ఖమ్మంలో వన్‌ మ్యాన్‌ షో.. గులాబీ బాస్‌ పక్కనపెట్టేశారా?

CM KCR Put Khammam District Leaders  Aside
x

ఖమ్మంలో వన్‌ మ్యాన్‌ షో.. గులాబీ బాస్‌ పక్కనపెట్టేశారా?

Highlights

CM KCR: తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాలకు ఆజ్యం పోసిన గడ్డపై సర్కార్‌ నిర్లక్ష్యం చూపుతోందా?

CM KCR: తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాలకు ఆజ్యం పోసిన గడ్డపై సర్కార్‌ నిర్లక్ష్యం చూపుతోందా? ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులుగా పనిచేసిన ఉద్దండుల జిల్లాపై వివక్ష కనబరుస్తోందా? అయితే, తెలంగాణ ఆవిర్భావం తర్వాత టీఆర్ఎస్ పార్టీకి మొండిచేయి చూపిన ఖమ్మం జిల్లాలో రాజకీయ పదవులలో కొంత నిర్లిప్తత కనపడుతోందన్న మాటకు అవుననే సమాధానం వస్తుంది. నిజంగానే, ఖమ్మం జిల్లాను గులాబీ బాస్ పక్కన పెట్టారా? రాజకీయ చదరంగంలో వన్ మ్యాన్ షో నడుస్తుందా?

ఖమ్మం జిల్లాలో ఐదు దశాబ్దాల నుంచి రాజకీయ చైతన్యంలో ఎందరో నాయకులు ఆరితేరారు. పదుల సంఖ్యలో అత్యున్నత స్థాయికి ఎదిగారు. ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత వివిధ స్థాయిల్లో పలువురు కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో మంత్రులుగా జిల్లా అభివృద్ధికి బాటలు వేశారు. 2014 రాష్ట్ర విభజనతో ఖమ్మం జిల్లాలో కీలకమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. నాటి ఎన్నికల్లో రాష్ట్రమంతా గులాబీ పార్టీకి జై కొట్టినా ఖమ్మం జిల్లా మాత్రం వివిధ రాజకీయ పార్టీలకు చోటు కల్పించి వినూత్నమైన తీర్పు ఇచ్చింది.

అలా, ఖమ్మం జిల్లాలో పార్టీ బలహీనంగా ఉందని భావించిన గులాబీ బాస్ ఇక్కడ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. 2015లో జిల్లాలో కీలకంగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్‌లను పార్టీలోకి ఆహ్వనించడంతో గులాబీ పార్టీ గుభాళించడంతో బలహీనంగా ఉన్న పార్టీ కాస్తా బలంగా కనిపించింది. 2018 ముందస్తు ఎన్నికల్లో కొందరు చేసిన తప్పిదాలకు 2014 ఎన్నికల ఫలితాలే పునరావృతమయ్యాయి. ఓటమికి గల కారణాలపై టీఆర్ఎస్ పోస్టుమార్టం చేసింది. తమ ఎదుగుదలకు మరొకరు ఆడ్డు అవుతారని భావించిన నేతలు చాపకిందనీరులా ప్రత్యర్ధులకు లోపాయికారిగా సాయం చేసారన్న అంచనాకు వచ్చింది. ఒక్క సీటు గెలుపుతో కొంత ఇబ్బంది పడిన గులాబీ బాస్ పార్టీ ఫిరాయింపులకు అభివృద్ధి పేరుతో పచ్చ జెండా ఊపడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏడుగురు ఎమ్మెల్యేలు గులాబీ కండువా కప్పుకున్నారు.

దీంతో ఖమ్మం జిల్లాలో ఆ పార్టీ బలం మరింత పెరిగిందని అధిష్టానం భావించింది. కానీ, ఇదే భవిష్యత్తులో గుదిబండగా మారబోతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో 2015లో టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన కీలక నేతలు తుమ్మల, పొంగులేటికి పదవుల పందెరంలో అధిష్టానం చిన్నచూపు చూస్తోందన్న టాక్‌ నడుస్తోంది. జిల్లాలో బలమైన నేతలుగా ఉన్న ఆ ఇద్దరూ పదవులు లేక పార్టీలో ముందుకు పోలేక ఇబ్బందులు పడుతున్నారట. ఆ ఇద్దరు నేతలు వివిధ నియోజకవర్గాలలో గెలుపోటములను శాసించే స్థాయిలో ఉన్నా గులాబీ బాస్ ప్రాధాన్యం ఇవ్వకపోవడం పట్ల కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తిగా ఉన్నారట.

తాజాగా రాష్ట్రంలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలలో ఖమ్మం జిల్లాకు ప్రాధాన్యత లభిస్తోందని అందరూ భావించారు. కానీ ఖమ్మం జిల్లాకు మొండి చేయిచూపారు. మాజీ ఎంపీ పొంగులేటికి రాజకీయ సమీకరణాలతో 2019లో ఖమ్మం ఎంపీ సీటు దక్కలేదు. భవిష్యత్తులో మంచి అవకాశం ఇస్తామన్న అధినేత మాట ఇప్పటికీ నెరవేరకపోవడంతో ఆయన అభిమానుల్లో నైరాశ్యం నెలకొందట. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాలలో మంచి పట్టు ఉన్న నేతను పక్కన పెట్టడం ఏంటని ఆయన వెంట ఉన్న నేతలు ప్రశ్నిస్తున్నారు.

మరో కీలక నేత మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలా తయారైందట. 2018 ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధి కందాల ఉపేందర్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అభివృద్ది మంత్రంలో కందాల గులాబీ తీర్ధం పుచ్చుకోవడంతో తుమ్మల పరిస్థితి కొంత సంకటంగానే ఉందన్న చర్చ నడుస్తోంది. ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తారన్న ఆశలు అడియాశలు అవడంతో అనుచరులు కారాలు, మిరియాలు నూరుతున్నారు. ఖమ్మం జిల్లాలో ఒకేఒక్కడిగా నిలబడటం ఆనవాయితీగా వస్తోందని, అదే మళ్లీ కావాలని గులాబీ బాస్ కోరుకుంటున్నట్లుగా ఉందని అసంతృప్త నేతల ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు.

రాజకీయాలలో బళ్లు ఓడలు ఓడలు బళ్లు అవుతాయని మరో రెండేళ్లు ఓపిక పట్టాలని తమ అనుచరులను పదవులు రాని నేతలు ఓదారుస్తున్నా వన్ మ్యాన్ షో పార్టీకి చేటు అన్న విషయాన్ని అధిష్టానం గుర్తించకపోవడం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పోటీ ఉంటేనే పట్టుదలతో పని చేస్తారన్న లాజిక్ పార్టీ ఎందుకు మిస్ అయిందని కార్యకర్తలు అడుగుతున్నారు. మరి ఈ విషయంలో హైకమాండ్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories