Coronavirus Effect on Auto Drivers: సంక్షోభంలో ఆటోవాలాల పరిస్ధితి

Coronavirus Effect on Auto Drivers: సంక్షోభంలో ఆటోవాలాల పరిస్ధితి
x
Auto Drivers in Telangana
Highlights

Coronavirus Effect on Auto Drivers: కరోనాతో అందరి బతుకులు వీధిన పడ్డాయి. కోలుకోలేని ఆర్ధిక ఇబ్బందులు చుట్టుముట్టాయి.

Coronavirus Effect on Auto Drivers: కరోనాతో అందరి బతుకులు వీధిన పడ్డాయి. కోలుకోలేని ఆర్ధిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. ఇంటి యజమానుల సతాయింపులు ఫైనాన్షియర్ల వేధిపులు భరించలేక చాలా మంది మూటా ముల్లె సద్దుకుని పల్లెబాట పడుతున్నారు. నిన్నటి వరకు గౌరవంగా బతికిన వారు కూడా ఇప్పుడు నానా మాటలు పడాల్సి వస్తోంది. సకాలంలో డబ్బులు చెల్లించకపోతే తలదించుకోవాల్సి వస్తోంది. కూలీనాలీ చేసుకునే వారి పరిస్ధితి మరీ దయనీయంగా ఉంటే ఆటోలనే నమ్ముకుని జీవనం సాగిస్తున్న వారు రోజు గడవక తల్లడిల్లిపోతున్నారు.

కరోనా సృష్టించిన కల్లోలంతో బతుకు చక్రం గాడి తప్పింది. మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ రవాణా రంగం గాడిన పడలేదు. రైళ్ళు లేవు. బస్సులు నడవడం లేదు. విమానాలు అంతంత మాత్రమే. ఎక్కడికి వెళ్లాలన్నా పెద్ద సమస్యగా మారింది. కరోనా భయంతో ఎవరూ ఇల్లు దాటి బయటకి రావడం లేదు. అత్యవసరం అయితేనే ప్రయాణాలు చేస్తున్నారు. చివరికి ఆటోలు కూడా ఎక్కాలంటే భయపడుతున్నారు. దీంతో జంటనగరాలలో ఆటోవాలాల పరిస్ధితి సంక్షోభంలో పడింది. కోలుకోలేని ఆర్ధిక ఇబ్బందుల్లో నలిగి పోతోంది. గిరాకీ లేక గిట్టుబాటు కాక ఎక్కడ ఆటోలు అక్కడనే ఆగిపోతున్నాయి. దీంతో వారికి పూట గడవడం గగనమైంది. కుటుంబాలను సాకడం సమస్యగా మారింది.

ఎంత చదువు చదివినా ఉద్యోగాలు ల్లేవు. వ్యాపారాలు చేద్దామా అంటే ఆర్ధిక స్ధితిగతులు అంతంత మాత్రమే. దీంతో ఎక్కడెక్కడి నుంచో బతుకు తెరువు కోసం భాగ్యనగరం వచ్చి ఆటోలు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు ఎందరో. ప్రస్తుతం హైదరాబాద్లో మొత్తం లక్షకు పైగానే ఆటోలు నడుస్తున్నాయి. వీటిపై ఆధారపడి దాదాపు మూడు లక్షల మంది జీవనం సాగిస్తున్నారు. కరొనా ముందు వరకు వారి పరిస్ధితి బాగానే ఉంది. ఆ తర్వాతే చిక్కు్ల్లో చిక్కుకు పోయారు. గతంలో రోజుకు 15 వందల నుండి రెండు వేలు వరకు సంపాదించేవారు. అన్ని ఖర్చులు పోగా 800 వరకు మిగిలేవి. ఇప్పుడు రోజంతా కష్ట పడ్డా 100 రూపాయలు సంపాదించడం కష్టంగా మారింది. ఈ పరిస్ధితుల్లో కుటుంబ పోషణ కూడా వారికి భారంగా మారింది. ఏం చేయాలో రోజులు ఎలా నెట్టుకురావాలో తెలియడం లేదని ఆటోవాలాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

విద్యా సంస్ధలు ఇంకా ఓపెన్ కాలేదు. ఐటి సంస్ధలు పూర్తి స్ధాయిలో పని చేయడం లేదు. కార్యాలయాలకు వెళ్లే వారు సొంత వాహనాలనే వినియోగిస్తున్నారు. దీంతో ఆటోవాలాల పరిస్ధితి మరీ దయనీయంగా మారింది. రోజంతా ఎదురు చూసినా సరైన బాడుగ లభించడంలేదు. ఆటోలకు సర్కార్ సడలింపులు ఇచ్చినా గిరాకీ మాత్రం రావడం లేదు. దీనికి తోడు డీజిల్ ధరలు ఒక్కసారిగా పెరిగి పోవడం కూడా వారిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఆటో కిరాయిలు కట్టుకోలేక ఫైనాన్షియర్ల వేధింపులు భరించలేక నానా ఇబ్బందులు పడుతున్న ఆటోవాలాలు కొంత మంది ఇప్పటికే సొంతూళ్ళకు వెళ్ళి పోయారు. ఉన్న వాళ్ళు బతుకును భారంగా గడుపుతున్నారు. సవారీ వచ్చినా ఒకరిద్దరి కంటే ప్రయాణించడానికి లేకపోవడంతో ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

రోజులు ఎప్పుడు మెరుగు పడతాయో తెలియదు. పరిస్ధితులు ఎప్పుడు యధాస్ధితికి వస్తాయో తెలియదు. ఇలాంటి సమయంలో ప్రభుత్వాలే తమను ఆదుకోవాలని ఆటో వాలాలు కోరుతున్నారు. కరోనా ఉధృతి మాత్రం రోజు రోజుకూ పెరిగి పోతూనే ఉంది. సమస్యల సుడులు తిరుగుతూనే ఉన్నాయి. కష్టాల ఊబిలో చిక్కుకుని బయటపడలేక సతమతమవుతున్న వారు ఎందరో. దీనికి కాలమే సమాధానం చెప్పాలి.

నిన్నటి వరకు సాఫీగా సాగిన జీవితాలు ఇప్పడు ఎగుడు దిగుడుగా మారాయి. ఒక్కసారిగా మారిన తలరాతలతో జీవితాలు తల్లకిందులయ్యాయి. చేసిన అప్పులు చేసినట్టే ఉన్నాయి. కిస్తీలు కట్టలేక పస్తువులు ఉండలేక వారు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. పిల్లల చదువులు ఆగిపోయాయి. వైద్యం ఖర్చులు పెరిగి పోయాయి. రోజు గడవడం కూడా భారంగా మారింది. భవిష్యత్ పై భయం పెరిగింది. ఆదుకునే వారి కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఆర్ధిక ఇబ్బందుల నుండి బయట పడేందుకు సతమతమవుతున్నారు.

అక్కడ.. ఇక్కడ అని లేదు. ఎక్కడ చూసినా కరోనా కష్టాలే. ధారలవుతున్న కన్నీటి గాధలే. జీవనోపాధి కోసం ఆటోను కనుక్కొని నడుపుకుంటున్న వారు ఇప్పుడు పడని బాధలు లేవు. అప్పులు చేసి కొనుక్కున్న ఆటోలకు కిస్తీలు కట్టలేక సంసారాలను సాక లేక నానా ఇక్కట్లు పడుతున్నారు. కర్నూలు జిల్లాలో 60 వేల ఆటోలను నమ్ముకుని లక్షకు పైగా కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. కేవలం కర్నూలు నగరంలోనే 20 వేల ఆటోలు నడుస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు లాభసాటిగానే ఉన్నా మూడు నెలల క్రితం ఒక్కసారిగా వారి ఫేట్ తిరగబడింది. కరోనా రూపంలో వారికి కష్టాలు మొదలయ్యాయి. కర్నూలు జిల్లాలో కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్న నేపధ్యంలో రవాణా రంగం పూర్తిగా స్ధంభించింది. ఆటోలు కూడా ఆగిపోయాయి. రెండు నెలలు ఇళ్ళకే పరిమితం కావడం వల్ల ఇప్పుడు తిండికి కూడా ఇబ్బందులు పడుతున్నారు.

ఇప్పుడు లాక్ డౌన్ సడలించారు. ఆటోలు బయటకు వచ్చాయి. కానీ గతంలోలా బాడుగులు లేవు. అధికారులు చెప్పినట్లు విధివిధానాలు పాటించినా ఆటోలు ఎక్కేవారు కనిపించడం లేదు. 300 సంపాదించాలంటే ఎంతో శ్రమ పడాల్సి వస్తోంది. అందులో డీజిల్ ఖర్చులకు పోను మిగిలింది కుటుంబ పోషణకు చాలడం లేదంటున్నారు ఆటోవాలాలు. అవిద్య, నిర్లక్ష్యం వల్ల కరోనా రోజురోజుకూ ఉధ్దృతమవుతోంది. దీనివల్ల ఆదోని, డోన్, ఆళ్ళగడ్డ, నందికొట్కూరు, పత్తికొండ తదితర ప్రాంతాల్లో పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో అన్ని వర్గాల వారు ఇళ్ళకే పరిమితం అవుతున్నారు. చేసే పనులు కూడా ఆగిపోయాయి. జీవనం గడవడమే కష్టంగా మారింది.

ప్రమాదకరమైన వ్యాధులు ఏదో ఒక రూపంలో దేశంలో విరుచుకు పడుతూనే ఉన్నాయి. అదే కోవలో ఇప్పుడు కరోనా . ప్రస్తుతానికి కరోనా నివారణకు వ్యాక్సిన్లు ఏవీ లేకపోయినా జాగ్రత్తలు ఒక్కటే మార్గం. ఆ జాగ్రత్తలలో భాగమే సంయమనం. మూడు నెలలు ఆర్ధిక ఇబ్బందుల్లో కూరుకు పోయిన వారికి ఇప్పటికిప్పుడే మేలు జరగకపోవచ్చు. కానీ మేలైన రోజులు వస్తాయన్న నమ్మకమే ముదుకు నడిపిస్తుంది. కొంత ఊరటనిస్తుంది.



Show Full Article
Print Article
Next Story
More Stories