పీసీసీలో పొన్నం బాంబ్‌.. సోనియాకు లేఖ రాసి బాంబ్‌ పేల్చిన పొన్నం

Congress Leader Ponnam Prabhakar Letter to Sonia Gandhi
x

పీసీసీలో పొన్నం బాంబ్‌.. సోనియాకు లేఖ రాసి బాంబ్‌ పేల్చిన పొన్నం

Highlights

Ponnam Prabhakar: ఆయన గడగడలాడించే స్పీకర్. మాటల తూటాలు పేల్చే డైలాగ్‌ గన్.

Ponnam Prabhakar: ఆయన గడగడలాడించే స్పీకర్. మాటల తూటాలు పేల్చే డైలాగ్‌ గన్. గల్లీ నుంచి ఢిల్లీ దాకా, ఒకప్పుడు రాజకీయాలను ఇరగదీసిన తెలంగాణ లీడర్. అలాంటి నాయకుడు రూటు మార్చారా? ఇన్నాళ్లూ సైలెంటు‌గా ఉంటూ ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంటున్నారా? పార్టీలో ఇంటర్నల్‌ మ్యాటర్‌ను హైకమాండ్‌ ముందు ఎందుకు తెగేసి చెప్పారు? ఇన్నాళ్ల మౌనాన్ని ఇప్పుడే ఎందుకు బద్దలు కొట్టారు? ఆయన వెనుక ఉన్నది ఎవరు? స్కెచ్‌ గీస్తున్నది ఎవరు? ఇదంతా తన వ్యూహమా పెద్ద నాయకుడి ఉపాయమా? ఇంతకీ ఎవరా నాయకుడు?

పొన్నం ప్రభాకర్. తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ వర్కింగ్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌. పొన్నం ప్రభాకర్ అంటే ఒకప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ దాకా తెలియని రాజకీయ నేతల్లేరు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు, అటు కేంద్రంలో ఇటు రాష్టంలో ఆయన చాలా కీలకమైన లీడర్‌గా చలామణి అయ్యారు. చాలా కిందిస్థాయి నుంచి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన పొన్నం ఎంపీగా గెలిచిన తరువాత కేంద్ర రాజకీయాల్లో కూడా మంచి పేరే తెచ్చుకున్నారు. ఎంపీ ఫోరమ్ కన్వీనర్‌గా కూడా పనిచేశారు. అప్పట్లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అండదండలు కూడా ఉండటంతో పొన్నం ప్రభాకర్‌కు, పార్టీలోనూ అటు ప్రభుత్వంలోనూ హవా నడిపించారు. కానీ తెలంగాణ ఆవిర్భావం తర్వాత, ఆయన పరిస్థితి పూర్తిగా తలకిందులైంది.

సొంత జిల్లా కరీంనగర్‌లోనూ పొన్నం వ్యూహాలు రాజకీయంగా చాలానే ఫలించాయి. ఎన్‌ఎస్‌యూఐ నుంచి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నో వ్యూహాలతో ఆయన పైకి వచ్చారు. అలాంటి నేత, కొన్నాళ్ల నుంచి డీలా పడిపోయారు. పదేళ్ల కిందటి వరకు కూడా తన మాటంటే శాసనంగా నడిచిన పొన్నం, రాజకీయ ఎదరుదెబ్బలు తింటున్నారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయిన నాటి నుంచి నేటి వరకు మళ్లీ కోలుకోలేదు పొన్నం. ఇటు క్యాడర్‌లో కూడా మనోస్దైర్యం నింపడంలోను, పొన్నం విఫలం అవుతున్నారనే చర్చ జరుగుతోంది.

2014 ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత పొన్నం పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో యాక్టీవ్‌గా కొన్నాళ్లు పనిచేసినా పార్టీలో పరిణామాలపై ఏనాడూ పెద్దగా స్పందించింది లేదు. ఆ మాటకొస్తే అసలేమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు. వేలాది మంది హార్డ్‌కోర్‌ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు పార్టీని వీడినా సైలెంటే సమాధానమన్నారు. రాజకీయంగా ప్రత్యర్థి పార్టీలపై ఆరోపణలు చేసినా పార్టీలో అంతర్గత అంశాలను మాత్రం ఏనాడూ బయటపెట్టింది లేదు. కానీ, పార్టీలో కొత్త కమిటీ ఏర్పాటు, ఈటల రాజీనామా సందర్భంగా కాంగ్రెస్ స్టాండ్‌పై వ్యూహాత్మకంగా వ్యవహరించి వార్తల్లో నిలిచారు పొన్నం.

