Cyber ​​Crime: అంతకంతకూ పెరుగుతున్న సైబర్ నేరాలు

Cyber ​​Crime has Increased in Hyderabad
x

Cyber ​​Crime: అంతకంతకూ పెరుగుతున్న సైబర్ నేరాలు

Highlights

Cyber ​​Crime: ప్లే స్టోర్‎లో లక్షలాదిగా ఫేక్ యాప్స్, మాల్‎వేర్

Cyber ​​Crime: సరూర్‎నగర్‎లో నాగరాజు హత్యకు గురైన విషయం ప్రపంచాన్ని నివ్వెరపరుస్తుండగా నాగరాజును పక్కాగా ఫాలో అవుతూ లొకేషన్ ఆధారంగా ట్రాక్ చేసి హతమార్చడం అనేది ఓ పెద్ద హెచ్చరికగా మారింది. ఇబ్బడిముబ్బడిగా అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ వల్ల లొకేషన్ శత్రువులకు సైతం సులభంగా చేరిపోతోంది. మనకు తెలియకుండానే మన సమాచారం ఉపయోగించి శత్రువు పాచికలు విసురుతున్నాడు. పైసలు మాత్రమే కాదు ప్రాణాలు కూడా హరించివేస్తున్నాడు. మన డేటాను మనం సురక్షితంగా కాపాడుకోకపోతే మొదటికే మోసం వస్తుందంటున్నారు నిపుణులు.

మతాంతర వివాహం చేసుకున్న దళిత యువకుడు నాగరాజు హత్య కేసు దర్యాప్తులో వెల్లడైన విషయాలు పోలీసులను షాక్‎కు గురి చేస్తున్నాయి. చెల్లి అశ్రిన్‌ సుల్తానాను ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగరాజును ఎలాగైనా చంపాలని కక్ష పెంచుకున్న మొబిన్‌ ఇందుకోసం సాంకేతికతను ఉపయోగించాడు. స్నేహితుల సాయంతో నాగరాజు మెయిల్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ తెలుసుకున్నాడు. కుట్రను అమల్లో పెట్టాడు. నాగరాజు మొబైల్‌ ఫోన్‌లో ఫైండ్‌ మై డివైజ్‌ ఆప్షన్‌ను ఆన్‌ చేసి దాని ద్వారా మొబిన్‌ తన ఫోన్‌కు లింకు చేసి నాగరాజు లొకేషన్‌ను ట్రాక్‌ చేస్తూ వచ్చాడు. అలా నాగరాజు కదలికలపై నిఘా పెట్టిన మొబిన్ పక్కా ప్లాన్ ప్రకారం సరూర్‎నగర్‎లో హతమార్చాడు. ప్రాణహాని ఉందని భయపడ్డ నాగరాజు-అశ్రిన్ అజ్ఞాతంలో ఉండిపోయారు. కానీ మొబిన్ టెక్నాలజీ సాయంతో వారి ఆచూకీ తెలుసుకొని పని కానిచ్చేశాడు. మనకు అందుబాటులో ఉన్న సాంకేతికతలోని లోపాలే సైబర్ నేరగాళ్లకు వరంగా మారుతున్నాయి.

