Telangana: తెలంగాణలో ఎలక్షన్ హీట్ పెంచుతున్న ప్రధాన పార్టీలు

Congress, BRS Increasing Election Heat in Telangana
x

Telangana: తెలంగాణలో ఎలక్షన్ హీట్ పెంచుతున్న ప్రధాన పార్టీలు  

Highlights

Telangana: వరుస సమావేశాలు నిర్వహిస్తున్న కాంగ్రెస్

Telangana: తెలంగాణలో ఎన్నికల వేడి పెరుగుతోంది. ప్రధాన పార్టీలు... ఆశావా‍హుల బలాబలాలను అంచనా వేస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీలో అభ్యర్థి ఎవరు..? ప్రజల్లో ఆ వ్యక్తికి ఏ స్థాయిలో మద్దతు ఉందన్న కోణంలో సొంత పార్టీ అభ్యర్థిపై కసరత్తలు చేస్తున్నాయి. వీలైనంత త్వరగా ఫైనల్ లిస్టు సిద్ధం చేసి అభ్యర్థులను ప్రకటిస్తే... ప్రచార పర్వంలో జోరు పెంచాలని తహతహలాడుతున్నాయి. ఇప్పటికే అధికార బీఆర్ఎస్, విపక్ష కాంగ్రెస్‌లు అభ్యర్థులను ఫైనల్ చేసే పనిలో పడ్డాయి. వచ్చే నెలలో రెండు పార్టీలు కొంత మంది అభ్యర్థులకు సీట్లను ఖరారు చేసే అవకాశాలు కనిస్తున్నాయి.

అసెంబ్లీ ఎన్నికలకు అధికార బీఆర్ఎస్ పార్టీ సిద్దమవుతోంది. ఇక వచ్చే ఎన్నికలకు బీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్ కసరత్తులు చేస్తున్నారు. ఒక వైపు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థానలు మరో వైపు పార్టీ కార్యక్రమాలతో కొన్ని నెలలుగా బీఆర్ఎస్ నేతలు ప్రజా క్షేత్రంలో ఉంటున్నారు. ఇక అధినేత కేసీఆర్‌తో పాటు కీలక నేతలు కేటీఆర్,హరీష్ రావు,కవిత జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టారు.

అధికార బీఆర్ఎస్ పార్టీలో టిక్కెట్ల కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు అనేక మంది నేతలు ఎన్నికల బరిలో దిగేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పటి నుండే ఆయా నియోజకవర్గాల్లో పోటాపోటీ కార్యక్రమాలు చేస్తూ అధిష్ఠానం దృష్టిలో పడేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారు. ఈ సారి ఎన్నికలకు ముందుగానే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు గులాబీ బాస్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేస్తున్నట్లుగా చర్చ జరుగుతోంది. ఇక అభ్యర్థులను ముందుగానే ఖరారు చేయడం ద్వారా ఆయా నియోజకవర్గాల్లో బిఆర్ఎస్ నేతల్లో అసమ్మతి కనిపిస్తే సరిదిద్దుకోవడంతో పాటుగా బుజ్జగించడానికి అవకాశం ఉంటుందని గులాబీ బాస్ కేసీఆర్ భావిస్తున్నారు. దీని ద్వారా నియోజకవర్గాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలని ఒకవేళ మాటవినని నేతలను వదులుకోవడానికి సైతం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

గతంలో జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ 2014 లో విడతల వారీగా బిఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించగా ఇక 2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఐదుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలను మినహాయించి ఒకే సారి అభ్యర్థులను ప్రకటించారు. ఈ సారి ముందుగానే దాదాపు 80 మంది అభ్యర్థులను ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది.

బీఆర్ఎస్‌ను ఎదుర్కొవాలంటే ఓ అడుగు ముందే ఉండాలని కాంగ్రెస్ భావిస్తోంది. కర్ణాటక బూస్ట్‌తో ముందుకు వెళ్లాలని భావిస్తున్న కాంగ్రెస్ అధినాయకత్వం... ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఎన్నికలకు వెళ్లేందుకు ప్రణాళిక, పార్టీ నిర్మాణం, ఎన్నికల్లో దృష్టి సారించాల్సిన అంశాలు, మేనిఫెస్టో రూపకల్పన, వివిధ వర్గాలకు ప్రాధాన్యం, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అవినీతి, అప్రజాస్వామిక పాలనను ఎండగట్టడం, టికెట్ల పంపిణీ వంటి అనేక అంశాలపై దాదాపు నిన్న ఖర్గే నేతృత్వంలో ఢిల్లీలో ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో ఏఐసీసీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వచ్చే నెలలోనే మెజారిటీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తామని ఏఐసీసీ మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీ తెలిపారు. గెలిచే వారికే టికెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. ఎన్నికలకు సంబంధించిన కమిటీలను పది రోజుల్లో ప్రకటిస్తామన్నారు. నేతల మధ్య సఖ్యత లేకపోవడంపై సైతం కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. సొంతపార్టీలోనే ఒకరిపై మరొకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటే ప్రజల్లో వ్యతిరేక సంకేతాలు వెళతాయని గుర్తించిన ఏఐసీసీ... అంతర్గత వ్యవహారాలు, విభేదాల గురించి బాహాటంగా మాట్లాడితే చర్యలు తప్పవని హెచ్చరించినట్లు తెలుస్తోంది. మొత్తంగా వచ్చే నెలాఖరులోగా అభ్యర్థులను ప్రకటించి నాయకులను ప్రజాక్షేత్రంలో ఉంచాలని కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తోంది.

గత ఎన్నికల్లో అనుసరించిన పంధాకు పూర్తి భిన్నంగా వెళ్లాలని కాంగ్రెస్,బీఆర్ఎస్‌లు భావిస్తుండటంతో తెలంగాణలో ఎన్నికల వేడి మరింత పెరిగింది. గత ఎన్నికల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రమే అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు ఈసారి ముందే ప్రకటించాలని చూస్తున్నారు. అభ్యర్థులను ఖరారు చేస్తే రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం నిర్వహించడం ద్వారా మంచి ఫలితాలు రాబట్టాలని రెండు పార్టీలు అంచనాలు వేస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories