Coroporators Start New Business in Nizamabad: ఇందూరు కార్పొరేటర్ల కొత్త దందా?

Coroporators Start New Business in Nizamabad: ఇందూరు కార్పొరేటర్ల కొత్త దందా?
x
Highlights

Corporators start a new business in Nizamabad: ఆ కార్పొరేషన్ లో కార్పొరేటర్లు కొత్త దందాకు తెరలేపారా..? డివిజన్లలో అభివృద్ది పనులు లేకపోవడంతో గల్లీలో...

Corporators start a new business in Nizamabad: ఆ కార్పొరేషన్ లో కార్పొరేటర్లు కొత్త దందాకు తెరలేపారా..? డివిజన్లలో అభివృద్ది పనులు లేకపోవడంతో గల్లీలో జరిగే కొత్త నిర్మాణాలే తమ ఆదాయ వనరుగా మార్చుకున్నారా..? ఏదైనా ఇంటి ముందు ఇసుక పడితే చాలు ఆ కార్పొరేటర్ల వేగులు వాలిపోవడంలో ఉద్దేశ్యం ఏంటి ..? అన్నను కలవకపోతే ఆ ఇళ్ల నిర్మాణానికి బ్రేకులు పడతాయనే ప్రచారంలో నిజమేంత.....? కొందరు కార్పొరేటర్లు వసూల్ రాజాలుగా మారారనే ఆరోపణల్లో వాస్తవం ఉందా..? అసలు కొత్తగా ఎన్నికైనా కార్పొరేటర్లు చేస్తున్న సైడ్ దందాపై నగరంలో ఆప్ ది రికార్డుగా జరుగుతున్న చర్చేంటి లెట్స్ వాచ్ దిస్ స్టోరీ.

నిజామాబాద్ నగర పాలక సంస్ధలో 60 డివిజన్లు ఉండగా, మెజార్టీ శాతం కార్పొరేటర్లు తొలిసారి ఎన్నికయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా ఎన్నికైనా ఎంఐఎం పొత్తుతో మేయర్ పీఠాన్ని దక్కించుకుంది టీఆర్ఎస్. బీజేపీ నుంచి గెలిచిన నలుగురు కార్పొరేటర్లు సైతం, ఇటీవలే గులాబీ గూటిలో చేరారు. ఇంతవరకు బాగానే ఉన్నా, కొందరు కార్పొరేటర్లు కాసుల కక్కుర్తితో కొత్త దందాకు తెరలేపారట. సీనియర్ల సూచనలు సలహాలతో డివిజన్లలో కార్యాలయాలు ఏర్పాటు చేసి వేగులను సైతం నియమించుకున్నారట. డివిజన్ లో చీమ చిటుక్కుమన్నా సదరు కార్పొరేటర్ల చెవిలో విషయం ఊదేస్తారట.

ఇక ఇంటి నిర్మాణం కోసం ఎవరైనా ఇసుక, కంకర కుప్పలు పోయించుకున్నారంటే చాలు, వేగులు వాలిపోయి అన్నను కలిశారా కలవకపోతే కలవండంటూ ఉచిత సలహా ఇస్తారట. కలిస్తే ఓకే, కలవపోతే మాత్రం టౌన్ ప్లానింగ్ సిబ్బంది హడావుడిగా, అక్కడికి చేరుకుని ఇంటి నిర్మాణ సామాగ్రిని జప్తు చేసినట్లు హంగామా చేస్తారట. నిర్మాణ పనులను నిలిపేస్తారట. అన్నను కలిసి ఎంతోకొంత ముట్టచెబితే మాత్రం, నీ జోళికి రమ్మన్నా రామని అంటారట. ఇలా కొందరు కార్పొరేటర్లు సైడ్ దందాకు తెరలేపారట. కొత్త ఇంటి నిర్మాణం మొదలు పెడితే చాలు కొందరు కార్పొరేటర్లకు పండగ, జనానికి మాత్రం దడ మొదలవుతుందట.

నిజామాబాద్ కార్పొరేషన్‌లో, ఈ సంస్కృతి గత పాలక వర్గం నుంచి వారసత్వంగా వచ్చిందట. అలా వసూళ్లు చేసిన చాలామంది, మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారట. ఈ సంగతి కొత్తగా గెలిచిన కార్పొరేటర్లకు తెలిసినా, కొత్త నిర్మాణాలే తమ ప్రధాన ఆదాయ వనరు అంటూ అక్రమ వసూళ్లకు తెరలేపారట. క్లాస్ ఏరియాకు ఓ రేటు, మాస్ ఏరియాలో మరో రేటు సైతం ఖరారు చేశారట. ఐతే ఈ అక్రమ దందాలో తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు, ఈ పార్టీ ఆ పార్టీ తేడా లేకుండా అందిన కాడికి దండుకుంటున్నారనే టాక్ ఉంది. మహిళలు కార్పొరేటర్లుగా గెలిచిన డివిజన్లలో వారి భర్తలు అన్నీ తామై వ్యవహరిస్తున్నారట. నూడా పరిధి లో ఉండే కొందరు కార్పొరేటర్లు ఓ అడుగు ముందుకేసి, అక్రమ వెంచర్లు, ప్లాట్లలను సక్రమం చేస్తామంటూ వసూళ్లు చేస్తున్నారట. రెగ్యులరైజేషన్ స్కీంను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారట. ఈ వసూళ్ల వ్యవహారం అర్బన్ ఎమ్మెల్యే దృష్టికి వెళ్లిందట. ఇలాంటి వ్యవహారాలను సహించని ఎమ్మెల్యే, సదరు కార్పొరేటర్లను మందలించారనే ప్రచారం నడుస్తోంది.

కార్పొరేటర్లు తానా అంటే టౌన్ ప్లానింగ్ సిబ్బంది తందానా అంటున్నారట. గల్లీలో ఇంటి నిర్మాణం కోసం కలిస్తే టౌన్ ప్లానింగ్ సిబ్బందిని పంపించి వసూళ్లు చేయడం ఒక స్టైల్ అయితే కార్పొరేటర్ కు తెలియకుండా నిర్మాణం చేస్తే, మరో స్టైల్ లో ఒత్తిళ్లు తెచ్చి తమ జేబులు నింపుకుంటున్నారట. ఈ వసూళ్ల కోసం సీనియర్ల వద్ద కొందరు అదే పనిగా ట్రైనింగ్ కుడా తీసుకుంటున్నారట. ఎలా చేస్తే కాసుల గలగల ఉంటుందని సీనియర్లకు మందు పార్టీలు ఇచ్చి మరీ శిక్షణ పొందుతున్నారట. ఐతే టౌన్ ప్లానింగ్ సిబ్బంది కార్పొరేషన్ ఆదాయం పెంచేందుకు పనిచేయాల్సి ఉండగా కార్పొరేటర్ల జేబులు నింపేందుకు ఎక్కువ డ్యూటీ చేస్తున్నారనే ప్రచారం ఉంది.

బిల్డింగ్ నిర్మాణానికి ఒక్క పైసా లంచం ఇవ్వొద్దని మున్సిపల్ శాఖ మంత్రి పదేపదే చెబుతున్నా, కార్పొరేటర్లు మాత్రం పెడ చెవిన పెడుతున్నారు. ఇప్పటికైనా ఈ అక్రమ వసూళ్లకు చెక్ పెట్టాలని నగరవాసులు మున్సిపల్ మంత్రిని ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేసేందుకు రెడీ అవుతున్నారట. చుద్దాం ఈ దందాకి ఎప్పుడు చెక్ పడుతుందో.




Show Full Article
Print Article
Next Story
More Stories