స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాకే సైబర్ నేరాల సంఖ్య పెరిగిపోయింది. నకిలీ యాప్స్ పెరిగిపోయి సైబర్ నేరగాళ్ల చేతిలో ప్రజలు మోసపోతున్నారు. వెబ్ బ్రౌజర్‌‌‌‌లో కాకుండా చాలామంది ప్లే స్టోర్‌‌ నుంచే యాప్స్ డౌన్‌‌లోడ్ చేసుకుంటుంటారు. దీన్ని అవకాశంగా తీసుకుంటున్న సైబర్ నేరగాళ్లు ఫేక్ యాప్స్ క్రియేట్ చేసి స్మార్ట్‌‌ఫోన్‌‌ డేటాను హ్యాక్ చేస్తున్నారు. ప్లే స్టోర్లో లక్షల సంఖ్యలో ఫేక్ యాప్స్‌‌, మాల్‌‌వేర్‌‌‌‌ ఉంటున్నట్లు సైబర్‌‌‌‌ క్రైమ్ పోలీసులు, ఎథికల్‌‌ హాకర్స్‌‌ గుర్తించారు. అసలైన యాప్స్‌‌ తరహాలోనే ఫేక్ యాప్స్‌‌, మాల్‌‌వేర్‌‌‌‌ను సైబర్‌‌‌‌ నేరగాళ్లు ప్లే స్టోర్ లో అప్ లోడ్ చేస్తున్నారు. మాల్‌‌వేర్‌‌‌‌ను గుర్తించేందుకు గూగుల్‌‌ సంస్థ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా డమ్మీ యాప్స్‌‌ మాత్రం ఆన్‌‌లైన్‌‌లోకి వస్తూనే ఉన్నాయి. ప్రజలను వినియోగ వస్తువులుగా భావిస్తున్న సైబర్‌ నేరస్థులు సరైన రక్షణ వ్యవస్థ లేని సర్వర్లను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు, బహుళజాతి సంస్థలు, మెట్రో నగరాల్లో ఐటీ సంస్థలకు పొరుగుసేవలు అందిస్తున్న కంపెనీలు, ఐటీ హబ్‌లున్న హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, నోయిడా వంటి నగరాల్లో 100 మందితో నడిచే చిన్నచిన్న కంపెనీల సర్వర్లను హ్యాక్‌ చేయడం ద్వారా మొత్తం సమాచారాన్ని సంగ్రహిస్తున్నారు.

గూగుల్ ప్లే స్టోర్‎లో 20 వేలకు పైగా ఫేక్ యాప్స్ ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు. అందుకే యాప్స్ డౌన్‌‌లోడ్‌‌ చేసుకునేటప్పుడు అలర్ట్‎గా ఉండాలని సూచిస్తున్నారు. ఇన్‌‌స్టాలేషన్‌‌ చేసుకునేటప్పుడు వచ్చే పర్మిషన్‌‌, సబ్మిట్ ఆప్షన్స్‌‌ పై జాగ్రత్తగా ఉండాలని పాప్‌-‌అప్స్‌‌ను పరిశీలించాలని చెప్తున్నారు. పర్మిషన్‌‌లో ఎలాంటి వివరాలు అడుగుతున్నారో గుర్తించాలని లొకేషన్‌‌ ఆప్షన్‌‌కి పర్మిషన్ ఇస్తే స్మార్ట్‌‌ఫోన్‌‌ ద్వారా మన ప్రతి కదలికనూ గుర్తించే అవకాశం ఉందంటున్నారు. కేవైసీ అప్‌‌డేట్‌‌ పేరుతో వచ్చే మెసేజ్‌‌ లింక్స్‎ని ఓ కంట కనిపెట్టాలంటున్నారు. దీంతో బ్యాంక్ అకౌంట్‌‌తో లింక్ అయిన ఫోన్ నంబర్, ఓటీపీ, సీవీవీ నంబర్స్‌‌ సహా మొత్తం డేటాను సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టే ఛాన్స్ ఉంది.

ఇంటర్నెట్ ఆధారిత వెబ్‌సైట్లు యాప్‌లు ఈకామర్స్‌ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇస్తోంది. ఈ సందర్భాల్లో సంస్థల మూలాలను, అవి ఏర్పరచుకున్న రక్షణ వ్యవస్థలను టెలికమ్యూనికేషన్స్, సమాచార ప్రసారశాఖలు నిర్ధారించుకున్నాకే పర్మిషన్స్ ఇవ్వాలి. అయితే అలాంటివి పూర్తి స్థాయిలో జరగడం లేదు. ఇదే దేశ ప్రజల వ్యక్తిగత భద్రతకు, సమాచార భద్రతకు ముప్పుగా పరిణమించిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. టెక్నాలజీ అనేది రెండు వైపులా పదునైన కత్తిలాంటిది. కొంచెం అజాగ్రత్తగా వాడినా ప్రమాదమే. అందుకే మన అప్రమత్తతే మనకు శ్రీరామరక్ష అన్న విషయం మరువరాదు.

Show Full Article
Print Article
Next Story
More Stories