Top
logo

హనుమంతుడి బంగీ జంప్‌ ఎక్కడ...కొత్త పార్టీ పెడతారా?

హనుమంతుడి బంగీ జంప్‌ ఎక్కడ...కొత్త పార్టీ పెడతారా?
X
Highlights

కాంగ్రెస్ పార్టీలో తలపండిన నేతలు అలకపూనుతున్నారు. పార్టీ తమను పట్టించుకోవడం లేదంటూ మండిపడుతున్నారు. పార్టీకి,...

కాంగ్రెస్ పార్టీలో తలపండిన నేతలు అలకపూనుతున్నారు. పార్టీ తమను పట్టించుకోవడం లేదంటూ మండిపడుతున్నారు. పార్టీకి, గాంధీ కుటుంభానికి లాయల్‌గా ఉన్న నేతలు సైతం పార్టీలో ఆధిపత్య పోరుతో రగిలిపోతున్నారు. తాము పార్టీ మారటానికి సైతం సిద్దమని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ కోటరీలో ఉన్న నేతలు తమను గాంధీ కుటుంబాన్ని కలవుకుండా చేస్తున్నారంటూ ఆగ్రహంతో ఊగిపోతున్నారు. తాము పార్టీ మారే పరిస్థితులు తెస్తున్నారని మండిపడుతున్నారు. ఇంతకీ అంతగా రగిలిపోతున్న ఆ నాయకుడు ఎవరు?

వి. హనుమంత రావు. ఈ పేరొక్కటి చాలు, తెలంగాణ కాంగ్రెస్‌కు ధూంధాం. ఇష్యూ ఏదైనా, పార్టీ నాయకులు ఎవరు వచ్చినా, రాకపోయినా, ముందుండి ఆందోళన చేసే నాయకుడు వి.హనుమంతరావు. బోళాశంకరుడిగా, ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టి మాట్లాడే వీహెచ్‌కు, పార్టీలకు అతీతంగా అభిమానులున్నారు. కాంగ్రెస్‌ కోసం ప్రాణాలైనా అర్పిస్తానని ఎన్నోసార్లు చెప్పిన హనుమంతన్నకు, అదే పార్టీలో కష్టమొచ్చిందట. గాంధీల కుటుంబాలకు వీరవిధేయుడికి, మరో పార్టీలోకి వెళ్లాలి అన్నంతగా కోపం వస్తోందట. కాంగ్రెస్‌ తన ఊపిరి అని చెప్పుకునే సీనియర్ నేత వి. హనుమంతరావుకు ఆ పార్టీలో కష్టకాలం వచ్చినట్లుంది. తాను సైతం పార్టీ మారే పరిస్థితులు తీసుకువస్తున్నారని ఊగిపోతున్నరట. పార్టీలో పొమ్మనలేక తనకు పొగబెడుతున్నారని ఆవేదన చెందుతున్నారట వీహెచ్.

తన రాజకీయ జీవితంలో గాంధీల కుటుంబానికి ఏ రోజూ దూరంగా లేనని, అలాంటి అనుబంధం ఉన్న కుటుంబానికి తనను దూరంగా ఉంచుతున్నారని మధనపడిపోతున్నారట వీహెచ్. పార్టీలో ఎన్ని జరిగినా నేరుగా గాంధీ కుటుంబంతో మాట్లాడే చనువున్న తనకే సోనియా, రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ ఇవ్వడానికి అనేక అడ్డంకులు సృష్టిస్తున్నారని హనుమంతరావు కాంగ్రెస్ నేతల దగ్గర మనసులో మాట చెప్పుకుంటున్నారట.

ఈనెల ఇరవై తరువాత విహెచ్ సొంతపార్టీలో జరుగుతున్న వ్యవహారాలను బట్టబయలు చేయడానికి సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది. స్వయంగా మీడియా సమావేశంలో పార్టీకి తాను చేసిన తప్పేంటో చెప్పాలని, అడుగుతానని ఆయన బహిరంగంగా చెబుతున్నట్లు తెలుస్తోంది. పార్టీలో జరుగుతున్న వ్యవహారాన్ని నేరుగా హైకమాండ్‌కు చెప్పనివ్వకుండా రాహుల్ గాంధీ సలహాదారు కొప్పుల రాజు తనను అడ్డుకుంటున్నాడని, దాదా మండిపడుతున్నట్లు చర్చ. కొప్పుల రాజే తెలంగాణలో పార్టీ నష్టపోవడానికి పూర్తి బాధ్యత అని కూడా విహెచ్ రగిలిపోతున్నారట. తనను-గాంధీ కుటుంబాన్ని కలవకుండా అడ్డుకోవడంతో పాటు, తనకు ఖమ్మం టిక్కెట్టు రాకుండా అడ్డుకున్న నేతల బండారం బయటపెడతానని ఊగిపోతున్నారట విహెచ్.

గాంధీ కుటుంబాన్ని కలువకుండా చేస్తున్న వారి భరతం పడతాని చెబుతూనే తనను పార్టీ నుంచి వెల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన చెందున్నారు విహెచ్. తాను పార్టీ వీడే పరిస్థితి వస్తే రాజీవ్ కాంగ్రెస్‌ పేరుతో కొత్త పార్టీ పెడతానని తన సన్నిహితులు వద్ద చెప్పిన్నట్లు తెలుస్తోంది. అయితే వీహెచ్‌ బీజేపీలో చేరతారన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నాయకులు వరుసబెట్టి, బీజేపీలో చేరుతుండటంతో ఈ పుకార్లకు మరింత స్కోప్ వస్తోంది. అయితే బీజేపీ బద్ద వ్యతిరేకి అయిన వీహెచ్‌, కాషాయ కండువా కప్పుకునే ఛాన్సేలేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మొత్తానికి సొంత పార్టీపై ఆగ్రహంతో రగిలిపోతున్న వీహెచ్‌, ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ ఉత్కంఠకు తెరదించాల్సింది హనుమంతుడే.

Next Story