ఇన్ని రోజులు మౌనంగా ఉన్న మాజీ ఎంపీ పొన్నం ఇప్పుడే ఎందుకు నోరు విప్పారు? ఇదే రాజకీయాల్లో, ప్రత్యేకించి కాంగ్రెస్‌ పార్టీలో హాట్‌చర్చకు దారితీస్తోంది. హుజూరాబాద్‌లో పార్టీ ఘోర ఓటమి తర్వాత ఆ నియోజకవర్గం బాధ్యులను అధిష్టానం ఢిల్లీకి పిలించి మాట్లాడింది. దీనిపై ఈనెల 12 వరకు సైలెంట్‌గా ఉన్న ప్రభాకర్ 12వ తేదీ రాత్రి ఎవ్వరూ ఊహించని విధంగా పార్టీలో ఓ బాంబ్ పేల్చారు. ఒక్క హుజూరాబాదే కాదు అంతకుముందు జరిగిన దుబ్బాక, గ్రేటర్‌ హైదరాబాద్‌, నాగార్జునసాగర్‌ ఎన్నికల్లో ఓటమిపై కూడా రివ్యూ నిర్వహించాలంటూ అధినేత్రి సోనియాగాంధికి లేఖ రాశారు. అదే అంశంపై ఈనెల 13న హస్తినలో జరిగిన కీలక సమావేశంలో కూడా పొన్నం సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌లో ఇంకా టీఆర్ఎస్‌ కోవర్టులు ఉన్నారంటూ చెప్పారు. దీంతో రివ్యూ కాస్తా రసాభాసగా మారిందన్న చర్చ పార్టీలో జోరుగా జరుగుతోంది.

అయితే, పొన్నం చేసిన తాజా ఎదురుదాడి మాజి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపైనే అంటారు సీనియర్లు. కేవలం ఆయన స్వప్రయోజానాల కోసం వరసకు తమ్ముడైన కౌశిక్‌రెడ్డికి గులాబీ పార్టీలోకి పంపి, కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేశారని పొన్నం స్వయంగా అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో కాంగ్రెస్ పార్టీలో కలకలం రేగింది. కాకపోతే, ఇన్ని రోజులు మౌనంగా ఉన్న పొన్నం ఒక్కసారిగా ఇలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది.? ఎందుకు నోరు విప్పాల్సి వచ్చిందన్న దానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. తన సొంత పార్లమెంటు నియోజకవర్గంలో పార్టీ నష్టపోవడానికి కారణం నాటి పీసీసీ చీఫ్‌గా ఉన్న ఉత్తమేనన్నది పొన్నం భావనట.

అదీగాక, హుజూరాబాద్‌లో ఘోర పరాజయం తర్వాత కూడా ఏమీ మాట్లాడకుండా అధిష్టానం సమీక్షకని పిలిచే రోజు ఇలా బ్లాస్ట్‌ అవడం వెనుక ఇన్‌చార్జ్ మాణిక్కం ఠాగూర్ వ్యూహం ఉందని పార్టీలో కొందరు నేతలు చెప్పుకుంటున్నారు. కేవలం హుజూరాబాద్ ఉపఎన్నికపై చర్చ సాగితే రేవంత్, మాణిక్కం తప్పిదాలనే హైలైట్‌ చేసినట్టు అవుతుందని, అందుకే ఇలా మాట్లాడి డైవర్ట్‌ చేసేందుకే పొన్నంను ఠాగూర్‌ ఒక పావుగా వాడుకున్నారన్న టాక్‌ వినిపిస్తోంది. తప్పంతా ఉత్తమ్‌కుమార్‌దే అన్నట్టుగా అంతా సీన్‌ క్రియేట్‌ చేసేందుకే మాణిక్కం ఇలా ప్లాన్ చేసి ఉంటారన్న ప్రచారం జరుగుతోంది. నిజానికి పొన్నం ప్రభాకర్‌, ఠాగూర్ ఇద్దరు క్లోజ్‌ఫ్రెండ్స్‌ కావడం కూడా ఈ స్కెచ్‌కు కారణంగా గాంధీభవన్‌లో మాట్లాడుకుంటోంది. ఏమైనా పొన్నం చేసిన ఈ కామెంట్స్‌ రేవంత్‌రెడ్డికి తాత్కాలికంగా ఊరట కలిగించినా భవిష్యత్తులో సీనియర్ల పాత పంచాయితీలకు, ఇప్పుడు రాజుకుంటున్న కొత్త వివాదాలకు ఆయన ఎలా పుల్‌స్టాప్‌ పెడతారో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories