టీఆర్‌ఎస్‌లో క్రాస్ ఓటింగ్ గుబులు.. తిరుపతి వెంకన్న సాక్షిగా ఒట్టేయించుకున్న గులాబీ నేతలు

Cross-voting Fear  TRS  Representatives of Local Bodies
x

టీఆర్‌ఎస్‌లో క్రాస్ ఓటింగ్ గుబులు (ఫైల్-ఫోటో)

Highlights

తెలంగాణ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గరపడటం గులాబీ పార్టీలో గుబులు పుట్టిస్తోంది

TRS: తెలంగాణ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గరపడటం గులాబీ పార్టీలో గుబులు పుట్టిస్తోంది. ఆరు ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకునేందుకు అధికార పార్టీ పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తోన్నా గులాబీ దళంలో మాత్రం అలజడి రేపుతోంది. ఓటర్లను ఇప్పటికే క్యాంపులకు తరలించి వారి కోర్కెలు నెరవేరుస్తున్నా క్రాస్ ఓటింగ్ భయం కలవరపెడుతోంది. దీంతో తిరుపతి వెంకన్న సాక్షిగా ఒట్టేయించుకున్నారట టీఆర్ఎస్ నేతలు.

మొత్తం 12 లోకల్ బాడీ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను ఏకగ్రీవం చేయడానికి టీఆర్ఎస్ తన ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు. ఆరు స్థానాల్లో ఎన్నిక అనివార్యమైంది. దాంతో నల్గొండ, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, మెదక్ స్థానాల్లో ఓటర్లుగా ఉన్న ఎంపీటీసీ, జెడ్పిటిసి, కౌనిలర్లు, కార్పొరేటర్లను క్యాంపులకు తరలించారు. సగానికి పైగా ఓటర్లను బెంగుళూరు, గోవా, మైసూర్‌లలో క్యాంపులలో ఉంచారు. వారిని గోడ దాటకుండా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయినా కొన్ని స్థానాలపై టిఆర్ఎస్‌కు ధీమా లోపిస్తోంది. స్థానిక ప్రజా ప్రతినిధులు ఎక్కడ క్రాస్ ఓటింగ్ చేస్తారోనన్న అనుమానం కారు పార్టీని వెంటాడుతోంది.

ఓటర్లు అంతా క్యాంపులలో ఉన్నా వారు టీఆర్ఎస్ అభ్యర్డులకు ఓట్లు వేస్తారా అన్న భయం వెంటాడుతోందట. కరీంనగర్, ఖమ్మం స్థానాలు టీఆర్ఎస్‌కు చుక్కలు చూపిస్తున్నాయనే చర్చ జరుగుతోంది. అక్కడి ఓటర్లు క్రాస్ ఓటింగ్ చేస్తారనే చర్చ నడుస్తోంది. క్యాంపులలో ఉండి ఓటు మాత్రం ప్రత్యర్థులకు వేసే విధంగా గ్రౌండ్ ప్రిపేర్ అయ్యిందనే చర్చ టీఆర్ఎస్ నేతల గుండెల్లో దడ పుట్టిస్తోంది.

కరీంనగర్ జిల్లాల్లో ఒకటి, ఖమ్మంలో ఒక స్థానం టీఆర్ఎస్‌కు టెన్షన్ పుట్టిస్తున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్‌లో మాజీ మేయర్ రవీందర్ సింగ్ ప్రత్యర్థిగా ఉన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి భాను ప్రసాద్ ఓటమి టార్గెట్‌గా రవీందర్ సింగ్ పావులు కదుపుతున్నారు. ఇక ఆయనకు బీజేపీ కూడా సపోర్ట్ చేస్తోందన్న టాక్ నడుస్తోంది. ఖమ్మంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాయల నాగేశ్వర్‌రావు గట్టి పోటీ ఇస్తున్నట్లు ప్రచారంలో ఉంది. ఇక్కడ టీఆర్ఎస్ నేతల గ్రూప్ రాజకీయాలే అధికార పార్టీకి మైనస్ అవుతున్నట్లు చర్చ జరుగుతోంది.

ఇక క్యాంపులు నిర్వహించి ఓటర్లను ప్రసన్నం చేసుకున్నా క్రాస్ ఓటింగ్ భయం మాత్రం టీఆర్ఎస్ మంత్రులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోందట. దీంతో కరీంనగర్ ఓటర్లను తీర్థ యాత్రలకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. కరీంనగర్, మెదక్ జిల్లాలకు చెందిన TTD బోర్డు మెంబర్లు సహకారంతో తిరుపతి వెంకన్న స్వామి దర్శనం చేయించారట. ఇక ఆ జిల్లాకు చెందిన ఓ మంత్రి సమక్షంలోనే దేవుడి సాక్షిగా టీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటేసెలా ప్రమాణాలు తీసుకున్నట్లు సమాచారం. మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తేడా వస్తే గులాబీ బాస్ ఆగ్రహానికి గురవుతామని భావిస్తోన్న మంత్రులు గెలుపే లక్ష్యంగా శ్రమిస్తున్నారు. ప్రజా ప్రతినిధులు గోడ దూకకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories