CM Revanth Reddy: రూ.50 కోట్లతో దివ్యాంగులకు భరోసా.. సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: రూ.50 కోట్లతో దివ్యాంగులకు భరోసా.. సీఎం రేవంత్ రెడ్డి
x

CM Revanth Reddy: రూ.50 కోట్లతో దివ్యాంగులకు భరోసా.. సీఎం రేవంత్ రెడ్డి

Highlights

CM Revanth Reddy : ప్రజా భవన్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘బాల భరోసా’ పథకం, ‘ప్రణామ్’ డే కేర్ సెంటర్లను ప్రారంభించారు. రూ.50 కోట్లతో దివ్యాంగులకు ఆధునిక సహాయ ఉపకరణాల ఉచిత పంపిణీ చేపట్టిన ప్రభుత్వం, వారికి విద్య, ఉద్యోగాలు, వివాహం, క్రీడల్లో ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తామని సీఎం వెల్లడించారు.

CM Revanth Reddy: ప్రజా భవన్‌లో “బాల భరోసా” పథకం, “ప్రణామ్” డే కేర్ సెంటర్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగులకు సహాయ ఉపకరణాల ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని కూడా సీఎం ప్రారంభించారు. కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, దామోదర రాజనర్సింహ, సీతక్క, ఎంపీలు బలరాం నాయక్, అనిల్ కుమార్ యాదవ్‌తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ప్రజా భవన్‌లో దివ్యాంగులకు రెట్రోఫిట్టెడ్ మోటరైజ్డ్ వాహనాలు, బ్యాటరీతో నడిచే ట్రైసైకిళ్లు, బ్యాటరీ వీల్ చైర్లు, ల్యాప్‌టాప్‌లు, వినికిడి యంత్రాలు, మొబైల్ ఫోన్లు సహా అత్యాధునిక సహాయ పరికరాలను ఉచితంగా పంపిణీ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం రూ.50 కోట్లు కేటాయించిందని సీఎం వెల్లడించారు. ఈ పంపిణీ కార్యక్రమాన్ని దివ్యాంగుల సహకార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు.

కార్యక్రమంలో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దివ్యాంగులు సమాజంలో ఆత్మగౌరవంతో జీవించేలా తమ ప్రభుత్వం మానవీయ దృక్పథంతో పని చేస్తోందని చెప్పారు. ఒక కుటుంబ సభ్యుల్లా వారికి భరోసా కల్పించేందుకే రూ.50 కోట్ల నిధులను కేటాయించామని తెలిపారు. విద్య, ఉద్యోగ నియామకాల్లో దివ్యాంగులకు వారి కోటాను పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నామని, దివ్యాంగుల వివాహానికి రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందించాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

క్రీడల్లో దివ్యాంగులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో పారాలింపిక్స్‌లో విజయం సాధించిన యువతికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చామని సీఎం గుర్తుచేశారు. పోటీ ప్రపంచంలో తాము వెనుకబడ్డామనే భావన లేకుండా అన్ని రంగాల్లో దివ్యాంగులకు అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆత్మస్థైర్యంతో జీవితంలో ముందుకు సాగాలని సూచించారు.

బెస్ట్ పార్లమెంటేరియన్‌గా ఎదిగిన కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి దివ్యాంగులకు స్ఫూర్తిగా నిలిచారని, వైకల్యాన్ని అడ్డంకిగా భావించకుండా ఉన్నత స్థాయికి ఎదిగిన గొప్ప వ్యక్తిగా ఆయనను ప్రశంసించారు. రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కో-ఆప్షన్ సభ్యుడిగా ఒక ట్రాన్స్‌జెండర్‌ను కార్పొరేటర్‌గా నామినేట్ చేయాలని సూచిస్తూ, తద్వారా వారి సమస్యలను వారు స్వయంగా ప్రస్తావించే అవకాశం కలుగుతుందని అన్నారు.

అలాగే వయోవృద్ధులకు ప్రభుత్వం కుటుంబంగా మారి ‘ప్రణామ్’ పేరుతో డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే, ప్రతినెల జీతంలో 10 శాతం నేరుగా తల్లిదండ్రుల ఖాతాలో జమ చేసేలా చట్టం తీసుకువస్తామని సీఎం స్పష్టం చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ నూరుశాతం వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, వచ్చే బడ్జెట్ సమావేశాల్లో హెల్త్ పాలసీని ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. సామాజిక న్యాయం, సమాన అవకాశాల కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో కులగణన నిర్వహించామని, తెలంగాణ మోడల్‌ను కేంద్ర ప్రభుత్వం కూడా అనుసరించేందుకు అంగీకరించిందని తెలిపారు.

ప్రజా ప్రభుత్వంలో ఎస్సీ వర్గీకరణను అమలు చేసి సమాన అవకాశాలు కల్పిస్తున్నామని, ఒకప్పుడు సామాన్యులకు ప్రవేశం లేని ప్రజా భవన్‌ను ఇప్పుడు అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చామని సీఎం పేర్కొన్నారు. ఈ ప్రభుత్వానికి ధర్మగంట ఉందని, ఎవరు ఏ సమస్య చెప్పినా విని పరిష్కరించడమే తమ లక్ష్యమని తెలిపారు. తెలంగాణను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా, పేదల సంక్షేమ రాష్ట్రంగా తీర్చిదిద్దుకుందామని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories