నిజామాబాద్ డిచ్ పల్లి ఆసుపత్రిలో కాసుల కక్కుర్తి.. సామాన్యులను జలగల్లా పీల్చేస్తున్న సిబ్బంది!!

నిజామాబాద్ డిచ్ పల్లి ఆసుపత్రిలో కాసుల కక్కుర్తి.. సామాన్యులను జలగల్లా పీల్చేస్తున్న సిబ్బంది!!
x
Highlights

Nizamabad Dichpalli PHC: ఆ ఆసుపత్రి సిబ్బంది వైద్యం కోసం వచ్చే పేదలను డబ్బుల కోసం జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్నారు. ప్రసవానికి ఓ రేటు.. కుటుంబ నియంత్రణకు మరో రేటు ఫిక్స్ చేసి.. అడ్డగోలుగా వసూళ్లకు తెగబడుతున్నారు.

ఆ ఆసుపత్రి సిబ్బంది వైద్యం కోసం వచ్చే పేదలను డబ్బుల కోసం జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్నారు. ప్రసవానికి ఓ రేటు.. కుటుంబ నియంత్రణకు మరో రేటు ఫిక్స్ చేసి.. అడ్డగోలుగా వసూళ్లకు తెగబడుతున్నారు. కరోనా సమయంలో ఎక్కడా ఆపరేషన్లు చేయరంటూ.. ముక్కు పిండి డబ్బులు వసూళ్లు చేస్తున్నారు. అనుమతి లేకుండా ఆపరేషన్లు చేయడంతో పాటు..అడ్డగోలుగా డబ్బులు వసూలు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో కలకలం సృష్టిస్తోంది. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించి..విచారణ అధికారిగా ఆర్డీఓను నియమించారు.

నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి సామాజిక ఆరోగ్య కేంద్రం అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మారిందనే విమర్శలు విన్పిస్తున్నాయి. వైద్యం పేరుతో ఆసుపత్రి సిబ్బంది రోగుల నుంచి అడ్డగోలుగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. కరోనా సమయంలో.. ఆరోగ్య సిబ్బంది అనుమతులు లేకున్నా.. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, ప్రసవాలు చేశారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కు 3 నుంచి 5 వేల రూపాయల వరకు ధర నిర్ణయించి పేదల నుంచి ముక్కు పిండి మరీ డబ్బులు వసూలు చేశారు. ప్రసవాలకు సైతం పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్లు బాధితులు జిల్లా కలెక్టర్ కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

ప్రభుత్వం నుంచి ప్రతినెల లక్షల్లో వేతనాలు అందుకుంటూ.. వైద్య సేవలకు డబ్బులు వసూలు చేయడాన్ని సీరియస్ గా పరిగణించిన జిల్లా కలెక్టర్.. విచారణకు ఆదేశించారు. ఆర్డీఓను విచారణ అధికారిగా నియమించారు. కరోనా సమయంలో కు.ని. శస్త్ర చికిత్సలకు అనుమతి లేకున్నా.. నెలల తరబడి ఆపరేషన్లు చేసినట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. రోజుకు 30 నుంచి 40 ఆపరేషన్లు చేయగా.. ఒక్కొ పేషెంట్ వద్ద సుమారు5 వేల వరకు వసూలు చేసినట్లు విచారణలో తేలింది. సర్కారు ఆసుపత్రికి వస్తే డబ్బులు వసూలు చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు.

డిచ్‌పల్లి ఆరోగ్య కేంద్రంలో సెప్టెంబర్ 9 నుంచి సిబ్బంది ఆపరేషన్లు చేశారు. కరోనా సమయంలో డిచ్ పల్లి ఆసుపత్రిలో ఆపరేషన్లకు అనుమతి ఉందంటూ కొందరు వసూలు రాజాలు విస్తృతంగా ప్రచారం చేశారు. ఆపరేషన్లకు అనుమతి లేకున్నా.. కొందరు సిబ్బంది డబ్బులకు ఆశపడి ఆపరేషన్ల చాటున వసూళ్ల దందాకు తెరలేపారు. వైద్య సిబ్బంది లక్షల్లో వసూలు చేసినట్లు ఆరోపణలు రావడంతో.. అధికారులు విచారణ చేపట్టారు. అయితే డబ్బులు ఇవ్వలేదని చెప్పాలంటూ.. సిబ్బంది కాళ్ల బెరానికి దిగుతున్నారు. ఈ పాటికే విచారణ పూర్తి కాగా.. వసూలు రాజాలపై వేటుకు రంగం సిద్దం చేస్తున్నారు. లోతుగా విచారణ చేస్తే మరిన్ని అక్రమాలు బయట పడే అవకాశం ఉందని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. తనకు తెలియకుండా ఆపరేషన్లు చేసి.. డబ్బులు వసూలు చేశారనే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు ఆసుపత్రి వైద్యుడు తెలిపారు.

ఆస్పత్రిలో అక్రమ వసూళ్ల దందాపై ఉక్కుపాదం మోపాలని బాధితులు కోరుతున్నారు. అక్రమంగా వసూలు చేసిన డబ్బులను తిరిగి ఇప్పించాలని కోరుతున్నారు. విచారణ అనంతరం చర్యలు ఉంటాయా.. ఒత్తిళ్లతో కేసును నీరుగారుస్తారా అన్నది వేచిచూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories