Coronavirus: మహేంద్ర హిల్స్ లో అప్రమత్తం.. స్కూళ్లకు సెలవు ప్రకటించిన యాజమాన్యాలు

Coronavirus: మహేంద్ర హిల్స్ లో అప్రమత్తం.. స్కూళ్లకు సెలవు ప్రకటించిన యాజమాన్యాలు
x
మహేంద్ర హిల్స్ లో అప్రమత్తం.. స్కూళ్లకు సెలవు ప్రకటించిన యాజమాన్యాలు
Highlights

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ భారత్‌లోను కలకలం సృష్టిస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలను ఎక్కువగా టెన్షన్ పెడుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలు ఇళ్ల...

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ భారత్‌లోను కలకలం సృష్టిస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలను ఎక్కువగా టెన్షన్ పెడుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని చెబుతున్నా వారిలో టెన్షన్ మాత్రం పోవడం లేదు. హైదరాబాద్‌లోనూ కరోనా లక్షణాలతో పలువురు ఆస్పత్రుల్లో చేరడంతో ఆందోళన మొదలైంది. అటు ప్రభుత్వాలు కూడా అలర్టయ్యాయి. కరోనాను కట్టడి చేసేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా భయంతో అంతర్జాతీయ ప్రయాణికుల రద్దీ కూడా తీవ్రంగా తగ్గింది.

కరోనా వైరస్‌ బారిన పడిన హైదరాబాదీ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌తో గత కొద్దిరోజులుగా సన్నిహితంగా మెలిగిన వారి సంఖ్య 88కి చేరింది. సోమవారం రాత్రి నాటికి అలాంటివారిని 80 మందిని గుర్తించిన అధికారులు మంగళవారం మరో 8 మందిని గుర్తించారు. వారందరి వివరాలూ సేకరించారు. వారిలో 45 మంది ఇప్పటికే గాంధీ ఆస్పత్రిలో చేరారు. వైద్యులు వారిని ఐసోలేషన్‌ వార్డులో ఉంచి చికిత్స చేయిస్తున్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు అతడు ప్రయాణించిన బస్సు డ్రైవర్‌, క్లీనర్‌, తోటి ప్రయాణికులు సహా మొత్తం 25 మందిని గుర్తించారు. అలాగే ఆ యువకుడి కుటుంబంలో అతడితో సన్నిహితంగా మెలిగినవారు 13 మంది ఉన్నట్లు గుర్తించారు. వారిలో 36 మంది నమూనాలను సేకరించి పరీక్షకు పంపారు.

కరోనా బారిన పడిన యువకుడికి గాంధీ హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారు. కాగా అతడి నివాసం ఉన్న మహేంద్ర హిల్స్‌ ఏరియాలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. సికింద్రాబాద్‌లోని మహేంద్ర హిల్స్‌లో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లతోపాటు ధనికులు ఎక్కువగా నివాసం ఉంటారు. మహేంద్రహిల్స్ మామూలు రోజుల్లోనే చాలా ప్రశాంతంగా ఉంటుంది. పెద్దగా అలికిడి ఉండదు. అలాంటి ప్రాంతంలో కరోనా కేసు వెలుగు చూడటంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికే జంకుతున్నారు. వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. అంతే కాదు ఇళ్లలో పని చేసేవారికి కూడా సెలవులు ఇచ్చారు. సాధారణంగా ఇళ్లలో పని చేసే వారు ఒక ఇంట్లో పని ముగిశాక మరో ఇంటికి వెళ్తుంటారు. దీంతో వారి ద్వారా కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం ఉండటంతో ముందు జాగ్రత్తగా పనిమనుషులకు సెలవులిచ్చారు.

మహేంద్ర హిల్స్ ప్రాంతం కంటోన్మెంట్ పరిధిలోకి వస్తుంది దీంతో కంటోన్మెంట్ సిబ్బంది కూడా ముందస్తు జాగ్రత్తలకు సిద్ధం అవుతున్నారు. ఈ ప్రాంతంలో ఆక్సీలియం, బచ్‌పన్, ఆక్స్‌ఫర్డ్ లాంటి అనేక స్కూళ్లు ఉన్నాయి. దీంతో తమ పిల్లలకు కరోనా సోకే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా మహేంద్రహిల్స్‌లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. కరోనా భయం కారణంగా వైరస్ నివారణ మందును జీహెచ్ఎంసీ స్ప్రే చేయించింది. పరిసరాలను పరిశుభ్రం చేశారు. మరోవైపు కరోనా బాధితుడి కుటుంబ సభ్యులను మహేంద్ర హిల్స్‌లోని వారి ఇంట్లోనే ఉంచి పర్యవేక్షిస్తున్నారు. బాధితుడి కుటుంబ సభ్యులను ఎవర్నీ ఇంట్లో నుంచి బయటకు రానీయడం లేదు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories