Corona Effect on TSRTC: అయ్యో.. టీఎస్ ఆర్టీసీ.. వరుస కష్టాలతో సతమతం

Corona Effect on TSRTC: అయ్యో.. టీఎస్ ఆర్టీసీ.. వరుస కష్టాలతో సతమతం
x

tsrtc

Highlights

Corona Effect on TSRTC: కరోనాతో అన్ని సంస్థలు కుదేలైన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణా ఆర్టీసీకి మాత్రం డబుల్ ధమాకా మాదిరిగా అప్పటికే సమ్మెతో నష్టాల్లో ఉన్న ప్రజా రవాణా వ్యవస్థ, కరోనాతో మరింత కుదైలయ్యింది.

Corona Effect on TSRTC: కరోనాతో అన్ని సంస్థలు కుదేలైన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణా ఆర్టీసీకి మాత్రం డబుల్ ధమాకా మాదిరిగా అప్పటికే సమ్మెతో నష్టాల్లో ఉన్న ప్రజా రవాణా వ్యవస్థ, కరోనాతో మరింత కుదైలయ్యింది. కనీసం ఉద్యోగుల జీతాలు చెల్లించలేని స్థితికి చేరుకుంది. దీనిని గాటన పట్టాలంటే ఎంత కాలం పడుతుంతో తెలియని పరిస్థితి.

టీఎస్‌ ఆర్టీసీ వరుస కష్టాలతో సతమతమవుతోంది. ఉద్యోగుల సమ్మెతో అప్పటికే కుదేలైన సంస్థ.. కరోనా లాక్‌డౌన్‌తో మరింత కష్టాల ఊబిలోకి జారిపోయింది. కష్టకాలంలో నడుపుతున్న బస్సులు సైతం ఉపశమనం కలిగించలేకపోతున్నాయి. వీటితో వస్తున్న సొమ్ము డీజిల్‌ ఖర్చులు, మెయింటెనెన్స్‌కే సరిపోతోంది. సిబ్బంది జీతాలకు కటకట నెలకొంటోంది. ఏటా రూ.1000 కోట్ల వరకు నష్టాలను మూటగట్టుకుంటూ వస్తోంది. సర్కారు ఇవ్వాల్సిన రీయింబర్స్‌మెంట్‌ నిధులు సకాలంలో అందలేదు. దీంతో బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుంటూ వచ్చింది. 2014-15 నుంచి 2018-19 వరకు వివిధ వర్గాలకు కల్పించిన రాయితీల కింద ఆర్టీసీకి ప్రభుత్వం రూ.2766.84 కోట్లు చెల్లించాల్సి ఉంది. కానీ, సర్కారు మాత్రం ఏటా కొన్ని నిధుల చొప్పున మొత్తం రూ.710 కోట్లు మాత్రమే విడుదల చేసింది. మరో రూ.748.79 కోట్లను ఇతర రూపంలో సర్దింది. ఇంకా రూ.1308.05 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఈ నిధులు కూడా ఇవ్వాలని ఆర్టీసీ పదేపదే కోరినా.. ప్రభుత్వం విడుదల చేయలేదు. దాంతో ప్రభుత్వ గ్యారంటీ మేరకు బ్యాంకుల నుంచి ఆర్టీసీ రూ.880 కోట్ల అప్పు తీసుకుంది. మార్చిలో మరో రూ.600 కోట్ల రుణం తీసుకుంది. దీంతో ఆర్టీసీ తీసుకున్న అప్పు రూ.2421 కోట్లు, సర్కారు గ్యారంటీ అప్పు రూ.1480 కోట్లు కలిపి అప్పుల కుప్ప రూ.3901 కోట్లకు చేరింది. ఈ అప్పుపై ఆర్టీసీ ఏటా రూ.180 కోట్ల వరకు వడ్డీ చెల్లిస్తోంది. ఇవి కాకుండా ఉద్యోగుల సీసీఎ్‌సకు రూ.630 కోట్లు, పీఎ్‌ఫకు మరో రూ.880 కోట్లను చెల్లించాల్సి ఉంది. అంటే సంస్థ ఇప్పటికే రూ.5411 కోట్ల లోటుతో నడుస్తోంది. లాక్‌డౌన్‌తో బస్సులు నడవక రూ.700 కోట్ల వరకు ఆదాయాన్ని కోల్పోయింది.

ప్రస్తుత రాబడి రోజుకు రూ.2.5 కోట్లే..

ఆర్టీసీలోని మొత్తం 10,460 బస్సుల్లో లాక్‌డౌన్‌కు ముందు ఎంత లేదన్నా 10 వేల బస్సులు నడిచేవి. వీటి ద్వారా రోజుకు సగటున రూ.12.50 కోట్ల నుంచి రూ.13 కోట్ల వరకు ఆదాయం వచ్చేది. కానీ, మార్చిలో ప్రారంభమైన లాక్‌డౌన్‌తో బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ఎట్టకేలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో మే 19 నుంచి జిల్లా బస్సులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం 3,300 సర్వీసులే నడుస్తున్నాయి. రోజుకు సగటు రాబడి రూ.2.5 కోట్ల వరకే ఉంటోంది. జూలైలో రోజువారీ సగటు రాబడి రూ.2 కోట్లే నమోదైంది. వాస్తవానికి కరోనా కారణంగా బస్సుల్లో ప్రయాణించడానికి ప్రజలు జంకుతున్నారు. దీంతో ఆక్యుపెన్సీ రేషియో దారుణంగా పడిపోయింది. దీంతో నెలకు రూ.60 కోట్ల నుంచి రూ.75 కోట్ల ఆదాయం మాత్రమే వస్తోంది. ఇది డీజిల్‌కు, మెయింటెనెన్స్‌ ఖర్చులకే సరిపోతోంది. ప్రతి నెలా వేతనాల బిల్లు రూ.170 కోట్ల వరకు ఉంటుంది. మార్చి లో ప్రభుత్వ గ్యా రంటీతో ఆంధ్ర బ్యాంకు నుంచి అప్పుగా తీసుకున్న రూ.600 కోట్ల నుంచే మార్చి నుంచి జూన్‌ వరకు వేతనాలు చెల్లించారు. జూలై వేతనాలకు కటకట ఏర్పడటంతో తక్షణమే తమకు రీ-యింబర్స్‌మెంట్‌ నిధులను విడుదల చేయాలంటూ ఆర్టీసీ అధికారులు ప్రభుత్వానికి విజ్ఞాపన పంపారు. దాంతో ప్రభుత్వం రూ.150 కోట్లను విడుదల చేసింది. ఈ సొమ్ముతో జూలై నెల వేతనాలు చెల్లించారు. ఇప్పుడు ఆగస్టు వేతనాలను ఎలా చెల్లించాలంటూ తర్జనభర్జన పడుతున్నారు.

సిబ్బందికి బీమా భరోసా ఏదీ?

రాష్ట్రంలో ఆర్టీసీ సిబ్బంది పరిస్థితి దయనీయంగా మారింది. కరోనా సోకితే వైద్యం చేయించుకునేందుకు బీమా భరోసాకు నోచుకోని దుస్థితి నెలకొంది. ఈ తరుణంలో వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి అమలు చేస్తున్న ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ ప్యాకేజీని తమ ఉద్యోగులకూ అమలు చేయాలని ఆర్టీసీ యూనియన్లు డిమాండ్‌ చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మాదిరిగా తెలంగాణలో కూడా తమ సిబ్బందికి ఆ పథకాన్ని వర్తింపజేయాలని కోరుతున్నాయి. అయితే, అటు ప్రభుత్వంగాని, ఇటు యాజమాన్యంగాని పట్టించుకోవడం లేదని యూనియన్‌ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనాతో ఇప్పటికే 35 మంది చనిపోగా, ఆ కుటుంబాలకు ఎలాంటి సహాయం అందలేదని తెలంగాణ జాతీయ మజ్దూర్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి కె.హన్మంతు ముదిరాజ్‌, నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ కార్య నిర్వాహక అధ్యక్షుడు నరేందర్‌, డిప్యూటీ సెక్రటరీ అశోక్‌ తెలిపారు. బాధితులను ఆదుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. ప్రైవేటులో చికిత్స అందించాలి .

ఉద్యోగులు, సిబ్బంది కోసం తార్నాకలో ప్రత్యేక ఆస్పత్రి ఉన్నా... అందులో కరోనా సేవలు అందుబాటులో లేవు. దీంతో కరోనా సోకిన ఉద్యోగులు గాంధీ ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తోంది. లేదంటే సొంత ఖర్చులతో ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందాలి. ఆంధ్రప్రదేశ్‌ మాదిరిగా ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స అందించాలని యూనియన్ల నేతలు, సిబ్బంది.. సంస్థ యాజమాన్యాన్ని, ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories