కొత్త చట్టాల ఫలితాలు చివరి గుడిసెదాకా అందాలి : సీఎం కేసీఆర్
తెలంగాణ ప్రభుత్వం దార్శనికతతో రూపొందిస్తున్న నూతన చట్టాల అమలు సందర్భంగా, ఏ ఒక్క నిరుపేదకూ బాధ కలుగకుండా, చివరి గుడిసె వరకు వాటి ఫలితాలు అందేలా చూడటమే...
తెలంగాణ ప్రభుత్వం దార్శనికతతో రూపొందిస్తున్న నూతన చట్టాల అమలు సందర్భంగా, ఏ ఒక్క నిరుపేదకూ బాధ కలుగకుండా, చివరి గుడిసె వరకు వాటి ఫలితాలు అందేలా చూడటమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. నూటికి నూరుశాతం ప్రజలే కేంద్ర బిందువులుగా, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తీసుకొస్తున్న నూతన చట్టాల అమలు కోసం ప్రజాప్రతినిధులు, అధికారులు 24 గంటలూ శ్రమించాల్సిన అవసరం ఉందన్నారు. దశాబ్దాల కాలంగా వలసపాలనలో అపరిష్కృతంగా ఉన్న నివాస స్థలాలు, సంబంధిత భూ సమస్యల పరిష్కారానికై మున్సిపాలిటీల పరిధిలోని ప్రజా ప్రతినిధులు, మేయర్లతో సీఎం కేసీఆర్ గురువారం ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. మున్సిపాలిటీల పరిధిలో ఇప్పటికీ ఆన్ లైన్ లో నమోదుకాని ప్రజల ఇండ్లు, ప్లాట్లు, అపార్టుమెంట్ ఫ్లాట్స్, వ్యవసాయేతర ఆస్తుల వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేసే ప్రక్రియలో క్షేత్రస్థాయిలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి వారికి సూచించారు.
స్వయంపాలనలో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న విప్లవాత్మక పాలనా సంస్కరణల్లో భాగంగా అమలు పరుస్తున్న వినూత్న చట్టాలు పదికాలాలపాటు ప్రజలకు మేలు చేయనున్నాయని సీఎం పేర్కొన్నారు. అయితే వీటి అమలు క్రమంలో నిరుపేదలకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చట్టాలను జాగ్రత్తగా కార్యాచరణలో పెట్టాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులు, అధికారులదే అన్నారు. భూములను క్రమబద్దీకరించడం ద్వారా పేదల నుంచి వచ్చే పైసలతో ఖజానా నింపుకోవాలని తమ ప్రభుత్వం చూడటం లేదని సీఎం ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ధరణి పూర్తిస్థాయిలో రూపుదిద్దుకునే లోపే ప్రజలు ఎదుర్కొంటున్న భూములు, ఆస్తుల సమస్యలన్నింటినీ గుర్తించి, వాటికి విధానపరమైన పరిష్కారాలను రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. హైదరాబాద్ నగరంలోపాటు, రాష్ట్రంలోని అన్ని మిగతా పట్టణాలు, పల్లెల్లో నివాస స్థలాల సమస్యలేకాకుండా, దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న నిర్మాణాలు, ఇండ్లు, ఆస్తుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలని సీఎం నిర్ణయించారు.
తెలంగాణ ఏర్పడ్డ తొలినాళ్లలో భూముల ధరలు పడిపోతాయని గిట్టనివాళ్లు శాపాలు పెట్టారు. కానీ, వారి అంచనాలను తలక్రిందులు చేస్తూ తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో వ్యవసాయ, వ్యవసాయేతర భూములకు విపరీతంగా డిమాండ్ పెరుగుతూ వస్తున్నది. సుస్థిరపాలన వల్ల భూ తగాదాలు, భూకబ్జాలు, దౌర్జన్యాలు, వేధింపులు, గుండాగిరీ తగ్గింది. కళ్లకు కడుతున్న అభివృద్ధి హైదరాబాద్ నగరానికి ఉండే గంగా జమునా సంస్కృతిని ద్విగుణీకృతం చేసింది. మార్వాడీలు, గుజరాతీలు, సింథీలు, పార్శీలు, దేశం నలుమూలల నుంచీ వచ్చి హైదరాబాద్ లో స్థిరపడ్డ ప్రజలు తమ భవనాలను, ఆలయాలను నిర్మించుకొని, వారి సంస్కృతులను స్వేచ్ఛగా చాటుకుంటున్నారు. మరోపక్క తెలంగాణ రాకముందు కరువుతో అల్లాడిన గ్రామాల ప్రజలు హైదరాబాద్ నగరానికి వచ్చి స్థిరపడ్డారు. నిరుపేద ముస్లింలు పాతబస్తీలోనే కాకుండా న్యూసిటీ తదితర ప్రాంతాల్లో ఉన్నారు. పేదరికానికి కులం, మతం లేదు. కులాలు, మతాలకు అతీతంగా అవసరమున్న ప్రజలందరి కోసం పనిచేసే ప్రభుత్వం మనది అని సీఎం అన్నారు.
గుణాత్మక మార్పుకోసం, ప్రజల జీవితాల్లో పరివర్తన కోసం చట్టాలలో మార్పులు తెచ్చినపుడు గరీబులకే అత్యధిక ప్రాధాన్యతనివ్వాలి. ధరణి వెబ్ పోర్టల్ ను వినియోగంలోకి తీసుకు రావడం ద్వారా ఈ లక్ష్యం నెరవేరుతుంది. పేదల ఆస్తులకు పూర్తి రక్షణ దొరుకుతుంది. వ్యవసాయ భూములను ఆకుపచ్చ పాస్ పుస్తకాలను, వ్యవసాయేతర ఆస్తులకు మెరూన్ రంగు పాస్ బుక్కులను అందజేయడం ద్వారా ప్రజలకు సంబంధించిన ప్రతి అంగుళం ఆస్తిని ఆన్ లైన్ లో నమోదు చేయడం జరుగుతుంది. ఒకనాడు స్లమ్ ఏరియాల్లోని గుడిసె నివాసాలు అభివృద్ధితో నేడు పక్కా ఇండ్లు, బంగళాలుగా మారాయి. ప్రజలు మనల్ని భారీ మెజారిటీతో గెలిపించారు. వారి గుండె తీసి మన చేతుల్లో పెట్టారు. చారిత్రిక విజయాన్ని కట్టబెట్టి, మనల్ని కడుపులో పెట్టుకున్న ప్రజల కోసం అహర్నిశలూ శ్రమించ వలసిన బాధ్యత ఉన్నది. నోటరీ, జీవో 58,59 ద్వారా పట్టాలు పొందిన లబ్దిదారులకు, దశాబ్దాలుగా ఇండ్లు కట్టుకొని నివసిస్తున్న పేదలకు మేలు చేకూర్చే విధంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయి. ఎన్ని పనులున్నా రద్దు చేసుకొని ప్రజా ప్రతినిధులు, అధికారులు వార్డుల వారీగా తిరుగుతూ, ప్రజల ఆస్తుల వివరాలు సేకరించి, ఆన్ లైన్ లో పొందుపరిచేలా చూడాలి. భూములకు, ఆస్తులకు సంబంధించిన సూక్ష్మ సమాచారం సైతం అప్ డేట్ చేయాలి. అని సీఎం ప్రజా ప్రతినిధులు, అధికారులకు సూచించారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire