Top
logo

Congress: హుజూరాబాద్‌ను గాలికొదిలేశారా?

Congress not Focus on Huzurabad Bypoll
X

Congress: హుజూరాబాద్‌ను గాలికొదిలేశారా?

Highlights

Congress: తెలంగాణ కాంగ్రెస్ హుజూరాబాద్ ఉపఎన్నికను గాలికి వదిలేసిందా?

Congress: తెలంగాణ కాంగ్రెస్ హుజూరాబాద్ ఉపఎన్నికను గాలికి వదిలేసిందా? బైపోల్‌ జరుగుతున్న నియోజకవర్గాన్ని కాదని, మహబూబ్‌నగర్‌లో సభ పెట్టడం సీనియర్లకు నచ్చలేదా? క్యాంపెయిన్ లిస్టు ప్రకటించినా నేతలెవరూ హుజూరాబాద్ వైపు చూడకపోవడంతో ఉత్తర తెలంగాణ నేతలు ఆగ్రహంతో ఉన్నారా? హుజూరాబాద్ ఉపఎన్నిక ప్రచారానికి రాకుండా ఇక్కడ వ్యూహాలు రచించకుండా ఇతర అంశాలకు ప్రాధాన్యతనివ్వడంపై పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? రచ్చ ఏంటి?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ ఎన్నికలను చాలా లైట్‌గా తీసుకుంటున్నట్టే కనిపిస్తోంది. ఎలాగో, అక్కడ తాము పోటీలో లేము కదా అన్నట్టుగా వ్యవహరిస్తోందట. రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టి హుజూరాబాద్ ఉపఎన్నికపై పడినా ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్‌ మాత్రం అంత పట్టింపులేనట్టుగా ఉందట. పట్టు కోసం అధికార పార్టీ, పరువు కోసం బీజేపీ నువ్వా-నేనా అన్నట్టుగా హోరాహోరిగా ప్రచారం చేస్తున్నాయి. సమస్త వ్యూహాలను అక్కడే సమకూర్చి అమలు చేస్తున్నాయి. ఇంత జరుగుతున్నా కూడా హస్తం పార్టీ మాత్రం హుజూరాబాద్ వదిలి మహబూబ్‌నగర్‌లో విద్యార్థి, నిరుద్యోగ జంగ్‌ సైరన్‌ అంటూ సభ నిర్వహించడం సొంత పార్టీలోనే విమర్శలకు దారి తీస్తోందన్న చర్చ జరుగుతోంది. హుజూరాబాద్‌లో ఎన్నికల నియమావళి అడ్డు ఉంటే దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడైనా సభ నిర్వహించి ఉంటే బాగుండేదని, అలా కాకుండా తమకేం సంబంధం అన్నట్టుగా అక్కడెక్కడో సభ జరిపి చేతులు దులుపుకున్నారని ఉత్తర తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు పాలమూరు సభపై మండిపడుతున్నారట. హుజూరాబాద్ ఎన్నికల కోసం సభలు నిర్వహించి కార్యకర్తల్లో జోష్ నింపాల్సిన పీసీసీ చీఫ్‌ తన ఓన్‌ ఏరియాలో తన ప్రాభవం కోసం సభ పెట్టారని సీనియర్లు కొందరు భగ్గుమంటున్నారట.

సాధారణ ఎన్నికల్లో హుజూరాబాద్‌లో గట్టి పోటీనిచ్చిన హస్తం పార్టీ ఈసారి తన సంప్రదాయ ఓటును కూడా పట్టుకోలేక నిరాసక్తి చూపిస్తోందని, దీని వల్ల పార్టీ భారీ నష్టం జరిగే ప్రమాదం ఉందని నేతలు మాట్లాడుకుంటున్నారు. దీనికి తోడు పార్టీ అధిష్టానం హుజూరాబాద్‌లో పార్టీ స్టార్ క్యాంపెయిన్‌ లిస్టును 20 మందితో ఇటీవలే ప్రకటించింది. కానీ ఆ లిస్టులో ఉన్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ వీహెచ్ తప్ప ఇటువైపు ఎవ్వరూ కన్నెత్తి చూడటం లేదట. జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డిలాంటి సీనియర్లు సభలకు దూరంగా ఉంటున్నా కనీసం ప్రచారానికి కూడా రాకపోవడంపై క్యాడర్‌ గుసగుసలాడుతోంది. సభలకు వెళ్లని నేతలన్నా హుజూరాబాద్ ఎన్నికల ప్రచారం పాల్గొంటే హుజూరాబాద్‌ను పార్టీ ప్రెస్టేజియస్‌గా తీసుకుంటుందని ప్రజలు భావించేవాళ్లన్న టాక్‌ వినిపిస్తోంది. ఇది పార్టీలో ఐకమత్యం లోపించిందని చెప్పడానికి, హుజూరాబాద్‌ను మొత్తానికి మొత్తం గాలికొదిలేసిందన్న చర్చకు తమకు తామే తావిచ్చినట్టు అవుతోందని సీనియర్లు చర్చించుకుంటున్నారు.

గెలుపోటములతో సంబంధం లేకుండా దుబ్బాక ఉపఎన్నిక సమయంలో పార్టీ మొత్తం అక్కడే తిష్ట వేసింది. అలాగే హుజూరాబాద్‌లో కూడా రంగంలో దిగితే పోరు మంచి రంజుగా ఉండేదని సీనియర్‌ వ్యూహకర్తలు అంటున్నారు. ఇప్పటికైనా హుజురాబాద్‌లో పరువు నిలుపుకోవాలంటే మరో దుబ్బాకలాగ పనిచేయాలంటున్నాడు సగటు కాంగ్రెస్ కార్యకర్త. మరి పీసీసీ బాస్ ఈ విషయంలో ఎలాంటి వ్యూహాన్ని అమలు చేస్తారో చూడాలి.

Web TitleCongress not Focus on Huzurabad Bypoll
Next Story