విటమిన్ టాబ్లెట్ కు విపరీతమైన డిమాండ్ !

విటమిన్ టాబ్లెట్ కు విపరీతమైన డిమాండ్ !
x
Highlights

Huge demand for Vitamin-C tablets : రోజురోజుకు విజృంభిస్తున్నకరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు జనాలు నానా తంటాలు పడుతున్నారు. ఇమ్యూనిటీ...

Huge demand for Vitamin-C tablets : రోజురోజుకు విజృంభిస్తున్నకరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు జనాలు నానా తంటాలు పడుతున్నారు. ఇమ్యూనిటీ పవర్ పెరిగితే కరోనా వైరస్ దరిచేరదని ప్రచారం జరుగుతుండడంతో చాలా మంది విటమిన్‌ టాబ్లెట్లను ఆశ్రయిస్తున్నారు. దాంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత మూడు నెలలుగా వీటి అమ్మకాలు ఊపందుకున్నాయి. ఎవరికి వారు రెండు మూడు నెలలకు సరిపడా విటమిన్‌ మాత్రలను స్టాకు పెట్టుకుంటున్నారు. దాంతో నిన్నటి వరకూ విరివిగా లభించిన విటమిన్ టాబ్లెట్లు దొరకని పరిస్థితి నెలకొంది. కరోనా పుణ్యమా అని విపరీతంగా పెరిగిన విటమిన్ టాబ్లెట్ల వినియోగం పై స్పెషల్ రిపోర్ట్.

విటమిన్‌ సీ, మల్టీ విటమిన్‌ విత్‌ జింక్‌ టాబ్లెట్లు వుంటే ఇవ్వండి విటమిన్‌ డీ3 టాబ్లెట్‌లు కావాలి జిల్లాలోని ఏ మెడికల్‌ స్టోర్స్‌ లో చూసినా వినియోగదారుల నుంచి వస్తున్న ప్రధానమైన డిమాండ్‌ ఇది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో కీలకమైన ఈ టాబ్లెట్లకు డిమాండ్‌ పెరిగింది. వైరస్‌ బారినపడకుండా వుండేందుకు, ఒకవేళ కరోనా ధాటికి గురైనా వేగంగా కోలుకునేందుకు వ్యాధి నిరోధక శక్తి కీలకమని వైద్యులు చెబుతూ వస్తున్నారు. దీంతో అధిక శాతం మంది ముందు జాగ్రత్తగా వైరస్‌ బారినపడకుండా వుండాలనే ఉద్దేశంతో విటమిన్లు అధికంగా లభించే ఆహారాన్ని తీసుకుంటుండగా అందుకు అవకాశం లేని ఎంతోమంది టాబ్లెట్ల ద్వారా ఆ శక్తిని పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో కొద్ది రోజులుగా ఆయా విటమిన్ల టాబ్లెట్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే అనేక మెడికల్‌ స్టోర్స్‌లో నో స్టాక్‌ బోర్డులను సైతం పెట్టగా, ఇంకొన్నిచోట్ల రెండు, మూడు స్టోర్స్‌కు తిరిగితే గానీ ఇవి దొరికే పరిస్థితి లేదు. ఇదే అదనుగా పలువురు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారన్న ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి.

కొవిడ్‌ వైద్యంలో కీలకం వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు దోహదపడే విటమిన్‌ టాబ్లెట్ల వినియోగం. ఒకవేళ కరోనా వైరస్‌ బారిన పడినా త్వరితంగా కోలుకునేందుకు అవకాశముందని వైద్య నిపుణులు చెబుతుండడంతో, అత్యధికులు వీటిని వినియోగిస్తున్నారు. సీజనల్‌ జ్వరాల వ్యాప్తి సమయంలో కూడా వైద్యులు వీటిని ఎక్కువగా ప్రిస్కైబ్‌ చేస్తుంటారు. ఇప్పటికే జిల్లాలో కరోనా వైరస్‌ విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో అత్యధికులు విటమిన్‌ టాబ్లెట్లను కొనుగోలు చేస్తున్నారు. డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా లేకపోవడంతో అనేక చోట్ల నో స్టాక్‌ బోర్డులు దర్శనమిస్తున్నాయి. విటమిన్‌ టాబ్లెట్లతో పాటు టెంపరేచర్‌, పల్స్‌ చెక్‌ చేసుకునేందుకు వినియోగించే థర్మామీటర్‌, పల్స్‌ ఆక్సీ మీటర్లకు డిమాండ్‌ పెరగడంతో వీటి అమ్మకాలు కూడా జోరుగానే సాగుతున్నాయి. రోజూ వందల సంఖ్యలో థర్మామీటర్లు విక్రయమవుతున్నాయని మెడికల్ షాపుల నిర్వాహకులు చెబుతున్నారు

ఇమ్యూనిటీ పెంచుకోవడానికి విటమిన్ టాబ్లెట్ వేసుకోవడం మంచిదే అయినా మోతాదుకు మించి వేసుకుంటే ఎటువంటి ఉపయోగం ఉండదని వైద్యులు చెబుతున్నారు. విటమిన్లతో పాటు బలాన్ని ఇచ్చే ఆహారం వ్యాయామం కూడా ఇమ్యూనిటీ పెంచడానికి దోహదం చేస్తాయని సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారే ప్రతీ విషయాన్ని గుడ్డిగా ఫాలో కాకుండా, నిపుణుల సలహాలు, సూచనలను పాటించడం ద్వారా కరోనా వ్యాప్తి అరికట్టేందుకు అవకాశం ఉంటుందని సలహా ఇస్తున్నారు. వైద్య నిపుణుల సూచనల మేరకు విటమిన్ టాబ్లెట్లు వేసుకోవడం మంచిది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్ని గుడ్డిగా నమ్మి సొంత వైద్యం చేసుకోవద్దని డాక్టర్లు సూచిస్తున్నారు. మందుల మీదే ఆధారపడకుండా ఆహార నియమాలతో పాటు కోవిడ్ నియంత్రణ సూత్రాలు పాటిస్తే అందరికీ యోగదాయకం.Show Full Article
Print Article
Next Story
More Stories