డీఎస్‌‌ను తీసుకురావాలన్న ఆసక్తి అర్వింద్‌కు ఉన్నా హైకమాండ్‌ పెద్దగా స్పందించలేదని డీఎస్‌, అర్వింద్‌ అనుచరులు అనుకుంటున్నారు. అదీగాక, డీఎస్‌ కాషాయం పార్టీలోకి రావడాన్ని రాష్ట్ర బీజేపీ నేతలు కూడా అంగీకరించలేదని సమాచారం. అంతేగాకుండా డీఎస్‌ గనుక కాషాయం పార్టీలోకి వ‌స్తే ఆయ‌న స్థాయికి స‌రిపోయే ప‌ద‌వి దక్కకపోవచ్చన్న అనుమానంతోనే ఆయన గాంధీభవన్‌ వైపు అడుగులు వేయాలన్న నిర్ణయం తీసుకొని ఉంటారని తెలుస్తోంది. ఏ పదవి లేకుండా బీజేపీలో చేరి కొడుకు కోసం ఆ పార్టీలో జాయిన్‌ అయ్యారన్న పేరు కంటే, కాంగ్రెస్‌తో ఉన్న బంధాన్ని మరింత పటిష్టం చేసుకోవడమ బెటరని డీఎస్‌ నిర్ణయించుకున్నారన్న టాక్‌ వినిపిస్తోంది.

హస్తం పార్టీలో చేరితో తనకు వ్యక్తిగతంగా, నాయకత్వం పరంగా దక్కే ప్రాధాన్యంతో పాటు టీఆర్‌ఎస్‌లో ఉన్న అసంతృప్త నేతలకు కూడా గాలం వేసి, అవసరమైతే మధ్యవర్తిత్వం వహించి, వారిని హ‌స్తం గూటికి తీసుకురావ‌చ్చొని డీఎస్‌ అనుకుంటున్నట్టు సమాచారం. అందుకే, బీజేపీలోకి రావాలని అర్వింద్‌ ఎంత కోరినా అటువైపు మళ్లకుండా కాంగ్రెస్‌తో కలిసిపోవాలని నిశ్చయించుకున్నారట. అందుకే, చిన్న కొడుకు సంతృప్తి కంటే, త‌న అంత‌రాత్మ చెప్పిన ప్రకారం న‌డుచుకొని త‌న‌కు ఎన‌లేని గౌర‌వాన్నిచ్చిన కాంగ్రెస్‌నే ఎంచుకున్నారట. ఏమైనా, ఎవరెన్ని ఊహాగానాలు వినిపించినా, రాజకీయంగా చివరి దశలో ఉన్న డీఎస్‌ హ్యాపీ రిటైర్‌మెంట్‌ కోసమే హ‌స్తం గూటికి వెళ్తున్నారని అనుకుంటున్నారు. మ‌రి డీఎస్ థర్డ్‌ ఇన్నింగ్స్‌ ఏ మేరకు సక్సెస్‌ అవుతుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories