రాములమ్మ కాషాయానికి క్లాప్‌ కొడతారా?

రాములమ్మ కాషాయానికి క్లాప్‌ కొడతారా?
x
Highlights

మొన్ననే ముఖానికి మేకప్‌ వేసుకుని, సినిమాల్లో సెకండ్‌ ఇన్నింగ్స్‌‌కు క్లాప్‌ కొట్టారు విజయశాంతి. మరి రాములమ్మ కాంగ్రెస్‌ నుంచి మరో పార్టీలోకి...

మొన్ననే ముఖానికి మేకప్‌ వేసుకుని, సినిమాల్లో సెకండ్‌ ఇన్నింగ్స్‌‌కు క్లాప్‌ కొట్టారు విజయశాంతి. మరి రాములమ్మ కాంగ్రెస్‌ నుంచి మరో పార్టీలోకి వెళ్లేందుకు కూడా క్లాప్‌ కొట్టబోతున్నారన్న ప్రచారం, తెలంగాణ పాలిటిక్స్‌ను హీటెక్కిస్తోంది. కాంగ్రెస్‌లో అశాంతితో రగిలిపోతున్న విజయశాంతి, కాషాయతీర్థం పుచ్చుకుంటే, ప్రశాంతత లభిస్తుందన్న భావనతో ఉన్నారన్న మాటలు, కాక రేపుతున్నాయి. ఘర్‌వాపసీ అంటూ ఏకంగా ఢిల్లీ నుంచి ఆహ్వానాలు అందున్నాయని తెలుస్తోంది. అయితే, శశికళను పీడించిన బీజేపీలోకి వెళ్లేది లేదంటూ, గతంలోనే శపథం చేసిన రాములమ్మ, ఒట్టు తీసి గట్టున పెట్టి, పువ్వు పరిమళాన్ని ఆస్వాదించేందుకు సిద్దమయ్యారన్న ప్రచారానికి లెక్కేలేదు. ఇంతకీ ఫైర్‌ బ్రాండ్‌ రాములమ్మ దారెటు?

తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్. సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ లేడి డాన్‌గా వ్యవహరించి అందరి మన్నలు పొందిన రాజకీయా నాయకురాలు విజయశాంతి. ఆమె ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నా, పార్టీలో క్రియాశీలంగా వ్యవహరించడం లేదని గాంధీభవన్‌లో వినిపిస్తున్న చర్చ. ప్రస్తుతం ఆమె మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టి, రాజకీయాలకు సమయం తగ్గించారు. కాని టి కాంగ్రెస్ నేతలు తనను పట్టించుకోకపోవడం వల్లే, తాను పార్టీ కార్యక్రమాలకూ దూరంగా ఉంటున్నట్లు స్వయంగా సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌లో సీనియర్లు తనను పొమ్మనలేక పొగపెడుతున్నారని కూడా, రాములమ్మ వాపోతున్నారట.

అయితే, హస్తం పార్టీలో అసంతృప్తిగా ఉన్న రాములమ్మను, కాషాయ కండువా కప్పి, సొంతపార్టీ గూటికి తీసుకురావడానికి బిజేపి విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు జోరుగా చర్చ జరుగుతోంది. కాంగ్రెస్‌లో మెజార్టీ సీనియర్లంతా బిజేపి వైపు చూస్తుండటంతో, సినిమా గ్లామర్‌తో పాటు రాజకీయ ఇమేజ్ ఉన్న రాములమ్మను స్వగృహ ప్రవేశం చేయించాలని బిజేపిలో అగ్రనాయకత్వం సీరియస్‌గా ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.

కాంగ్రెస్ సీనియర్లంతా తనను టార్గెట్ చేస్తూ పార్టీలో పట్టనట్టు వ్యవహరిస్తుండడంతో, రాములమ్మ సైతం పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. అయితే, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజేపి వల్లే, తమిళనాడులో శశికల ఇబ్బందుల్లో పడిందనే ప్రచారం ఉండటంతో, ఆమెతో అత్యంత సన్నిహితంగా ఉండే విజయశాంతి, గతంలోనే శశికళపై సానుభూతి చూపారు. ఈ నేపథ్యంలో, తన స్నేహితురాలిని కటకటాల పాలు చేసిన బిజేపి గూటికి విజయశాంతి చేరతారో లేదోనన్న అనుమానం కూడా ఉంది. ఎందుకంటే, గతంలో చిన్నమ్మను ఇబ్బంది పెట్టిన బిజేపిలోకి వెళ్లేది లేదంటూ బహిరంగంగా ప్రకటన చేశారు విజయశాంతి. దీంతో ఆమె కాషాయ తీర్థం పుచ్చుకుంటారా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేమంటున్నారు విజయశాంతి సన్నిహితులు.

కానీ రాజకీయాల్లో శాశ్వత శత్రువు, శాశ్వత మిత్రులు ఉండరనే సామెతను రాములమ్మ నిజం చేస్తారన్న వాదన కూడా బలంగానే వినిపిస్తోంది. తెలంగాణలో బిజేపి బలపడే అవకాశాలు ఉండటంతో, ఆమె అటువైపు వెళ్లే అవకాశముందన్న వాదన ఉంది. దీనికితోడు కాంగ్రెస్‌ నేతలందరూ కాషాయ గూటికి వెళుతుండటంతో, పార్టీలో నైరాశ్యం నెలకొంది. ఎన్నికల్లో ఊరూరా తిరిగి ప్రచారం చేసిన తనకు, ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వడంలేదన్న కోపం కూడా విజయశాంతిలో వుంది. కాంగ్రెస్‌లోనే వుంటే, తనను ఎదగనివ్వరన్న అనుమానమూ ఆమెలో గూడుకట్టుకుంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో, రాములమ్మ పార్టీ మార్పుపై పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. అందుకే రానున్న కాలంలో, విజయశాంతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఉత్కంఠ కలిగిస్తోంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories