నిజామాబాద్‌లో రీ ఇన్ ఫెక్షన్ భయం.. రెండో సారి సోకుతున్న కరోనా

నిజామాబాద్‌లో రీ ఇన్ ఫెక్షన్ భయం.. రెండో సారి సోకుతున్న కరోనా
x
Highlights

కరోనా రోగులకు కొత్త భయం వెంటాడుతోంది. కరోనా సోకి ఆరోగ్యం కుదటపడ్డ వారు రీ ఇన్‌ఫెక్షన్ల బారిన పడుతున్నారు. ఒకసారి కరోనా వస్తే మళ్లీ రాదనే అపోహ రోగుల...

కరోనా రోగులకు కొత్త భయం వెంటాడుతోంది. కరోనా సోకి ఆరోగ్యం కుదటపడ్డ వారు రీ ఇన్‌ఫెక్షన్ల బారిన పడుతున్నారు. ఒకసారి కరోనా వస్తే మళ్లీ రాదనే అపోహ రోగుల కొంప ముంచుతోంది. తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల రెండోసారి కరోనా సోకి ఇబ్బందులు పడుతున్నారు. ఇలా నెల వ్యవధిలో 150 మందికి పైగా రీ ఇన్ ఫెక్షన్ల బారిన పడటం ఇందూరు వాసుల్లో ఆందోళన కలిగిస్తోంది. పండగల వేళ రెండోసారి కరోనా సోకుతున్న బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

నిజామాబాద్ జిల్లాను కరోనా వణికిస్తోంది. ఇప్పటి వరకు జిల్లాలో 15వేల పాజిటివ్ కేసులు నమోదు కాగా కొద్ది రోజులుగా కోవిడ్ బాధితుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. కొత్తగా కరోనా వైరస్ సోకుతున్న వారితో పాటు కరోనా సోకి నయమైన వారు సైతం మళ్లీ వైరస్ బారిన పడుతున్నారు. రెండో సారి కరోనా సోకుతున్న కేసులు బయటపడుతుండటంతో వైద్య వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. గత నెల వ్యవధిలో రెండో సారి కరోనా సోకిన వారు సుమారుగా 153 వరకు ఉన్నట్లు వైద్యశాఖ రికార్డులు చెబుతున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు 15వేల మంది కరోనా బారిన పడగా 5వేల మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 10వేల మంది హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 163 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు.

కొద్ది రోజులుగా కేసుల సంఖ్య తగ్గుతుండటంతో ప్రజల్లో కరోనా భయం తగ్గిపోయింది. చాలా మంది తగిన జాగ్రత్తలు సైతం తీసుకోవడం లేదు. పండగల సందర్భంగా రద్దీ పెరిగింది. ఒకసారి కరోనా సోకితే మరోసారి రాదనే అపోహతో చాలా మంది కోవిడ్ జాగ్రత్తలు తీసుకోవడం మానేశారు. ఫలితంగా రెండోసారి కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పండగల సీజన్ కావడంతో మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

బతుకమ్మ- దసరా పండగల సందర్బంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొందరు కొత్తగా వైరస్ బారిన పడుతుండగా మరికొందరు రెండోసారి కరోనా బారిన పడుతున్నారు. బోధన్, బాల్కొండ, డిచ్ పల్లిలో ఇలాంటి కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. పలువురు వైద్య సిబ్బంది సైతం రెండో సారి కరోనా బారిన పడుతున్నారు. ఇలా ఇప్పటి వరకు 150 మందికి పైగా రీ ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యారు. కొందరి నిర్లక్ష్యం వల్లే రెండోసారి కరోనా సోకుతుందని వైద్యులు చెబుతున్నారు. మాస్కు, భౌతిక దూరం పాటించకపోవడం, ప్రయాణ సమయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల రెండోసారి కరోనా బారిన పడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. మాస్కులు ధరించకపోతే వైరస్ మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వైద్యులు.

కరోనా తగ్గే వరకు తగిన జాగ్రత్తలు తీసుకుంటే కరోనాను పూర్తిగా జయించవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికైనా ఆ దిశలో ప్రజలు సైతం కోవిడ్ నిబంధనలు పాటిస్తే సంపూర్ణ ఆరోగ్య వంతులుగా కరోనాను జయించే అవకాశం ఉంది. ఆ దిశలో మన జాగ్రత్తలో మనం ఉందాం. కరోనాను జయిద్దాం.



Show Full Article
Print Article
Next Story
More Stories